Jyotiraditya Scindia: విమాన ఛార్జీల పరిమితులపై పునఃసమీక్ష

ఇంధన ధరల ఆధారంగానే
మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

దిల్లీ: విమాన ఇంధన (ఏటీఎఫ్‌) ధరలు దిగి వస్తే, దేశీయ విమాన ఛార్జీల పరిమితులపై ప్రభుత్వం  పునఃసమీక్ష జరుపుతుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కొవిడ్‌-19 పరిణామాల ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే విమానయాన రంగం కోలుకుంటోంది. ముఖ్యంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. గత ఎనిమిదేళ్లలో తొలిసారిగా ఒక దేశీయ విమానయాన సంస్థ (ఆకాశ ఎయిర్‌) కార్యకలాపాలను ప్రారంభించింది కూడా. కొవిడ్‌-19 పరిణామాల సమయంలో దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలకు పరిమితులను మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. తక్కువ ఛార్జీల వల్ల విమానయాన సంస్థలు నష్టపోకుండా, గిరాకీకి అనుగుణంగా సంస్థలు భారీగా ఛార్జీలు పెంచకుండా చూడటం ద్వారా ప్రయాణికులకు ఊరట కలిగించేలా ఈ పరిమితులు నిర్ణయించినట్లు మంత్రి సింధియా గుర్తు చేశారు. అంతర్జాతీయ ముడిచమురు ధరలకు అనుగుణంగా ప్రతినెలా 1, 16 తేదీల్లో ఏటీఎఫ్‌ ధర మారుతుంటుంది. 2019-20లో ఏటీఎఫ్‌ ధర కిలో లీటరుకు రూ.53,000 కాగా.. గతవారం వరకు రూ.1,41,000గా ఉండేది. తదుపరి ఏటీఎఫ్‌ ధర 16% లేదా రూ.21,000 తగ్గి రూ.1.20 లక్షలకు చేరింది. కొవిడ్‌ ముందుతో పోలిస్తే ఈ ధర రెట్టింపని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల విమానయాన సంస్థలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని మంత్రి చెప్పారు.  తాను గతేడాది జులైలో పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో 26 రాష్ట్రాల్లో ఏటీఎఫ్‌పై వ్యాట్‌ 20-30 శాతం మధ్య ఉండేదని తెలిపారు. ప్రస్తుతం 16 రాష్ట్రాలు 1-4 శాతానికి వ్యాట్‌ను తగ్గించాయని తెలిపారు. మిగిలిన రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గించేలా సంప్రదింపులు చేస్తున్నానని మంత్రి వివరించారు.

* కొవిడ్‌ ముందు రోజుకు గరిష్ఠంగా 4.07 లక్షల మంది దేశీయంగా విమానాల్లో ప్రయాణించారు.
* ఇప్పుడు అన్‌ సీజన్‌ అయినా కూడా రోజుకు 3-3.4 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఇది మరింత పెరగనుందని మంత్రి తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని