అరబిందో ఫార్మా లాభాల్లో క్షీణత

రూ.6,236 కోట్లకు ఆదాయం

ఈనాడు - హైదరాబాద్‌

రబిందో ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి కన్సాలిడేటెడ్‌ ఖాతాల ప్రకారం రూ.6,236 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. నికరలాభం రూ.520.5 కోట్లు నమోదైంది. త్రైమాసిక ఈపీఎస్‌  రూ.8.88గా ఉంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.5,702 కోట్లు, నికరలాభం రూ.770 కోట్లు ఉండటం గమనార్హం. దీంతో పోల్చితే ప్రస్తుతం మొదటి త్రైమాసికంలో ఆదాయం 9.4 శాతం పెరిగినప్పటికీ, నికరలాభం 32.4 శాతం తగ్గింది.

ప్రస్తుత మొదటి త్రైమాసికంలో యూఎస్‌ ఫార్ములేషన్ల ఆదాయం 10.8  శాతం పెరిగింది. మరోపక్క ఐరోపా ఫార్ములేషన్ల ఆదాయం 2.2 శాతం తగ్గింది. యూరో (ఈయూ కరెన్సీ) మారకం విలువ క్షీణించటం దీనికి ఒక కారణంగా కంపెనీ పేర్కొంది. ఏఆర్వీ ఆదాయం 28.1 శాతం, ఏపీఐ ఆదాయం 11.6 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఈ మొదటి త్రైమాసికంలో పరిశోధన- అభివృద్ధి కార్యకలాపాలకు అరబిందో ఫార్మా రూ.310 కోట్లు వెచ్చించింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డిఏ) నుంచి 10 ఔషధాలకు ఏఎన్‌డీఏ (అబ్రీవియేటెడ్‌ న్యూ డ్రగ్‌ అప్లికేషన్‌) అనుమతులు పొందినట్లు, ఇందులో 4 ఇంజెక్టబుల్‌ ఔషధాల ఉన్నాయని కంపెనీ తెలియజేసింది.

ప్రస్తుత ఫలితాలపై అరబిందో ఫార్మా ఎండీ కె.నిత్యానందరెడ్డి స్పందిస్తూ, ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ మెరుగైన పనితీరు కనబరచగలిగినట్లు పేర్కొన్నారు. కొత్త ఔషధాలపై పెట్టుబడులు పెడుతున్నట్లు, వివిధ రెగ్యులేటరీ సంస్థల నుంచి అనుమతులు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలిపారు. స్పెషాలిటీ ఔషధాల శ్రేణిని పెంచుకోవటంపై దృష్టి సారించినట్లు, దీనివల్ల దీర్ఘకాలంలో కంపెనీ వ్యాపార కార్యకలాపాలు బహుముఖంగా విస్తరిస్తాయని వివరించారు. అదే సమయంలో లాభదాయకతను పెంపొందించుకోవటానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts