Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా?ఈ రిస్క్‌ల గురించి తెలుసా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు, బాండ్లు, షేర్లు, యాన్యుటీలు, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్.. పెట్టుబ‌డులు పెట్టేందుకు ఇలా అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ చాలా మంది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కే (Fixed Deposit) అధిక ప్రాధాన్య‌ం ఇస్తుంటారు. బ్యాంకులో డ‌బ్బు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే స్థిర రాబ‌డితో పాటు డ‌బ్బు సుర‌క్షితంగా ఉంటుంద‌నేది వారి నమ్మ‌కం. అయితే, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో కూడా కొన్ని రిస్క్‌లు ఉన్నాయి. డిపాజిట్ చేసే ముందు వాటి గురించి తెలుసుకోవ‌డం మంచిది. 

1. లిక్విడిటీ రిస్క్‌: లిక్విడిటీ అంటే న‌గ‌దు ల‌భ్య‌త‌. అవ‌స‌ర‌మైన స‌మ‌యానికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా న‌గ‌దు విత్‌డ్రా చేసుకోగ‌లిగితే.. అటువంటి పెట్టుబ‌డుల‌కు అధిక లిక్విడిటీ ఉంద‌ని అర్థం. ఫిక్స్‌డ్ డిపాజిట్ల విష‌యానికి వ‌స్తే ఎఫ్‌డీని సుల‌భంగానే బ్రేక్ చేయ‌వ‌చ్చు. అయితే, ముందస్తుగా ఎఫ్‌డీ బ్రేక్ చేస్తే ఆ మొత్తం మీ ఖాతాలో డిపాజిట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆన్‌లైన్‌ ఎఫ్‌డీకి 24-48 గంటల వరకు సమయం పట్టవచ్చు. మెచ్యూరిటీ కంటే ముందే బ్రేక్ చేస్తే పెనాల్టీ (ఎఫ్‌డీ వ‌డ్డీపై 1 శాతం వ‌ర‌కు జ‌రిమానా విధించ‌వ‌చ్చు) వ‌ర్తిస్తుంది. ఇక 5 సంవ‌త్స‌రాల ప‌న్ను ఆదా ఎఫ్‌డీల‌కు మ‌ధ్య‌లోనే తీసుకునే వీలుండ‌దు.

  • స్వీప్-ఇన్ ఎఫ్‌డీ: అత్యవసరంగా డబ్బు కావలసి వస్తుందనుకునే వారు స్వీప్-ఇన్ ఎఫ్‌డీని ప‌రిశీలించ‌వ‌చ్చు. ఇది సాధార‌ణంగా మీ పొదుపు ఖాతాకు అనుసంధానించి ఉంటుంది. పొదుపు ఖాతాలో నిర్దిష్ట ప‌రిమితికి మించి డ‌బ్బు డిపాజిట్ చేస్తే అద‌న‌పు మొత్తం ఎఫ్‌డీకి బ‌దిలీ చేస్తారు. ఈ మొత్తాన్ని ఎటువంటి పెనాల్టీ చెల్లించ‌కుండా ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

2. డీఫాల్ట్ రిస్క్: బ్యాంకులు దివాళా తీసే సంద‌ర్భాలు చాలా అరుదు. అయినా అలాంటి ఉదంతాలను మనం చూశాం. కాబ‌ట్టి సాధ్య‌మైనంత వ‌ర‌కు డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ (డిఐసీజీసీ) కింద‌కి వ‌చ్చే బ్యాంకుల‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌డం మంచిది. దీని ప్ర‌కారం బ్యాంకులు న‌ష్టాల్లో ఉండి, ఖాతాను స్తంభింపచేసిన‌ప్పుడు రూ. 5 ల‌క్ష‌ల వ‌ర‌కు నిధుల (పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లుతో స‌హా అన్ని ర‌కాల డిపాజిట్లు.. వాటిపై వ‌చ్చిన వ‌డ్డీతో స‌హా)ను బీమా ద్వారా పొందే వీలుంది. ఇంతకు మించిన మొత్తం డిపాజిట్ చేస్తే దానిపై రిస్క్ తప్పదు.

3. వ‌డ్డీ రేటు రిస్క్‌: బ్యాంక్ ఎఫ్‌డీ వ‌డ్డీ రేటు లాక్ అయ్యి ఉంటాయి. ఎఫ్‌డీ చేసిన‌ప్పుడు ఉన్న వ‌డ్డీ రేటు మెచ్యూరిటీ వ‌ర‌కు కొన‌సాగుతుంది. కాబ‌ట్టి, త‌క్కువ వ‌డ్డీ రేటు వ‌ద్ద డిపాజిట్ చేస్తే మీ డిపాజిట్లు త‌క్కువ వ‌డ్డీ రేటు వ‌ద్దే లాక్ అయ్యే ప్ర‌మాదం ఉంటుంది.

4. ద్ర‌వ్యోల్బ‌ణం రిస్క్‌: బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే వ‌చ్చే వ‌డ్డీ రేటు కంటే ద్ర‌వ్యోల్బ‌ణ రేటు ఎక్కువ‌గా ఉంటే.. మ‌నం రిస్క్ తీసుకున్న‌ట్లే అవుతుంది. ఉదాహ‌ర‌ణ‌కు మ‌నం రెండు సంవ‌త్స‌రాల త‌ర్వాత టూర్‌కి వెళ్లాల‌ని ప్లాన్ చేసి అందుకు కావాల్సిన మొత్తం రూ. 2 ల‌క్ష‌ల‌ను ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశామ‌నుకుందాం. బ్యాంకు రెండు సంవ‌త్స‌రాల డిపాజిట్‌పై 5.50 శాతం వ‌డ్డీ ఇస్తుంద‌నుకుంటే.. మెచ్యూరిటీ పూర్త‌య్యే నాటికి వ‌చ్చే మొత్తం దాదాపు రూ.2,22,200. ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణ రేటును 6 శాతంగా అంచ‌నా వేస్తే 2 సంవ‌త్స‌రాల త‌ర్వాత టూర్‌కి వెళ్లేందుకు దాదాపు రూ.2,25,300 అవ‌స‌ర‌మ‌వుతాయి. అంటే రూ.3,100 అద‌నంగా కావాల్సి వ‌స్తుంది. ఎఫ్‌డీ చేసే ముందు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ప్ప‌కుండా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవాలి.

5. రీ ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌: సాధార‌ణంగా ఎఫ్‌డీ మెచ్యూర్‌ అయిన త‌ర్వాత.. డ‌బ్బు విత్‌డ్రా చేసుకుంటాం. లేదా తిరిగి పెట్టుబ‌డి పెడ‌తాం. ఒక‌వేళ మీ ఎఫ్‌డీ మెచ్యూరిటీ స‌మ‌యానికి ఎఫ్‌డీ రేట్లు త‌క్కువ‌గా ఉంటే.. త‌క్కువ వ‌డ్డీ రేటుకు డ‌బ్బును తిరిగి పెట్టుబ‌డి పెట్టాల్సి రావచ్చు. కాబ‌ట్టి, దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల కోసం చేసే పెట్టుబ‌డులు దెబ్బ‌తినే అవకాశం ఉంటుంది.

6. ట్యాక్స్‌ రిస్క్‌: ఎఫ్‌డీల‌పై వ‌చ్చే వ‌డ్డీ ప‌న్ను ప‌రిధిలోకి వ‌స్తుంది. ఒక‌వేళ మీరు 30 శాతం ప‌న్ను స్లాబ్‌లో ఉండి, ఎఫ్‌డీపై 7 శాతం వ‌డ్డీ పొందుతున్న‌ప్ప‌టికీ.. ప‌న్ను చెల్లింపుల త‌ర్వాత వ‌చ్చే రాబ‌డి 4.90 శాతానికి త‌గ్గిపోతుంది. 60 ఏళ్లలోపు వారు సెక్ష‌న్ 80 TTA ప్ర‌కారం రూ.10 వేల వ‌ర‌కు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వ‌య‌సు ఉన్న వారు సెక్ష‌న్ 80 TTB ప్ర‌కారం రూ.50 వేల వ‌ర‌కు వ‌డ్డీ ఆదాయంపై మిన‌హాయింపు పొందొచ్చు. అయితే, సెక్ష‌న్ 80 TTA పొదుపు ఖాతాకి మాత్రమే వర్తిస్తుంది. సెక్షన్ 80 TTBలో వడ్డీ ఆదాయం పొదుపు, ఎఫ్‌డీ, రికరింగ్ డిపాజిట్లకు కూడా వర్తిస్తుంది. కాబట్టి స్వల్పకాలిక ల‌క్ష్యాల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేవారు.. పైన తెలిపిన రిస్క్‌లు అన్నింటినీ తెలుసుకున్న త‌ర్వాత మాత్ర‌మే పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచిది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని