ప్రభుత్వ బ్యాంకులు రాణిస్తున్నాయ్‌

మొండి బకాయిలు తగ్గడంతో లాభదాయకత

ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రకు తక్కువ ఎన్‌పీఏల నిష్పత్తి: విశ్లేషణ

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్‌బీలు) లాభదాయకత పెరగడానికి మొండి బకాయిలు తగ్గడం తోడ్పడింది. ఈ ధోరణి కొనసాగితే వచ్చే త్రైమాసికాల్లోనూ బ్యాలెన్స్‌ షీట్లపై సానుకూల ప్రభావం కనిపించవచ్చు. 12 పీఎస్‌బీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలపై విశ్లేషణ ప్రకారం.. ఏప్రిల్‌- జూన్‌లో మొత్తంగా ఇవి రూ.15,306 కోట్ల లాభాన్ని నమోదుచేశాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలోని  రూ.14,013 కోట్లతో పోలిస్తే లాభంలో 9.2 శాతం వృద్ధి ఉంది. అయితే దిగ్గజ బ్యాంకులైన ఎస్‌బీఐ, పీఎన్‌బీలు తక్కువ లాభాన్ని ప్రకటించడం గమనార్హం.

* బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాల స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు), నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి మిగతావాటి కంటే తక్కువగా ఉంది. ఈ రెండింటి స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి వరుసగా 3.74 శాతం, 3.91 శాతంగా ఉంది. నికర నిరర్థక ఆస్తులు 0.88 శాతం; 1 శాతంగా ఉన్నాయి.

* ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు 6.26% - 14.90% మధ్యలో ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి 6.26 శాతం కాగా.. సెంట్రల్‌ బ్యాంక్‌కు 14.90 శాతంగా ఉంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఇప్పటికీ ఆర్‌బీఐ సత్వర దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) జాబితాలో ఉండటం గమనార్హం.

* చాలా పీఎస్‌బీల నికర నిరర్థక ఆస్తుల నిష్పత్తి 3 శాతం కంటే తక్కువగానే ఉంది. కేవలం మూడు బ్యాంకులు- యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (3.31%), సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (3.93%), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (4.28)ల ఎన్‌పీఏల నిష్పత్తి 3 శాతానికి పైన ఉంది.

* ‘పీఎస్‌బీల నికర నిరర్థక ఆస్తులు తగ్గాయి. ఈ పరిణామం వల్ల కేటాయింపులు తగ్గి లాభదాయకత పెరిగింద’ని ఆనంద్‌ రాఠీ షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ఈక్విటీ విశ్లేషకుడు నరేంద్ర సోలంకి అభిప్రాయపడ్డారు.

* బాండ్ల ప్రతిఫలాలు పెరగడంతో మార్క్‌ టు మార్కెట్‌ (ఎంటీఎం) నష్టాలను బ్యాంకులు ట్రెజరరీలో చూపించాయి. అయితే రేట్ల పెంపు ప్రక్రియ నెమ్మదిస్తే ఇది గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఒక ఫైనాన్షియల్‌ అసెట్‌ మార్కెట్‌ విలువ కొనుగోలు చేసిన విలువ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎంటీఎం నష్టాలు ఏర్పడతాయి.

* ప్రభుత్వ రంగ బ్యాంకులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం 4ఆర్‌ వ్యూహాన్ని అమలు చేసింది. అవి ఎన్‌పీఏలను పారదర్శకంగా గుర్తించడం, ఒత్తిడి రుణాల పరిష్కారం- వసూళ్లు, బ్యాంకుల మూలధన పునర్‌వ్యవస్థీకరణ, బ్యాంకింగ్‌- ఆర్థిక సేవల రంగంలో సంస్కరణలను చేపట్టడం.

* ఈ వ్యూహంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2016-17 నుంచి 2020-21) బ్యాంకుల మూలధన పునర్‌వ్యవస్థీకరణ కోసం రూ.3,10,997 కోట్లను సాయంగా అందించింది. ఇందులో రూ.34,997 కోట్లను బడ్జెట్‌ కేటాయింపు రూపేణా, మరో రూ.2,76,000 కోట్లను బాండ్ల జారీ ద్వారా ఇచ్చింది.

* ఎన్‌పీఏల పరిష్కార ప్రక్రియ ద్వారా వాణిజ్య బ్యాంకులు గత ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో రూ.8,60,369 కోట్ల బకాయిలను వసూలు చేశాయి. 2021-22లో బ్యాంకుల స్థూల ఎన్‌పీఏలు ఆరేళ్ల కనిష్ఠమైన 5.9 శాతానికి దిగివచ్చాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని