China Economy: వడ్డీ రేటు తగ్గించిన చైనా సెంట్రల్‌ బ్యాంక్‌.. జిన్‌పింగ్‌ కోసమేనా?

బీజింగ్‌: ఓ వైపు ప్రపంచ దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లన్నీ వడ్డీ రేట్లు పెంచేపనిలో ఉండగా.. చైనా సెంట్రల్‌ బ్యాంక్‌ మాత్రం కీలక వడ్డీ రేటును తగ్గించింది. కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు మార్కెట్‌లోకి నిధుల ప్రవాహాన్ని పెంచింది. గత కొన్ని రోజులుగా చైనా ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగానే ఉన్న సంగతి తెలిసిందే. పారిశ్రామికోత్పత్తి తగ్గుముఖం పట్టింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం దాదాపు కుదేలైంది. ఈ నేపథ్యంలో పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా రంగంలోకి దిగి ఏడాది రుణాలపై వడ్డీ రేటును 2.85 శాతంగా ఉన్న 2.75 శాతానికి తగ్గించింది. వరుసగా మూడోసారి అధికారం చేపట్టేందుకు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సిద్ధమవుతున్న వేళ ఈ నిర్ణయం తీసుకుంది.

కొవిడ్‌ కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. ముఖ్యంగా జీరో కొవిడ్‌ వ్యూహం అనుసరించడం ఆర్థిక వృద్ధిని దెబ్బతీసింది. తయారీ రంగం, వినియోగదారుల కొనుగోళ్ల శక్తి పడిపోయింది. రియల్‌ ఎస్టేట్‌ రంగం దాదాపు దివాళా తీసే పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు వృద్ధి బాటలో ఉన్న ఇళ్ల అమ్మకాలు గతేడాదితో పోల్చినప్పుడు దాదాపు 28.8 శాతం పడిపోయాయి. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌ మూడోసారి అధికారం చేపట్టడానికి ఇవేవీ ఆటంకంగా మారకూడదని సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వడ్డీరేటు తగ్గించడం ద్వారా 400 బిలియన్‌ యువాన్లను రుణ మార్కెట్లోకి వదిలింది.

2012 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీలో తిరుగులేని నేతగా జిన్‌పింగ్‌ ఉన్నారు. మరోసారి ఆయనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారని అంతా భావిస్తున్నారు. అయితే, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే కొన్ని అధికారాలను పార్టీలోని ఇతర సభ్యులతో పంచుకోవాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వైపు అధిక రుణ భయాలున్నా.. వడ్డీరేటు తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించాలని సెంట్రల్‌ బ్యాంక్‌ భావిస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్‌ జరగనుంది. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. పార్టీ అధినేతే దేశాధ్యక్షుడిగా, సైన్యాధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.


మరిన్ని

ap-districts
ts-districts