Bank Locker: బ్యాంక్ లాక‌ర్ల‌లో దాచిన వ‌స్తువులు సుర‌క్షిత‌మేనా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలువైన వ‌స్తువులు లేదా ముఖ్య‌మైన డాక్యుమెంట్ల‌ను భ‌ద్ర‌ప‌రుచుకునేంద‌కు బ్యాంకులు.. త‌మ ఖాతాదారుల‌కు లాక‌ర్ల‌ను అద్దెకు ఇస్తుంటాయి. ఇందుకు గానూ కొంత మొత్తాన్ని వసూలు చేస్తాయి. బ్యాంకు బ్రాంచ్ ఉన్న ప్ర‌దేశం, లాక‌ర్ సైజ్‌ను బ‌ట్టి ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. అలాగే బ్యాంకులు లాక‌ర్ల‌ భ‌ద్ర‌త విష‌యంలో కూడా కొన్ని నియ‌మ‌నిబంధ‌న‌లు పాటించాలి. దీనికి సంబంధించి ఈ ఏడాది ఆర్‌బీఐ.. బ్యాంకుల‌కు జారీ చేసిన కొత్త మార్గ‌ద‌ర్శాకాల‌ను ఇప్పుడు చూద్దాం. 

నోటిఫికేష‌న్‌, అల‌ర్ట్స్‌: లాక‌ర్ తెరిచే సౌకర్యం ఉన్న‌వారు లాక‌ర్‌ను తెరిచిన‌ప్పుడు అందుకు సంబంధించిన స‌మాచారాన్ని, బ్యాంకు వ‌ద్ద రిజిస్ట‌రైన ఖాతాదారు మొబైల్ నంబ‌రుకు ఎస్ఎంఎస్ ద్వారా గానీ, రిజిస్ట‌ర్డ్ ఈ-మెయిల్ ఐడీ ద్వారా గానీ తెలియ‌జేయాలి. మెసేజ్‌లో లాక‌ర్ తెరిచిన తేదీ, టైమ్‌ స‌హా ఉంచాలి. అంతేకాకుండా లాక‌ర్ తెరిచిన రోజు ముగిసేలోపు స‌మ‌చారం క‌స్ట‌మ‌ర్‌కు చేరేలా చూడాలి. అన‌ధికారిక‌ లాక‌ర్ యాక్సెస్ వంటి వాటిని నివారించేందుకు ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. 

ప‌రిహారం: బ్యాంకు లాక‌ర్లలో ఉంచిన విలువైన వ‌స్తువులకు.. దొంగ‌త‌నం, అగ్ని ప్ర‌మాదం, భ‌వ‌నం కూలిపోవ‌డం, లేదా ఇత‌ర మోసాలు, ఉద్యోగుల నిర్లక్ష్యం కార‌ణంగా న‌ష్టం వాటిల్లితే బ్యాంకులు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. లాక‌ర్ వార్షిక అద్దెకు 100 రెట్లు న‌ష్ట‌ప‌రిహారంగా చెల్లించాల్సి ఉంటుంది. 

భ‌ద్ర‌త‌: బ్యాంకు లాక‌ర్ రూమ్‌కి అద‌న‌పు భ‌ద్ర‌త చ‌ర్య‌లు ఉండాల‌ని ఆర్‌బీఐ బ్యాంకుల‌కు సూచించింది. ఇందులో భాగంగా లాక‌ర్ గ‌దిలోకి ప్ర‌వేశించేందుకు, బ‌య‌ట వ‌చ్చేంద‌కు ఒక్క‌టే మార్గం ఉండాల‌ని తెలిపింది. వ‌ర్షం, వ‌ర‌ద‌లు, అగ్నిప్రమాదం వంటి వాటి కార‌ణంగా లాక‌ర్ గ‌దులు దెబ్బ‌తిన‌కుండా త‌గిన ఏర్పాట్లు చేయాలి. స్ట్రాంగ్ రూమ్‌లోకి ప్ర‌వేశించేట‌ప్పుడు, బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు రికార్డు అయ్యే విధంగా, బ్యాంకు ప‌రిస‌రాల‌లోనూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. బ్యాంకులు ఈ పుటేజ్‌ని క‌నీసం 180 రోజులు భ‌ద్ర‌ప‌ర‌చాలి. ఒక‌వేళ అనధికార లాకర్ యాక్సెస్, దొంగతనం, భద్రతా ఉల్లంఘన మొదలైన వాటి విషయంలో ఖాతాదారుడు బ్యాంకుకు ఫిర్యాదు చేస్తే, పోలీసు విచారణ ముగిసే వరకు బ్యాంకులు తప్పనిసరిగా సీసీటీవీ రికార్డింగ్‌లను భ‌ద్ర‌ప‌ర‌చాలి. 

లాకర్ ప్రమాణాలు: సవరించిన బ్యాంక్ లాకర్ నిర్వ‌హ‌ణ‌ నియమాల ప్రకారం.. కొత్త మెకానికల్ లాకర్లు.. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎలక్ట్రానిక్‌గా ఆప‌రేట్ చేయ‌గ‌ల‌ లాకర్ సిస్టమ్‌లు.. ఆర్‌బీఐ నిర్దేశించిన సైబర్ సెక్యూరిటీ విధానాలకు అనుగుణంగా ఉండాలి. లాకర్ తాళంపై బ్యాంక్ లేదా బ్రాంచ్ ఐడెంటిఫికేషన్ కోడ్‌లు తప్పనిసరిగా ముద్రించాలి. కస్టమర్లు అదనపు ప్యాడ్‌లాక్‌ (బ్యాంకు స‌దుపాయాన్ని అందించిన‌ప్పుడు మాత్ర‌మే)ను ఉపయోగించవచ్చు.

లాకర్ అద్దె: ఖాతాదారులు లాకర్ అద్దె చెల్లించ‌డంలో విఫలమైతే వ‌సూలు చేసేందుకు.. బ్యాంకులు లాక‌ర్‌ను బ్రేక్ చేయ‌వ‌చ్చు. లేదా టర్మ్ డిపాజిట్లను ఉపయోగించవచ్చు. ఒక‌వేళ బ్యాంకు అద్దెను ముందుగానే వ‌సూలు చేసిన‌ట్ల‌యితే, లాక‌ర్ స‌రెండ‌ర్ స‌మ‌యంలో అద‌న‌పు మొత్తాన్ని క‌స్ట‌మ‌ర్‌కు తిరిగి చెల్లించాలి. లాక‌ర్ అద్దె, ఇత‌ర వివ‌రాలు మీ బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.

నామినీ: బ్యాంకులు, లాక‌ర్లు తీసుకున్న‌వారికి నామినీ స‌దుపాయాన్ని అందిస్తాయి. లాక‌ర్ల‌కు సంబంధించి స్వంత బ్యాంక్ లాక‌ర్ అగ్రిమెంట్ ఫార్మాట్‌ను రూపొందించాలి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని