Health Insurance: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో అనేక ఒడుదొడుకులు వ‌స్తూనే ఉంటాయి. వైద్య అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు కూడా ఇందులో భాగ‌మే. అయితే వైద్యానికి అయ్యే ఖ‌ర్చులు నానాటికీ పెరుగుతుండ‌డంతో భ‌విష్య‌త్‌ వైద్య ఖర్చులకు తగిన ఏర్పాటు చేసుకోవడం అవ‌స‌రం. ఇందుకు ఉన్న ఏకైక మార్గం ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు. దీర్ఘకాలిక లక్ష్యాలు దెబ్బ‌తిన‌కుండా, ఆరోగ్య బీమా తీసుకోవడం ప్రతి కుటుంబానికీ ఎంతో అవసరం. గ‌త రెండేళ్లుగా ప్ర‌పంచ దేశాలు ఎదుర్కుంటున్న కొవిడ్ ప‌రిస్థితులు ఆరోగ్య బీమాకు ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నాయి. ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. చాలా మంది ఆరోగ్య బీమాను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ పాల‌సీ ఎంపిక‌లో మాత్రం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం లేదు. ఆరోగ్య బీమా కోసం ఏదో ఒక పాలసీ తీసుకోవడం వల్ల ఫలితం ఉండదు. కుటుంబ వైద్య అవ‌స‌రాల‌కు త‌గిన బీమా పాల‌సీ ఎంచుకోవ‌డం చాలా ముఖ్యం. ఏ బీమా సంస్థ నుంచి తీసుకోవాలి? క‌వ‌రేజీ ఎంత ఉండాలి? బీమా సంస్థ ఎంత శాతం క్లెయిమ్‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంది? వెయిటింగ్ పిరియ‌డ్ ఎంత? బీమా సంస్థ నో-క్లెయిమ్ బోన‌స్‌ అందిస్తుందా? లేదా? త‌దిత‌ర అంశాల‌ను తెలుసుకోవాలి.

ఆరోగ్య బీమా కొనుగోలుకు ముందు ప‌రిగ‌ణించాల్సిన అంశాలు..

వయసు: ఆరోగ్య బీమాలో పాల‌సీదారుని వ‌య‌సు కీలకమైన అంశం అనే చెప్పాలి. ఇది ప్రీమియం నిర్ణ‌యించ‌డంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. చిన్న వ‌య‌సులో ఉన్న వారు అనారోగ్యం బారిన ప‌డేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి ప్రీమియం త‌క్కువ‌గా ఉంటుంది. పెద్ద వ‌య‌సువారు అనారోగ్యం బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ. కాబ‌ట్టి ప్రీమియం ఎక్కువ‌గా ఉంటుంది. ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీల ప్రీమియం కూడా కుటుంబ పెద్ద వ‌య‌సు ఆధారంగానే నిర్ణ‌యిస్తారు. అందుకే సాధార‌ణంగా సీనియ‌ర్ సిటిజ‌న్లు ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీలో చేర్చ‌కుండా వారి కోసం విడిగా పాల‌సీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే, ఆరోగ్య బీమా కొనుగోలు స‌మ‌యంలో వ‌యో ప‌రిమితిని త‌ప్ప‌నిస‌రిగా చూడాలి. కొన్ని పాల‌సీల‌కు కనీస, గరిష్ఠ‌ ప్రవేశ వ‌య‌సుపై ప‌రిమితి ఉంటుంది. కనీస‌, గరిష్ఠ‌ వయోపరిమితులు లేని పాల‌సీల‌ను ఎంచుకోవ‌డం మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల వ‌య‌సు పెరిగినా, పాల‌సీ పునరుద్ధ‌ర‌ణ‌కు ఎలాంటి ఇబ్బందులూ ఉండ‌వు.

ప్రీమియం, క‌వరేజీ: భవిష్యత్‌లో మనకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు వస్తాయో ఇప్పుడే ఊహించడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితులే అప్పుడూ ఉంటాయని చాలామంది తక్కువ మొత్తానికి, తక్కువ ప్రీమియంతో పాలసీ తీసుకుంటారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉండే పాలసీల్లో అనేక పరిమితులు ఉంటాయి. ఫలితంగా, పాలసీ ఉండి కూడా సొంతంగా వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అలా అని ప్రీమియం ఎక్కువగా ఉండే పాలసీలన్నీ మంచివని చెప్పలేం. మన అవసరాలకు తగిన క‌వ‌రేజీ వ‌స్తుందా? దానికి ఎంత ప్రీమియం చెల్లించవచ్చు?ప్రీమియంకి త‌గ్గ క‌వ‌రేజీ ల‌భిస్తుందా? ఇవన్నీ తెలుసుకున్నాకే స‌రైన పాల‌సీని తీసుకోవాలి.

వెయిటింగ్ పిరియ‌డ్‌: ముందుగా నిర్ధార‌ణ‌ అయిన‌ వ్యాధుల చికిత్సకు వెయిటింగ్ పిరియ‌డ్‌ (నిర్ణీత వ్యవధి) తర్వాతే బీమా వర్తిస్తుంది. గరిష్ఠంగా ఇది నాలుగేళ్ల వరకు ఉండొచ్చు. అంటే, ఈ వ్యవధి ముగిసేవరకూ వీటి చికిత్స ఖర్చులను మీరే భరించాలన్నమాట. దీంతోపాటు కొన్ని ర‌కాల‌ వ్యాధులకు కూడా వేచి ఉండే సమయం ఉంటుంది. ఉదాహరణకు కంటి శుక్లాల శస్త్రచికిత్స, హెర్నియా లాంటి వాటికి పాలసీ తీసుకున్న ఏడాది, రెండేళ్ల తర్వాతే చికిత్సకు పరిహారం ఇస్తారు. కాబట్టి వీలైనంత తక్కువ వేచి ఉండే కాలం ఉన్న పాలసీలను తీసుకునేందుకు ప్రయత్నించాలి.

న‌గ‌దు ర‌హిత సేవ‌లు: వైద్య అత్య‌వ‌స‌రాల స‌మయంలో న‌గ‌దు ర‌హిత చికిత్స‌ను అందించ‌గ‌లిగేలా పాల‌సీ ఉండాలి. అంటే, వైద్య అవ‌స‌రాల నిమిత్తం ఆసుపత్రిలో చేరిన‌ప్పుడు పాల‌సీదారులు డ‌బ్బు చెల్లించ‌కుండా వైద్యం అందించేలా బీమా సంస్థ‌లు, ఆసుప‌త్రుల‌తో ఒప్పందం కుదుర్చుకుంటాయి. వీటినే నెట్ వ‌ర్క్ హాస్పిట‌ల్స్ అంటారు. దీనివ‌ల్ల ఆసుపత్రి అడ్మిష‌న్ స‌మ‌యంలో డ‌బ్బు ఏర్పాట్ల‌కు ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. అలాగే, రీయింబర్స్‌మెంట్ కోసం ఫైల్ చేయవలసిన అవసరం ఉండ‌దు. బీమా సంస్థ నేరుగా ఆసుపత్రికి బీమా మొత్తాన్ని చెల్లిస్తుంది. అందువ‌ల్ల పాల‌సీ తీసుకునేట‌ప్పుడు నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల జాబితాను చెక్‌ చేయాలి. మీరు నివాసం ఉండే ప్రాంతానికి ద‌గ్గ‌ర‌లో నెట్ ఆసుప్ర‌తులు ఉండడం మంచిది.

ఆసుప్ర‌తిలో చేర‌క ముందు, త‌ర్వాత ఖ‌ర్చులు: చాలా వ‌ర‌కు ఆరోగ్య బీమా ప్లాన్లు ఆసుప‌త్రిలో చేరిన‌ప్పుడు అయ్యే ఖ‌ర్చుల‌ను మాత్ర‌మే క‌వ‌ర్ చేస్తాయి. ఆసుప‌త్రిలో చేర‌క ముందు, డిశ్చార్జ్ అయిన త‌ర్వాత ఖ‌ర్చులు (అంబులెన్స్‌, వైద్య ప‌రీక్ష‌లు, వైద్యుడిని సంప్ర‌దించినందుకు, మందుల ఖ‌ర్చుల‌ను) క‌వ‌ర్ చేయ‌వు. ఇలాంటి వాటికి కూడా చాలానే ఖ‌ర్చ‌వుతుంది. అందువ‌ల్ల ఈ ఖ‌ర్చులు కూడా పాల‌సీ చెల్లించే విధంగా ఉండాలి.

వార్షిక వైద్య ప‌రీక్ష‌లు: ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు ఆరోగ్య బీమా పాల‌సీలు యాన్యువ‌ల్ ‘హెల్త్ చెక‌ప్’ ప్ర‌యోజ‌నాన్ని అందిస్తున్నాయి. దీంతో పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి ప్ర‌తి సంవ‌త్స‌రం ఉచితంగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌చ్చు. ఈ వైద్య ప‌రీక్ష‌లతో పాల‌సీదారుడు.. తమ ప్రస్తుత ఆరోగ్య స్థితి గురించి తెలుసుకోవ‌డంతో పాటు, వివిధ ర‌కాల వ్యాధుల‌ను ప్రాథ‌మిక స్థాయిలోనే గుర్తించ‌వ‌చ్చు. ముఖ్యంగా జీవ‌న‌శైలి వ్యాధులైన మధుమేహం, అధిక ర‌క్త‌పోటు వంటివి ఒక్కోసారి ప్రాణాంత‌కంగా మారుతుంటాయి. ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించ‌డం వ‌ల్ల చాలా వ‌ర‌కు క్లిష్ట‌మైన వ్యాధుల బారిన ప‌డ‌కుండా నివారించ‌వ‌చ్చు. అందువల్ల వార్షిక మెడిక‌ల్ చెక‌ప్‌లు పాల‌సీలో భాగం అయ్యేలా చూసుకోవ‌డం మంచిది.

కో-పేమెంట్స్, స‌బ్‌ లిమిట్స్‌: చాలా మంది పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో 'కో-పేమెంట్' గురించి ప‌ట్టించుకోరు. క్లెయిమ్ స‌మ‌యంలో దీని ప్ర‌భావం తెలుస్తుంది. పాల‌సీలో కో-పేమెంట్ క్లాజ్ ఉంటే.. వైద్య ఖ‌ర్చుల‌కు పాల‌సీ పేర్కొన్న నిష్ప‌త్తిని అనుస‌రించి మాత్ర‌మే బీమా సంస్థ చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పాల‌సీదారుడు స్వ‌యంగా చెల్లించాలి. అలాగే, ప్రస్తుతం ఆసుపత్రుల గదుల అద్దెలు భారీగా ఉంటున్నాయి. ఇతర ఖర్చులూ అధికమే. ఇలాంటప్పుడు ఉప పరిమితులు ఉన్న పాలసీ తీసుకుంటే.. ఖ‌ర్చులు భారం అవుతాయి. ఎలాంటి పరిమితులూ లేకుండా వైద్య ఖర్చులు చెల్లించే పాలసీలే ఎప్పుడూ ఉత్తమం. పాలసీ ఎంపిక చేసుకునేప్పుడు ఈ విషయాలను తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి.

నో క్లెయిమ్ బోనస్‌: ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్‌లూ లేకపోతే…పునరుద్ధరణ సమయంలో బీమా సంస్థలు నో క్లెయిమ్ బోనస్‌ ఇస్తాయి. ఫలితంగా పాలసీ మొత్తం 5 శాతం నుంచి 10 శాతం వరకూ పెంచుకోవ‌చ్చు లేదా ప్రీమియం మొత్తం త‌గ్గించుకోవ‌చ్చు. పాలసీ తీసుకునేటప్పుడు అధికంగా నో క్లెయిమ్ బోనస్‌ ఇచ్చే పాలసీలను పరిశీలించాలి. పెరుగుతున్న వైద్య ఖర్చులను తట్టుకునేందుకు ఇది మంచి అవకాశం. ప్రీమియంలో తగ్గింపు కన్నా.. పాలసీ మొత్తాన్ని పెంచే పాలసీలే ఎప్పుడూ ఉత్తమం.

క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో: ఒక పాలసీని ఎంచుకోవాలనుకున్నప్పుడు అంతర్గతంగా ఉన్న అనేక నిబంధనలను పరిశీలించడంతోపాటు.. చూడాల్సిన మరో ముఖ్యమైన అంశం క్లెయిం చెల్లింపుల చరిత్ర (క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో). ఎంత మంచి పాలసీ అయినా, క్లెయిమ్‌ల విషయంలో లేనిపోని ఇబ్బందులు పెడితే అంతిమంగా వచ్చే ఫలితం ఏమీ ఉండదు. పైగా మానసిక ఆందోళన పెరుగుతుంది కూడా. కాబ‌ట్టి, చిన్న చిన్న కారణాలతో క్లెయిమ్‌లను నిరాకరించే సంస్థలు అందించే పాలసీలకు దూరంగా ఉండటమే మంచిది. మీకు సరిపోయే పాలసీని, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థ నుంచి తీసుకున్నప్పుడే ఆపదలో మిమ్మల్ని ఆదుకుంటుంది.

రహస్యాలు దాచకండి: వైద్యుడి దగ్గరకు వెళ్లినప్పుడు మన ఆరోగ్యానికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా దాచిపెట్టకూడదు అంటారు. ఆరోగ్య బీమా పాలసీకీ ఇది వర్తిస్తుంది. మన ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలనూ ప్రతిపాదిత పత్రంలో పేర్కొనడం ఎప్పుడూ మంచిది. చాలామంది చేసే పొరపాటేమిటంటే.. ఆరోగ్యానికి సంబంధించిన అన్ని వివరాలూ చెబితే పాలసీ రాదేమో అని అపోహ పడుతుంటారు. బీమా సంస్థకు అన్ని వివరాలూ తెలియజేయాల్సిన నైతిక బాధ్యత పాలసీదారులదే. తెలియజేయకపోతే మోసపూరితంగా పాలసీ పొందినట్లు అవుతుంది. ఇలా చేయడం వల్ల క్లెయిమ్‌ నిరాకరించే అవకాశం లేకపోలేదు. పాలసీ తీసుకునేటప్పుడు మీకు సంబంధించిన వివరాలన్నీ తెలియజేయడంతోపాటు, అవసరమైతే ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. అప్పుడే మున్ముందు వచ్చే ఇబ్బందులను తప్పించుకోవచ్చు. 

క్లెయిమ్ ప్రాసెస్ సుల‌భంగా: క్లెయిమ్ ప్రాసెస్ వేరు వేరు బీమా సంస్థ‌ల‌కు వేరు వేరుగా ఉంటుంది. అందువల్ల పాల‌సీ కొనుగోలు చేసేముందు క్లెయిమ్ ప్రాసెస్‌ను తెలుసుకోవాలి. సుల‌భంగా ప్రాసెస్ పూర్త‌య్యేలా ఉండాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో పాల‌సీ తీసుకున్న పాల‌సీదార్లు ఇచ్చిన రివ్యూల‌ను చ‌ద‌వడం ద్వారా కూడా బీమా సంస్థ మెరుగైన సేవ‌ల‌ను అందిస్తుందా లేదా తెలుసుకోవ‌చ్చు.

చివ‌రిగా: పాలసీని తీసుకునేటప్పుడు ప్రీమియం ఒక్కటే కొలమానం కాదు. ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్య ఖర్చులతో పాటు అనేక ఇతర ఖర్చులూ ఉంటాయి. కాస్త అధిక ప్రీమియం ఉన్నప్పటికీ పూర్తి పరిహారాన్ని ఇచ్చే పాలసీని తీసుకోవడమే ఎప్పుడూ ఉత్తమం.


మరిన్ని

ap-districts
ts-districts