Retirement Fund: పదవీ విరమణ పథకాల మీద సర్వే.. టాప్‌-3లో ఇవే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితానికి చాలా మంది చాలా ఆర్థిక ప్ర‌ణాళిక‌లు అమ‌లుచేస్తూ ఉంటారు. అయితే, ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఎలా జీవించాలి అనే విష‌య‌మై ఏదైనా ఉపాధి ప్రారంభంలోనే (సంపాదిస్తున్న‌ప్పుడే) ప్ర‌ణాళిక అమ‌లు చేయ‌డం మంచిది. చాలా మంది ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు 3 రంగాల‌ను తమ డ‌బ్బుని మ‌దుపు చేయ‌డానికి ఎంచుకుంటున్నార‌ని ఓ స‌ర్వే తెలిపింది.

డిజిట‌ల్ వెల్త్ మేనేజ‌ర్ స్క్రిప్‌బాక్స్‌.. 34-55 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల 1400 మందిని స‌ర్వే చేసింది. వీళ్లంద‌రూ అత్య‌ధిక శాతం మంచి న‌మ్మ‌కంతో స్థిరాదాయం గ‌ల రంగాల‌లో పెట్టుబ‌డి పెడుతున్నామ‌ని తెలిపారు. 75% ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డికి అగ్ర‌స్థానం ఇచ్చారు. ఆ త‌ర్వాత ఈపీఎఫ్‌కి 44% మంది అనుకూలంగా ఉన్నారు. పీపీఎఫ్‌లో పెట్టుబ‌డికి 43% మంది ఆమోదం తెలిపారు. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు పెట్టుబ‌డి ఎంపిక‌గా బీమాను 23% మంది మాత్ర‌మే అనుకూలంగా ఉన్నారు. బీమా అనేది పెట్టుబ‌డి సాధ‌నం కాద‌ని, జీవిత ర‌క్ష‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే అంశం మాత్ర‌మేన‌ని చాలా మంది తెల‌ప‌డం విశేషం.

మ‌దుపు చేసే వారిలో చాలా మందికి దీర్ఘ‌కాలిక పెట్టుబ‌డుల గురించి మంచి అవ‌గాహ‌న‌, జీవితంలో ప‌ద‌వీ విర‌మ‌ణ అనంత‌రం (2వ ఇన్నింగ్స్‌లో) ఆర్థిక స్వేచ్ఛ‌ను సాధించాల‌నే త‌ప‌న‌ చాలా ఎక్కువ ఉండ‌టం కూడా ఈ స‌ర్వే క‌నుగొంది. 75% కంటే ఎక్కువ మంది త‌మ జీవిత ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలో ఆర్థిక ప్ర‌ణాళిక‌ను క‌లిగి ఉండాల‌ని, అవ‌స‌ర‌మైతే ఆర్థిక స‌ల‌హాదారుని అవ‌స‌రాన్ని గుర్తించారు. అయితే, పెరిగిన సాంకేతిక ప‌రిజ్ఞానంతో 65% మంది త‌మ ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను సొంతంగా నిర్వ‌హించుకుంటున్నార‌ని, 20% మంది మాత్ర‌మే వృత్తిప‌ర‌మైన స‌ల‌హాలు పొందాల‌ని ఆలోచిస్తున్నార‌ని అధ్య‌య‌నం చెబుతుంది.

62% మంది 30 ఏళ్లు నిండిన త‌ర్వాత ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం పొదుపు చేయ‌డం ప్రారంభిస్తున్నారు. ఈ వ‌య‌స్సులోనే ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌పై దృష్టి పెట్ట‌డం మంచి ప‌రిణామ‌మే. ఆర్థిక రంగంలో వేగంగా ప‌ట్టు సాధించాల‌న్నా, ప‌రిశోధ‌న చేయాల‌న్నా, లెక్క‌ల్లో కచ్చిత‌త్వం, నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో వేగం పెర‌గాలంటే సాంకేతిక ప‌రిజ్ఞానంతో కూడిన డిజిట‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్స్ అవ‌స‌రం ఉంద‌ని చాలా మంది మ‌దుపుదారులు గుర్తించారు.

ఇవే ఎందుకంటే...?

మ్యూచువ‌ల్ ఫండ్స్: స్వ‌ల్ప‌కాల పెట్టుబ‌డుల‌తో లాభాల‌ను పొంద‌డం అనేది మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో కుద‌ర‌క‌పోవ‌చ్చు. కానీ దీర్ఘ‌కాలం వేచిచూస్తే మ్యూచువ‌ల్ ఫండ్లు కూడా మంచి ఆర్థిక పెట్టుబ‌డి సాధ‌నాలే. అనేక లార్జ్‌, మిడ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు 3 నుంచి 10 సంవ‌త్స‌రాల‌లో 20% కంటే ఎక్కువ రాబ‌డిని ఇచ్చాయి. అయితే, మ్యూచువ‌ల్ ఫండ్స్ మ‌దుపునకు క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు (SIP) చాలా ముఖ్యం. దీర్ఘ‌కాలం వేచి చూసేవారికి ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో మంచి రాబ‌డి ఇచ్చిన చ‌రిత్ర భార‌త స్టాక్ మార్కెట్ల‌కు  ఉంది. స్వ‌ల్ప కాలానికి మ‌దుపు చేస్తే ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో రిస్క్ ఉంటుంది. ఇది గ‌మ‌నించ‌డం చాలా ముఖ్యం.

ఈపీఎఫ్: ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ రంగంలో ఉద్యోగంలో చేరిన ప్ర‌తి ఒక్క‌రికీ ఈ ప‌థ‌కంలో స‌భ్వ‌త్వం ఉంటుంది. అంతేకాకుండా ఏ ఇత‌ర ప్ర‌భుత్వ పొదుపు ప‌థ‌కాల క‌న్నా కూడా ఇందులోనే ఎక్కువగా వ‌డ్డీ రేటు (8.10%) ఉంటుంది. ఉద్యోగ విర‌మ‌ణ పొందేవ‌ర‌కు ఈ ప‌థ‌కంలో కొన‌సాగ‌వచ్చు. రాబ‌డికి ప‌న్ను లేదు. రుణాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవ‌చ్చు.

పీపీఎఫ్: పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసులో గానీ, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులో గానీ ప్రారంభించ‌వ‌చ్చు. ఇది దీర్ఘ‌కాల పొదుపు ప‌థ‌కం అవ్వ‌డంతో పెట్టుబ‌డిదారుడు ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని కూడా కూడ‌బెట్టొచ్చు. పీపీఎఫ్ ఖాతా 100% రిస్క్ లేనిది. పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. పీపీఎఫ్‌లో మెచ్యూరిటీపై పొందే అస‌లు, వ‌డ్డీ మొత్తం కూడా ప‌న్ను ర‌హితం. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాలి. గరిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయొచ్చు. పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ వ్య‌వ‌ధి 15 ఏళ్లు అయినా కూడా దీర్ఘ‌కాలం పొడిగించుకోవ‌చ్చు. పీపీఎఫ్ డిపాజిట్ల‌కు ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. ఖాతాదారుడు వేరే ఏవైనా ఆర్థిక లావాదేవీలో విఫ‌లం చెందినా, పీపీఎఫ్ రుణాన్ని చెల్లించ‌డానికి ఖాతాలో సొమ్మును మ‌ళ్లించ‌లేరు. ఆఖ‌రికి కోర్టు డిక్రీ ఆర్డ‌ర్ ద్వారా కూడా పీపీఎఫ్ సొమ్ముని ముట్టుకోలేరు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని