IPO: ఐపీఓకి బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్‌ దరఖాస్తు!

దిల్లీ: బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్‌.. మార్కెట్‌ నియంత్రణా సంస్థ సెబీకి ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు శుక్రవారం ప్రాథమిక పత్రాలు సమర్పించింది. రూ.250 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 2.6 కోట్ల షేర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద అందుబాటులో ఉన్నాయి. సమీకరించిన నిధుల్లో రూ.68 కోట్లను రుణాల చెల్లింపునకు, మరో రూ.119.5 కోట్లను కార్పొరేట్‌ అవసరాలు సహా నిర్వహణ మూలధనం కింద వినియోగించనున్నారు. ఐపీఓకి ముందు ప్రీ-ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ.50 కోట్లు సమీకరించే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇదే జరిగితే ఐపీఓ పరిమాణం తగ్గనుంది.

బాలాజీ స్పెషాలిటీ కెమికల్స్‌ను సోలాపూర్‌ కేంద్రంగా 2010లో ఏర్పాటు చేశారు. స్పెషాలిటీ కెమికల్స్‌, అగ్రో కెమికల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో ఉపయోగించే రసాయనాలను ఇది తయారు చేస్తుంటుంది. నంజింగ్‌ యూనియన్‌ కెమికల్‌ కంపెనీ లిమిటెడ్‌, కొరియా ఇండియా లిమిటెడ్‌, యూపీఎల్‌ లిమిటెడ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబోరేటరీస్‌ లిమిటెడ్‌, ఆర్తీ డ్రగ్స్‌.. ఈ కంపెనీ కీలక కస్టమర్లు. 2019-2020 నుంచి 2021-22 మధ్య ఈ కంపెనీ కస్టమర్ల సంఖ్య 45 నుంచి 182కు పెరిగింది.

2022 మార్చి 31 నాటికి ఈ కంపెనీ వార్షిక సామర్థ్యం 30 వేల మెట్రిక్‌ టన్నులు. ఈ సంస్థ ఆదాయం 2021-22లో రూ.514.28 కోట్లుగా నమోదైంది. అంత క్రితం ఏడాది ఇది రూ.174.40 కోట్లు. అదే సమయంలో లాభం రూ.10.40 కోట్ల నుంచి రూ.108.95 కోట్లకు పెరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, జేఎం ఫైనాన్షియల్‌ ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts