Health Insurance: మీ ఆరోగ్య బీమా పాల‌సీలో యాన్యువ‌ల్ మెడిక‌ల్ చెకప్ ఉందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు ఆరోగ్య బీమా పాల‌సీలు యాన్యువ‌ల్ హెల్త్ చెక‌ప్ ప్ర‌యోజ‌నాన్ని అందిస్తున్నాయి. దీంతో పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి ప్ర‌తి సంవ‌త్స‌రం ఉచితంగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌చ్చు. ఈ వైద్య ప‌రీక్ష‌లతో పాల‌సీదారుడు.. అత‌డు/ఆమె ప్ర‌స్తుత ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోవ‌డంతో పాటు, వివిధ ర‌కాల వ్యాధుల‌ను ప్రాథ‌మిక స్థాయిలోనే గుర్తించ‌వ‌చ్చు. ముఖ్యంగా జీవ‌న‌శైలి వ్యాధులైన మధుమేహ్యం, అధిక ర‌క్త‌పోటు వంటివి ఒక్కోసారి ప్రాణాంత‌కంగా మారుతుంటాయి. ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు క్లిష్ట‌మైన వ్యాధుల బారిన ప‌డ‌కుండా నివారించ‌వ‌చ్చు. 

యాన్యుటీ హెల్త్ చెక‌ప్‌లో కవర్ అయ్యే వైద్య‌ ప‌రీక్ష‌లు.. 
*
కంప్లీట్ బ్ల‌డ్ కౌంట్ (సీబీసీ)
రక్తంలో చక్కెర స్థాయిల‌ను తెలుసుకునే పరీక్ష
రక్తపోటు పరీక్ష
సాధారణ శారీరక పరీక్ష
మూత్ర పరీక్ష
కిడ్నీ ఫంక్షన్ పరీక్ష
లిపిడ్ ప్రొఫైల్
విటమిన్ లోపాల కోసం పరీక్షలు
కాలేయ పనితీరు పరీక్ష
ఊపిరితిత్తుల పనితీరు పరీక్ష
ఎక్స్-రే
ఈసీజీ
సోనోగ్రఫీ
పాప్ స్మియర్ పరీక్ష 

వార్షిక వైద్య ప‌రీక్ష‌లతో కూడిన ఆరోగ్య బీమా పాల‌సీ కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు..

ఆరోగ్య స్థితి తెలుసుకోవ‌చ్చు: క్ర‌మంత‌ప్ప‌కుండా ఆరోగ్యాన్ని ప‌ర్య‌వేక్షించేందుకు స‌హాయ‌ప‌డుతుంది. వివిధ అవ‌య‌వాల ప‌నితీరు తెలుసుకోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు.. లిపిడ్ ప్రొఫైల్ ప‌రీక్ష‌ను తీసుకుంటే.. ఇది శ‌రీరంలోని కొవ్వు(కొల‌స్ట్రాల్‌) స్థాయిల‌ను తెలియ‌జేస్తుంది. నిజానికి మ‌నిషి శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు కొవ్వు కొంత వ‌ర‌కు అవ‌స‌ర‌మే. కానీ, మారుతున్న జీవన‌శైలి అల‌వాట్ల కార‌ణంగా కావాల్సిన దానికంటే అద‌న‌పు కొవ్వు శ‌రీరంలో పేరుకు పోయి అనేక అనారోగ్యాలకు కార‌ణం అవుతుంది. శ‌రీరంలో ఉన్న కొవ్వు స్థాయిల‌ను తెలుసుకుని త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు అనారోగ్యాల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చ‌ని నిపుణ‌లు అంటున్నారు. ఇలాంటి వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేసుకునేందుకు వార్షిక వైద్య ప‌రీక్ష‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. 

వ్యాధుల‌ను ప్రారంభంలోనే గుర్తించ‌వ‌చ్చు: ప్రారంభ ద‌శ‌లోనే గుర్తించ‌గ‌లిగితే చాలా వ‌ర‌కు వ్యాధుల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతుంటారు. వార్షిక వైద్య ప‌రీక్ష‌లు ప్రాథమిక స్థాయిలోనే వ్యాధుల‌ను నిర్ధారించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ఎక్కువ శారీర‌క, మాన‌సిక ఒత్తిడికి గురికాకుండా వ్యాధి బారి నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి, ఈసీజీ అనేది గుండెకి సంబంధించిన అనేక విష‌యాల‌ను (ర‌క్త నాళాల‌లో అవ‌రోధాలు, అసాధార‌ణ గుండె ల‌య‌లు) తెలియ‌జేస్తుంది. పాప్ స్మియర్ పరీక్ష గర్భాశ‌య క్యాన్స‌ర్‌ను ప్రాథ‌మిక స్థాయిలోనే తెలుసుకునేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఇలా ముందే తెలుసుకోవ‌డం ద్వారా గుండెపాటు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు తీవ్ర‌స్థాయికి చేర‌కుండా చికిత్స తీసుకోవ‌చ్చు. 

ఆరోగ్య‌క‌ర‌మైన జీవితం కోసం: వార్షిక ఆరోగ్య పరీక్షలతో, బీమా చేసిన వ్యక్తికి అతని/ఆమె శరీర పరిస్థితిని తెలుసుకుని, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఆరోగ్యక‌ర‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కి, పైన తెలిపిన‌ట్లుగా కొల‌స్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయ‌ని తెలిసినా లేదా విటిమిన్ల లోపం ఉంద‌ని తెలిసినా..ప్ర‌తీ రోజు వ్యాయామం చేయ‌డం, వైద్యులు సూచించిన పౌష్టికాహారం తీసుకోవ‌డం..వంటి జాగ్ర‌త్త‌ల‌తో ఆరోగ్యక‌రంగా జీవించేందుకు ఈ ప‌రీక్ష‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. 

డ‌బ్బు ఆదా చేసుకోవ‌చ్చు: ఉచిత వార్షిక వైద్య ప‌రీక్ష‌ల‌తో కూడిన ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకోవ‌డం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో చాలా మొత్తాన్ని ఆదా చేసుకోవ‌చ్చు. పూర్తి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకునేందుకు వేలల్లో ఖ‌ర్చ‌వుతుంది. దీన్ని త‌గ్గించుకోవ‌చ్చు. అలాగే ఆరోగ్య స్థితిని తెలుసుకుని, దానికి త‌గిన‌ట్లుగా జీవన‌శైలిని మ‌లుచుకోవ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు అనారోగ్యాల‌కు దూరంగా ఉండొచ్చు. దీంతో చాలా డ‌బ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యంగా ఉండడం వల్ల క్లెయిమ్ చేయకుండా ఉండవచ్చు. దీని వల్ల నో-క్లెయిమ్ బోన‌స్‌ పొంది, ఆరోగ్య బీమా ప్రీమియం త‌గ్గించుకోవ‌చ్చు లేదా బీమా హామీ మొత్తాన్ని పెంచుకోవచ్చు.


మరిన్ని

ap-districts
ts-districts