సంక్షిప్త వార్తలు

గ్రాన్యూల్స్‌ ఇండియా లాభం రూ.128 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా జూన్‌ త్రైమాసికానికి రూ.1,020 కోట్ల ఆదాయాన్ని, రూ.128 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.850 కోట్లు, నికరలాభం రూ.120 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే ఈసారి ఆదాయం 20 శాతం, నికరలాభం 6 శాతం పెరిగాయి. జనవరి-మార్చిలో సంస్థ ఆదాయం రూ.1030 కోట్లు కాగా, నికరలాభం రూ.111 కోట్లు కావడం గమనార్హం. సమీక్షా త్రైమాసికంలో అమెరికాలో 5 ఔషధాలకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు సంస్థ వెల్లడించింది. తమ ఆదాయంలో ఏపీఐ ఔషధాల వాటా 23 శాతం, ఫార్మా ఫార్ములేషన్‌ ఇంటర్మీడియెట్ల వాటా 23%, తుది ఔషధాల వాటా 54 శాతంగా ఉన్నట్లు తెలిపింది. అమెరికాలో ధరలపై ఒత్తిడి అధికంగా ఉన్నట్లు, ముడి పదార్థాల ధరలు పెరగడం, సాల్వెంట్ల లభ్యత, లాజిస్టిక్స్‌ సమస్యలను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు కంపెనీ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ చిగురుపాటి అన్నారు. 

ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌: గ్రాన్యూల్స్‌ ఇండియా ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ చేపట్టనుంది. ఒక్కో షేరును రూ.400 చొప్పున, మొత్తం 62.50 లక్షల షేర్లను కొనుగోలు చేసేందుకు రూ.250 కోట్లు వెచ్చించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో ఖరారవుతాయి.


2023 చివరికి 1,500 కొత్త ఉద్యోగాలు

హైదరాబాద్‌లో మరో కేంద్రం : పాక్టెరా ఎడ్జ్‌

ఈనాడు, హైదరాబాద్‌: వ్యాపార సంస్థలకు కృత్రిమ మేధ, డిజిటల్‌ పరిష్కారాలను అందించే పాక్టెరా ఎడ్జ్‌, హైదరాబాద్‌లో రెండో డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. అమెరికా కేంద్రంగా ఉన్న ఈ సంస్థకు ఇప్పటికే దేశంలో 1,500 ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరి నాటికి వీరి సంఖ్య 2,000 చేరుకుంటుందని పాక్టెరా ఎడ్జ్‌ సీఈఓ వెంకట్‌ రంగాపురం మంగళవారం ఇక్కడ తెలిపారు. రాబోయే 18 నెలల్లో హైదరాబాద్‌ కేంద్రంలో ఉద్యోగుల సంఖ్య 3,000కు చేరుకుంటుందని తెలిపారు. 2025 నాటికి దేశ వ్యాప్తంగా 5,000 ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. వరంగల్‌లోనూ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. క్లౌడ్‌, డిజిటల్‌ టెక్నాలజీల కోసం ప్రాంగణ ఎంపికలతో పాటు అనుభవజ్ఞులనూ నియమించుకుంటామన్నారు. అంతర్జాతీయంగా ఉన్న నిపుణుల్లో 40 శాతం మంది భారత్‌ నుంచే సేవలను అందిస్తున్నారన్నారు. సంస్థ సీఎస్‌ఓ దినేశ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఐఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఏఐ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ నిర్వహిస్తున్నట్లు, ఎంపికైన 3 అంకురాలకు అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పనిచేసే అవకాశాలను కల్పించబోతున్నట్లు తెలిపారు. వీటికి రూ.12 లక్షల వరకు ఈక్విటీ గ్రాంటు సమకూరుస్తున్నట్లు వెల్లడించారు.


ప్రభుత్వ రంగ బ్యాంకులలాభం రూ.15,306 కోట్లు

ఏప్రిల్‌-జూన్‌లో 9 శాతం వృద్ధి

దిల్లీ: దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏప్రిల్‌-జూన్‌లో మొత్తంగా రూ.15,306 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. 2021-22 ఇదే త్రైమాసిక లాభం రూ.14,013 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 9.2 శాతం అధికం. ఈ 12 బ్యాంకుల్లో ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ), బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా లాభాలు మాత్రం ఈసారి 7-70 శాతం తగ్గాయి. బాండు రాబడులు పెరిగినందున మార్క్‌-టు-మార్కెట్‌ (ఎంటీఎం) నష్టాలు వాటిల్లడమే ఇందుకు కారణం. ఆర్థిక ఆస్తుల కొనుగోలు విలువ కంటే దిగువకు మార్కెట్‌ ధర చేరినప్పుడు ఎంటీఎం నష్టాలు వస్తాయి.
* 2022-23 మొదటి త్రైమాసికంలో 9 బ్యాంకులు 3-117 శాతం లాభాలు నమోదు చేశాయి. శాతం వారీగా చూస్తే అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రూ.452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఏడాది క్రితం ఈ బ్యాంక్‌ లాభం రూ.208 కోట్లతో పోలిస్తే, ఇది 117 శాతం అధికం. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం రూ.1209 కోట్ల నుంచి 79 శాతం వృద్ధితో రూ.2168 కోట్లకు చేరింది.
* అధిక లాభం ఆర్జించిన బ్యాంకుల్లో ఎస్‌బీఐ (రూ.6068 కోట్లు) అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకుల మొత్తం లాభంలో ఎస్‌బీఐ వాటా దాదాపు 40 శాతంగా ఉంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.2168 కోట్ల లాభంతో తర్వాతి స్థానంలో నిలిచింది.
* 2020-21 ఆర్థిక సంవత్సం మొత్తంమీద ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.31,816 కోట్లు కాగా.. 2021-22లో రూ.66,539 కోట్లకు వృద్ధి చెందింది. కేవలం సెంట్రల్‌ బ్యాంక్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌లు మాత్రమే నష్టాలు చవిచూశాయి. ఎస్‌బీఐ సహా 9 బ్యాంకులు వాటాదార్లకు రూ.7,867 కోట్ల డివిడెండ్‌లను ప్రకటించాయి.
* 2015-16 నుంచి 2019-20 మధ్య వరుసగా అయిదేళ్ల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలు నమోదుచేశాయి. 2016-17లో రూ.11,389 కోట్లు, 2015-16లో రూ.17,993 కోట్లు, 2019-20లో రూ.25,941 కోట్లు, 2018-19లో రూ.66,636 కోట్లు, 2017-18లో రూ.85,370 కోట్లు చొప్పున నష్టాలు చవిచూశాయి.


ఓయో చేతికి డెన్మార్క్‌ కంపెనీ

దిల్లీ: ప్రయాణ, ఆతిథ్య పోర్టల్‌ అయిన ఓయో డెన్మార్క్‌కు చెందిన హాలిడేహోమ్‌ నిర్వహణ సంస్థ బార్న్‌హోమ్‌స్కి ఫెరీహౌజ్‌ను బయటకు వెల్లడించని మొత్తానికి కొనుగోలు చేసింది. 30 హాలిడే పార్క్‌లలో మొత్తం 737 హాలిడే హోమ్స్‌ను కలిగి ఉన్న ఆ సంస్థ, ఈ ఏడాది 2.5 లక్షల మంది అతిథులకు సేవలు అందించగలదని ఓయో పేర్కొంది. ‘ఇన్వెస్ట్‌ ఇన్‌ డెన్మార్క్‌’ పథకం కింద ఓయో అనుబంధ కంపెనీ డాన్‌సెంటర్‌ ద్వారా ఈ లావాదేవీ జరిగింది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో పర్యాటకంలో బార్న్‌హోమ్‌ మంచి పనితీరు ప్రదర్శిస్తుందని ఓయో వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌లో డెన్మార్క్‌ కంపెనీ హాలిడే హోమ్స్‌ కూడా ఆన్‌లైన్‌ పోర్టళ్ల ద్వారా బుకింగ్‌కు సిద్ధంగా ఉంటాయని ఓయో తెలిపింది. ఐరోపాలో నెదర్లాండ్స్‌, బెల్జియం, జర్మనీ, ఆస్ట్రియా, క్రొయేషియా వంటి దేశాల్లో ఓయో కార్యకలాపాలు విస్తరించాయి.


బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్ల కోసం హెచ్‌పీసీఎల్‌, హోండా జట్టు

దిల్లీ: విద్యుత్‌ వాహనాల కోసం హెచ్‌పీసీఎల్‌ పెట్రోలు బంకుల్లో బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం హెచ్‌పీసీఎల్‌, హోండా మోటార్‌లు జట్టు కట్టాయి. హోండా మోటార్‌ అనుబంధ సంస్థ హోండా పవర్‌ ప్యాక్‌ ఎనర్జీ ఇండియా, హెచ్‌పీసీఎల్‌లు కలిసి బెంగళూరులోని హెచ్‌పీసీఎల్‌ పెట్రోలు బంకులో ఇటీవలే తొలి ‘ఇ:స్వాప్‌’ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంగళవారం  హెచ్‌పీసీఎల్‌ తెలిపింది. ఛార్జింగ్‌ అయిపోయిన బ్యాటరీలను ఇచ్చి.. పూర్తి ఛార్జింగ్‌ ఉన్న బ్యాటరీలను తీసుకోవడానికి (స్వాపింగ్‌) వీలు కల్పించే ఈ కేంద్రాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పెట్రోలు లేదా డీజిల్‌ నింపినంత వేగంగా ఈవీ బ్యాటరీలు ఛార్జ్‌ కావు కాబట్టి, అందుకు ప్రత్యామ్నాయంగా ఈ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ‘కేవలం 2 నిమిషాల్లోనే ఇ:స్వాప్‌ స్టేషన్ల వద్ద వినియోగదార్లు బ్యాటరీలను మార్చుకోవచ్చ’ని తెలిపింది.

 


ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలకు రూ.26,364 కోట్ల నష్టం: కాగ్‌

దిల్లీ: ప్రభుత్వ రంగంలోని సాధారణ బీమా సంస్థలకు అయిదు ఆర్థిక సంవత్సరాలలో, ఆరోగ్య బీమా విభాగంలో రూ.26,364 కోట్ల నష్టం వచ్చిందని కాగ్‌ (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) నివేదిక వెల్లడించింది. ఆరోగ్య బీమా విభాగ నష్టాల కారణంగా, ఇతర విభాగాల్లో వచ్చిన లాభాలు తుడిచి పెట్టుకుపోయాయని, మొత్తంగా బీమా సంస్థలు నష్టాలపాలయ్యాయని కాగ్‌ పార్లమెంటుకు తెలిపింది. 2016-17 నుంచి 2020-21 వరకు ప్రభుత్వ రంగంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, నేషనల్‌ ఇన్సూరెన్సులకు కలిపి ఇంతమేర నష్టాలు వచ్చాయి. ఈ సంస్థలు ఆ అయిదేళ్లలో రూ.1,16,551 కోట్ల స్థూల ప్రీమియం వసూలు చేశాయి.
* ఆరోగ్య బీమాకు సంబంధించి, ప్రైవేటు సాధారణ బీమా సంస్థలు, ఆరోగ్య బీమా సంస్థలతో పోలిస్తే ప్రభుత్వ సాధారణ బీమా సంస్థల మార్కెట్‌ వాటా తగ్గుతూ వస్తోందని పేర్కొంది. వీటి క్లెయింల చెల్లింపుల్లో పలు లోపాలున్నట్లు కాగ్‌ తెలిపింది. కొన్నిసార్లు క్లెయిం చేసిన మొత్తం కన్నా అధికంగా చెల్లించడం, రెండు సార్లు చెల్లించడం, నిర్ణీత వ్యాధులకు వేచి ఉండే వ్యవధి, సహ-చెల్లింపు నిబంధనలు సరిగా పాటించకపోవడం, అంగీకరించాల్సిన క్లెయిం మొత్తం నిర్ణయించడంలో పొరపాట్లు, చెల్లింపులు ఆలస్యం కావడం తదితర లోపాలనూ గుర్తించింది.


ఎంటార్‌ టెక్నాలజీస్‌ లాభం రూ.16 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ ఉత్పత్తుల సంస్థ ఎంటార్‌ టెక్నాలజీస్‌ జూన్‌ త్రైమాసికంలో రూ.91 కోట్ల ఆదాయాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక ఆదాయం రూ.54 కోట్లతో పోలిస్తే ఇది 68.4 శాతం అధికం. నికర లాభం రూ.8.7 కోట్ల నుంచి 86.2 శాతం పెరిగి రూ.16.2 కోట్లకు చేరింది. జూన్‌ 30 నాటికి సంస్థ చేతిలో రూ.765.6 కోట్ల విలువైన పనులున్నాయి. రోలర్‌ స్క్రూలకు సంబంధించి మొదటి ఆర్డరు పూర్తి చేసినట్లు ఎంటార్‌ వెల్లడించింది. క్లీన్‌ ఎనర్జీ విభాగంలో మంచి ఆర్డర్లను సంపాదించినట్లు, రాబోయే త్రైమాసికాల్లో మరిన్ని ఆర్డర్లు వస్తాయని భావిస్తున్నట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పర్వత్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. అంతరిక్షం, రక్షణ, సివిల్‌, క్లీన్‌ ఎనర్జీ, న్యూక్లియర్‌ పవర్‌ తదితర విభాగాల్లో వస్తున్న అవకాశాలను అందుకునేందుకు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు పేర్కొన్నారు.


జీవిత బీమా ప్రీమియం వసూళ్లలో 91% వృద్ధి

దిల్లీ: జీవిత బీమా సంస్థల కొత్త ప్రీమియం వసూళ్లలో దాదాపు 91 శాతం వృద్ధి కనిపించింది. జులైలో మొత్తం రూ.39,078.91 కోట్ల ప్రీమియం వసూలైనట్లు ఐఆర్‌డీఏఐ గణాంకాలు వెల్లడించాయి. మొత్తం 24 బీమా సంస్థలు కలిసి గత ఏడాది జులైలో రూ.20,434.72 కోట్ల తొలి ప్రీమియాన్నే వసూలు చేశాయి. దేశంలోని అతి పెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీ కొత్త ప్రీమియం వసూళ్లలో రెట్టింపునకు పైగా వృద్ధి సాధించింది. 2021 జులైలో రూ.12,030.93 కోట్ల ప్రీమియం వసూలు చేసిన సంస్థ, ఈసారి రూ.29,116 కోట్లకు చేరింది. జీవిత బీమా విభాగంలో ఎల్‌ఐసీ 68.6 శాతం మార్కెట్‌ వాటా సాధించింది. మిగతా 23 బీమా సంస్థలు తొలి ప్రీమియంలో 19 శాతం సగటు వృద్ధిని సాధించి, రూ.9,962.22 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేశాయి. ఏప్రిల్‌-జులై మధ్య కాలంలో ఎల్‌ఐసీ తొలి ప్రీమయం వసూళ్లు 62 శాతం వృద్ధితో రూ.77,317.69 కోట్లుగా నమోదయ్యాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని