IKIO Lighting IPO: ఐపీఓకి ఎల్‌ఈడీ లైట్ల తయారీ కంపెనీ.. సెబీకి ఇకియో దరఖాస్తు

దిల్లీ: ప్రముఖ ఎల్‌ఈడీ లైట్ల తయారీ కంపెనీ ఇకియో లైటింగ్‌ లిమిటెడ్‌ ఐపీఓకి వచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ మేరకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సోమవారం ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో రూ.350 కోట్లు విలువ చేసే తాజా షేర్లను అందుబాటులో ఉంచనున్నారు. మరో 75 లక్షల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు హర్దీప్‌ సింగ్‌, సుర్మీత్‌ కౌర్‌ విక్రయించనున్నారు.

ఈ ఐపీఓలో సమీకరించిన నిధుల్లో రూ.50 కోట్లతో రుణ భారాన్ని తగ్గించుకోనున్నారు. మరో రూ.236.68 కోట్లను అనుబంధ సంస్థ ఇకియో సొల్యూషన్స్‌ కోసం నోయిడాలో ఓ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన నిధుల్ని సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు. ఇకియో ఎల్‌ఈడీ లైట్ల డిజైనింగ్‌, అభివృద్ధి, తయారీ వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంది. ఇది నేరుగా వినియోగదారులకు తన సొంత బ్రాండ్‌పై ఎలాంటి విక్రయాలు జరపదు. తమ ఉత్పత్తుల్ని ఇతర బ్రాండ్లకు విక్రయిస్తుంటుంది. దీనికి హరిద్వార్‌లో ఒకటి, నోయిడాలో మూడు తయారీ కేంద్రాలున్నాయి.

మార్చి 31, 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇకియో ఆదాయం రూ.55.47 కోట్లు పెరిగి రూ.331.84 కోట్లకు చేరింది. పన్నుల అనంతర లాభాలు 75.37 శాతం వృద్ధితో రూ.50.52 కోట్లుగా నమోదయ్యాయి. మోతీలాల్‌ ఓస్వల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ ఒక్కటే ఈ ఐపీఓకి లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని