WazirX: వజీరిక్స్‌ ఖాతాల్లో రూ.64.67 కోట్ల నగదు జప్తు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ వజీరిక్స్‌ యాజమాన్య సంస్థ జన్మయి ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్లలో ఒకరైన సమీర్ కార్యాలయం, ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) సోదాలు నిర్వహించింది. పలు అవకతవకల్ని గుర్తించిన సంస్థ.. వజీరిక్స్‌ బ్యాంకు ఖాతాల్లో రూ.64.67 కోట్ల నిధులను జప్తు చేసింది.

ఇటీవల అధిక వడ్డీ వసూలు చేసి అమాయకులను పీడించిన కేసులో పలువురు లోన్‌యాప్‌ నిర్వాహకుల ఆగడాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వీరు వజీరిక్స్‌ ద్వారా క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది. తద్వారా నగదును విదేశాలకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ లోన్ యాప్స్ నిర్వహణలో పలు బ్యాంకింగేతర సంస్థ (NBFC)లు కూడా ఉన్నట్లు ఈడీ విచారణలో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పలు లోన్‌ యాప్‌ నిర్వాహకులకు చెందిన రూ.250 కోట్లను ఈడీ అధికారులు జప్తు చేశారు.

ఎన్‌బీఎఫ్‌సీలు దాదాపు రూ.4,500 కోట్లను లోన్‌యాప్స్‌ ద్వారా రుణాలిచ్చినట్లు ఈడీ గుర్తించింది. అధిక వడ్డీ ద్వారా రూ.820 కోట్ల లాభాలను ఆర్జించినట్లు తేల్చింది. ఈ నగదును వజీరిక్స్‌లో పెట్టుబడుల రూపంలో హవాలా మార్గంలో చైనా, హాంకాంగ్‌కు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. లోన్ యాప్ నిర్వాహకుల వెనక చైనీయుల హస్తముందా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.


మరిన్ని

ap-districts
ts-districts