మళ్లీ 59,000 పైకి సెన్సెక్స్‌

ఐటీ, ఫైనాన్స్‌ షేర్ల పరుగులు

సమీక్ష

దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత సెన్సెక్స్‌ మళ్లీ 59,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. ఐటీ, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు కొనసాగడం, సానుకూల అంతర్జాతీయ సంకేతాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 36 పైసలు తగ్గి 79.61 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 0.92 శాతం పెరిగి 98.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.  

సెన్సెక్స్‌ ఉదయం 59,320.45 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా లాభాల్లోనే కదలాడిన సూచీ.. ఇంట్రాడేలో 59,484.99 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని, 59,251.14 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. చివరకు 515.31 పాయింట్లు లాభపడి 59,332.60 వద్ద ముగిసింది. ఏప్రిల్‌ 8 తర్వాత సూచీకిదే అత్యధిక ముగింపు కావడం గమనార్హం. ఇక నిఫ్టీ సైతం 124.25 పాయింట్లు రాణించి 17,659 దగ్గర స్థిరపడింది.  

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 20 పరుగులు తీశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ 2.75%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.36%, హెచ్‌డీఎఫ్‌సీ 2.32%, టెక్‌ మహీంద్రా 2.12%, టీసీఎస్‌ 1.98%, ఎస్‌బీఐ 1.95%, విప్రో 1.93%, టైటన్‌ 1.63%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.60%, కోటక్‌ బ్యాంక్‌ 1.46% చొప్పున రాణించాయి. ఐటీసీ 1.56%, ఎన్‌టీపీసీ 1.38%, హెచ్‌యూఎల్‌ 1.04%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.76% మాత్రం నష్టపోయాయి.  

* డిసెంబరుకు 15,600 పాయింట్లకు నిఫ్టీ.. బోఫా సెక్యూరిటీస్‌  : భారత స్టాక్‌ మార్కెట్లలో మదుపర్లు మరిన్ని నష్టాలు చవిచూసే అవకాశం ఉందని అమెరికా బ్రోకరేజీ సంస్థ బోఫా సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. డిసెంబరుకు మరో 10 శాతం దిద్దుబాటు రావొచ్చని, నిఫ్టీ 15,600 పాయింట్ల వద్ద ఏడాదిని ముగించొచ్చని వెల్లడించింది. జూన్‌లో నిఫ్టీ డిసెంబరు లక్ష్యం 14,500 పాయింట్లుగా అంచనా వేసిన సంస్థ.. తాజాగా లక్ష్యాన్ని పెంచడం గమనార్హం. విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపర్ల రాకతో మార్కెట్లకు కొంత కొనుగోళ్ల మద్దతు లభించిందని బోఫా తెలిపింది.


నేటి బోర్డు సమావేశాలు: ఎల్‌ఐసీ

* హీరో మోటోకార్ప్‌

* పీఎఫ్‌సీ

* దివీస్‌ ల్యాబ్స్‌

* ముత్తూట్‌ ఫైనాన్స్‌

* ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌,

* ఇండియా సిమెంట్స్‌

* ఆర్‌సీఎఫ్‌

* రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌

* రిలయన్స్‌ పవర్‌

* సన్‌ టీవీ

* బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌

* బజాజ్‌ హెల్త్‌కేర్‌

* బజాజ్‌ హిందుస్థాన్‌ షుగర్‌


మరిన్ని

ap-districts
ts-districts