
సంక్షిప్త వార్తలు
2023 ఆగస్టు 15లోపు 5జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ సీఎండీ పీకే పూర్వార్
దిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి 5జీ సేవలు అందించేందుకు సిద్ధమవుతోందని సీఎండీ పీకే పూర్వార్ సోమవారం ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో వెల్లడించారు. ఈ నవంబరు నుంచి 4జీ నెట్‌వర్క్‌ను ప్రారంభించి, క్రమంగా వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 5జీ సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ విధించిన గడువులోపు లక్ష్యాన్ని చేరుకుంటామని తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఐటీ దిగ్గజం టీసీఎస్, ప్రభుత్వ రంగ టెలికాం పరిశోధన, అభివృద్ధి సంస్థ సీ-డాట్ కన్సార్షియమ్తో బీఎస్ఎన్ఎల్ చర్చిస్తోందన్నారు. కంపెనీ కొనుగోలు చేస్తున్న 4జీ నెట్వర్క్ పరికరాలను తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా 5జీకి మార్చుకునేలా చూస్తున్నామన్నారు.
పీఎన్బీ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు
దిల్లీ: వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలను ప్రారంభించినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తెలిపింది. ఖాతాదారులు, ఇతర వ్యక్తులు సైతం ఈ సేవలు వినియోగించుకోవచ్చని వెల్లడించింది. వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు వినియోగదారులు పీఎన్బీ అధికారిక నంబరు +919264092640ను ఫోన్‌బుక్‌లో సేవ్ చేసుకోవాలని, అనంతరం ఈ నంబరుకు హాయ్/హెలో అని సందేశం పంపాలని బ్యాంక్ పేర్కొంది. వాట్సాప్‌పై పీఎన్బీ ప్రొఫైల్ పేరులో గ్రీన్ టిక్‌ను చూసుకోవాలని, అధికారిక ఖాతాకు మాత్రమే సందేశం పంపాలని వివరించింది. ప్రస్తుతం బ్యాలన్స్ ఎంక్వైరీ, చివరి అయిదు లావాదేవీలు, స్టాప్ చెక్, చెక్ బుక్కు విజ్ఞప్తి వంటి సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు పీఎన్బీ తెలిపింది. ఆన్లైన్ అకౌంట్ ఓపెనింగ్, బ్యాంక్ డిపాజిట్లు/రుణాల సమాచారం, డిజిటల్ ఉత్పత్తులు, ఎన్ఆర్ఐ సేవలు వంటి ఇతర సేవలను అందించనున్నట్లు వివరించింది.
2% తగ్గిన బజాజ్ ఆటో విక్రయాలు
దిల్లీ: బజాజ్ ఆటో మొత్తం వాహన విక్రయాలు 2021 సెప్టెంబరుతో పోలిస్తే గత నెలలో 2% తగ్గి 3,94,747కు పరిమితమయ్యాయి. గత ఏడాది సెప్టెంబరులో సంస్థ 4,02,021 వాహనాలకు విక్రయించింది. మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 3,61,036 నుంచి 4% తగ్గి 3,48,355కు పరిమితమయ్యాయి. మొత్తం వాణిజ్య వాహన విక్రయాలు 40,985 నుంచి 13% పెరిగి 46,392కు చేరాయి.
* మహీంద్రా అండ్ మహీంద్రా మొత్తం వాహన టోకు విక్రయాలు గత నెలలో 64,486 వాహనాలకు చేరాయి. ఈ సంస్థకు ఇప్పటి వరకు ఇవే రికార్డు స్థాయి విక్రయాలు కావడం విశేషం.
* అశోక్ లేలాండ్ గత నెలలో 17,549 వాహనాలను విక్రయించింది. 2021 సెప్టెంబరులో అమ్మిన 9,533 వాహనాలతో పోలిస్తే ఇవి 84% ఎక్కువ.
* హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా వాహన విక్రయాలు గత నెలలో 7.6 శాతం పెరిగి 5,18,559కు చేరాయి. 2021 సెప్టెంబరులో కంపెనీ 4,81,908 వాహనాలను విక్రయించింది.
ప్రయాణికుల వాహన విభాగంలోకి అల్టీగ్రీన్
ఈనాడు, హైదరాబాద్: సరకు రవాణాకు ఉపయోగించే విద్యుత్ వాహనాలను అందిస్తోన్న అల్టీగ్రీన్ త్వరలోనే ప్రయాణికుల వాహనాన్నీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మూడు చక్రాల వాహన విభాగంలో ప్రస్తుతం 3 మోడళ్లను అందిస్తున్నట్లు సంస్థ డైరక్టర్ (సేల్స్-సర్వీస్) దేబాశిష్ మిత్రా తెలిపారు. ఒక ఛార్జింగ్‌తో 150 కిలోమీటర్లకు పైగా ప్రయాణించేలా తాము ఈ సరకు రవాణా వాహనాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకూ బీ2బీ విభాగంలోనే అందుబాటులో ఉన్నప్పటికీ.. ఇప్పుడు బీ2సీ విభాగంలోకి విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 40కి పైగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. వినియోగదారుడిని చేరే వరకూ ఉత్పత్తులను అందించేందుకు తమ వాహనాలు తోడ్పతాయని పేర్కొన్నారు. పలు ఇ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, ఇప్పుడు నేరుగా వినియోగదారులకు వాహనాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
నాలుగు అంకురాలకు నిధులు
ఈనాడు, హైదరాబాద్: వాహన రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టి-హబ్, రెనో నిస్సాన్ టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్ ఇండియా (ఆర్‌ఎన్‌టీబీసీఐ) సంయుక్తంగా నిర్వహించిన పోటీలో 4 అంకురాలు విజేతలుగా నిలిచాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఈ రెండు సంస్థలూ కలిసి వాహన రంగంలో పలు ఆవిష్కరణలపై పని చేస్తున్న సంస్థలకు పలు విభాగాల్లో పోటీలు నిర్వహించాయి. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా 150కి పైగా అంకురాలు పోటీ పడ్డాయి. పలు దశల్లో పరీక్షించిన అనంతరం మొత్తం నాలుగు సంస్థలను ఎంపిక చేసినట్లు టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇందులో ఇమాజినేట్, ఎంసెన్స్, మాయాఎండీ, రేస్ఎనర్జీలు ఉన్నాయని వెల్లడించారు. ఎంపికైన సంస్థకు రూ.10 లక్షల మేరకు నిధులను ఆర్‌ఎన్‌టీబీసీఐ అందించనుంది. దీంతోపాటు ఈ అంకురాలకు వాహన రంగంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవకాశాలను పరిచయం చేయడంతోపాటు, మార్గనిర్దేశకత్వం లభిస్తుందని పేర్కొన్నారు. కార్పొరేట్లకు అంకురాలను అనుసంధానం చేసేందుకు టి-హబ్ ఈ నెల 20న కార్పొరేట్ ఇన్నోవేషన్ సదస్సును నిర్వహించనుంది.
ఎన్ఎండీసీ అమ్మకాల్లో 6.59% వృద్ధి
ఈనాడు, హైదరాబాద్: ఎన్ఎండీసీ గత నెలలో 6.59 శాతం అధిక అమ్మకాలను నమోదు చేసింది. గత నెలలో 2.91 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం విక్రయాలు నమోదు చేసినట్లు, క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 2.73 మిలియన్ టన్నుల మేరకు ఉన్నట్లు ఎన్ఎండీసీ వెల్లడించింది. అదే సమయంలో ఉత్పత్తి 1.5% మాత్రమే పెరిగింది. క్రితం ఏడాది సెప్టెంబరు నెలలో ఇనుప ఖనిజం ఉత్పత్తి 2.69 మిలియన్ టన్నులు కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో 2.73 మి.టన్నుల ఉత్పత్తి నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 16.18 మిలియన్ టన్నుల ఉత్పత్తి, 16.36 మిలియన్ టన్నుల అమ్మకాలను ఎన్ఎండీసీ సాధించింది.
అదానీ గ్రీన్ ఎనర్జీకి మరో 3 అనుబంధ కంపెనీలు
దిల్లీ: పునరుత్పాదక ఇంధన వ్యాపారం కోసం అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ హోల్డింగ్ ఫోర్ లిమిటెడ్ 3 అనుబంధ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు అదానీ గ్రూప్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్) సోమవారం వెల్లడించింది. పవన, సౌర, ఇతర పునరుత్పాదక శక్తిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి, అభివృద్ధి, సరఫరా, పంపిణీ, విక్రయం తదితర అవసరాల కోసం ఈ కొత్త అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసినట్లు ఏజీఈఎల్ తెలిపింది. అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ థర్టీ సిక్స్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫార్టీ లిమిటెడ్, అదానీ రెన్యూవబుల్ ఎనర్జీ ఫార్టీ సెవెన్ లిమిటెడ్ పేర్లతో కొత్త అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసింది.
బిల్‌డెస్క్‌ను కొనుగోలు చేయం
ఒప్పందం రద్దు చేసుకున్నాం
కొన్ని షరతులు పాటించనందుకే: ప్రోసస్
దిల్లీ: దేశీయ చెల్లింపుల సంస్థ బిల్‌డెస్క్‌ను సుమారు రూ.38,400 కోట్ల(4.7 బిలియన్ డాలర్లు)కు కొనుగోలు చేసే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రోసస్ ఎన్వీ తెలిపింది. ఒప్పందంలో పేర్కొన్న కొన్ని షరతులను నిర్దేశిత గడువులోగా పాటించనందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నుంచి అనుమతులు పొందడం ఈ షరతుల్లో ఒకటి కాగా.. సెప్టెంబరు 5న సీసీఐ అనుమతులిచ్చింది. అందువల్ల ఏ షరతులను పాటించలేదన్న వివరాలపై స్పష్టత లేదు. అటు ప్రోసస్ కూడా వెల్లడించలేదు. ప్రోసస్‌కు చెందిన పేయూ సంస్థతో బిల్‌డెస్క్‌ను విలీనం చేయడం ద్వారా.. 147 బిలియన్ డాలర్ల వార్షిక చెల్లింపు లావాదేవీలతో డిజిటల్ చెల్లింపులపరంగా దిగ్గజ సంస్థ అవతరణకు అవకాశం ఉండేది. అంతే కాకుండా ప్రోసస్‌కు అతిపెద్ద కొనుగోలు లావాదేవీగానూ అయ్యేది.
నైకా బోనస్ షేర్ల ఇష్యూ
దిల్లీ: సౌందర్య ఉత్పత్తుల సంస్థ నైకా బోనస్ షేర్ల ఇష్యూ ప్రకటించింది. ఇష్యూలో భాగంగా మదుపర్లకు ప్రతి షేరుకు 5 బోనస్ షేర్లు (1:5 నిష్పత్తిలో) ఇవ్వనుంది. నవంబరు 3ను కంపెనీ రికార్డు తేదీని నిర్ణయించింది. బోనస్ ఇష్యూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదార్ల అనుమతి కోరనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో నైకా పేర్కొంది. సోమవారం బీఎస్ఈలో నైకా షేరు ఇంట్రాడేలో రూ.1411.80 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2.44 శాతం లాభంతో రూ.1304.90 వద్ద ముగిసింది.
2022లో భారత వృద్ధి 5.7 శాతానికి తగ్గొచ్చు!
యూఎన్‌సీటీఏడీ అంచనా
ఐక్యరాజ్యసమితి: ఈ ఏడాదిలో భారత జీడీపీ 5.7 శాతానికి తగ్గొచ్చని యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ (యూఎన్‌సీటీఏడీ) అంచనా వేసింది. అధిక ఆర్థిక ఖర్చులు, ప్రభుత్వ వ్యయాలు బలహీనంగా ఉండడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. 2023లో భారత వృద్ధి మరింత తగ్గి 4.2 శాతానికి క్షీణించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ‘2021లో భారత వృద్ధి 8.2 శాతంగా నమోదైంది. జీ20 దేశాల్లో ఇదే అత్యధికం. సరఫరా వ్యవస్థ ఇబ్బందులు తగ్గడం, దేశీయ గిరాకీ పెరగడంతో కరెంటు ఖాతా మిగులు లోటుగా మారింది. దీంతో వృద్ధి కూడా తగ్గనుంది’ అని యూఎన్‌సీటీఏడీ తెలిపింది.
స్వల్పంగా తగ్గిన తయారీ వృద్ధి: పీఎంఐ నివేదిక
దిల్లీ: సెప్టెంబరులో దేశీయ తయారీ రంగ వృద్ధి స్వల్పంగా నెమ్మదించింది. అయితే కంపెనీలు మరిన్ని నియామకాలు చేపట్టడం, ధరల ఒత్తిళ్లు తగ్గడంతో.. ఈ రంగానికి సానుకూల వాతావరణం కొనసాగుతోందని ఓ నివేదిక తెలిపింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యాన్‌ఫ్యాక్చరింగ్ పీఎంఐ నివేదిక ప్రకారం.. సెప్టెంబరులో తయారీ రంగ పీఎంఐ 55.1 పాయింట్లుగా ఉంది. పీఎంఐ సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే.. ఆ రంగంలో వృద్ధి ఉన్నట్లు భావిస్తారు. ఒకవేళ 50 పాయింట్ల కంటే తక్కువగా ఉంటే ఆ రంగంలో క్షీణతగా పరిగణిస్తారు. దీని ప్రకారం చూస్తే సెప్టెంబరులో తయారీ రంగ ఉత్పత్తిలో వృద్ధి ఉన్నప్పటికీ.. ఆగస్టులో నమోదైన 56.2 పాయింట్లతో పోలిస్తే కాస్త నెమ్మదించింది. అలాగే గత 15 నెలలుగా తయారీ రంగంలో వృద్ధి కొనసాగుతుండటం గమనార్హం. దేశీయ తయారీ రంగం బలంగా పుంజుకుంటోందనే విషయాన్ని ఇది సూచిస్తోంది. ఆర్డర్లు పెరుగుతుండటంతో దానికి తగ్గట్లుగా కంపెనీలు ఉత్పత్తిని పెంచేందుకు మొగ్గు చూపుతుండటం ఇందుకు కారణంగా నివేదిక పేర్కొంది. ముడి సరకు ధరల ఒత్తిళ్లు తగ్గడమూ కలిసి వస్తోందని తెలిపింది.
బీ న్యూ దసరా దీపావళి ధమాకా ఆఫర్లు
హైదరాబాద్: బీ న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ దసరా దీపావళి ఆఫర్లను ప్రకటించింది. మొబైల్స్‌తో పాటు గృహోపకరణాలపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన మొబైల్స్‌పై 40 శాతం (రూ.20,000 వరకు), యాక్సెసరీస్‌పై 60 శాతం, టీవీలపై రూ.15,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్లు సంస్థ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి, సీఈఓ సాయి నిఖిలేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితేష్ తెలిపారు. ఎస్బీఐ కార్డు ద్వారా జరిపే ప్రతి కొనుగోలుపై 7.5 శాతం వరకు, మొబిక్విక్ ద్వారా 5 శాతం ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్, బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా రూ.6,900 వరకు క్యాష్ బ్యాక్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన ప్రతి మొబైల్‌పై స్మార్ట్ వాచ్, స్టార్మ్ బడ్స్, స్మార్ట్ సౌండ్ బార్స్, నెక్ బ్యాండ్లను అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉంచామని వెల్లడించారు. సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా ఆధార్ కార్డు, పాన్ కార్డుపై మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌లను 0 శాతం డౌన్‌పేమెంట్, 0 శాతం వడ్డీపై వినియోగదార్లకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
డాక్టర్ రెడ్డీస్‌లో ఎల్ఐసీకి 7.7% వాటా
ఈనాడు, హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌లో తన వాటాను ఎల్ఐసీ ఆఫ్ ఇండియా పెంచుకుంది. ఈ ఏడాది జూన్ 15 నుంచి సెప్టెంబరు 30 మధ్యకాలంలో స్టాక్‌మార్కెట్ ద్వారా 33.86 లక్షల డాక్టర్ రెడ్డీస్ షేర్లను కొనుగోలు చేసింది. దీంతో డాక్టర్ రెడ్డీస్‌లో ఎల్ఐసీకి ఉన్న వాటా 7.7 శాతానికి పెరిగింది. ఇంతకు ముందు ఈ సంస్థకు ఉన్న వాటా 5.65 శాతం మాత్రమే. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ షేరు ధర ప్రస్తుతం రూ.4420 వద్ద ట్రేడ్ అవుతోంది. దీని ప్రకారం ఈ సంస్థ మార్కెట్ విలువ (మార్కెట్ కేపిటలైజేషన్) రూ.73,576 కోట్లుగా ఉంది.
సంక్షిప్తంగా
* వచ్చే ఆరు నెలల్లో 5జీ రేడియోలు దేశంలోకి రానున్నాయని సి-డాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ ఉపాధ్యాయ్ పేర్కొన్నారు. వీటిని పూర్తిగా దేశీయంగా తయారు చేసినట్లు పేర్కొన్నారు.
* భారత ఎగుమతులు సెప్టెంబరులో 3.52 శాతం తగ్గి 32.62 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. దిగుమతులు 5.44 శాతం పెరిగి 59.35 బి. డాలర్లకు చేరడంతో వాణిజ్యలోటు 26.72 బిలియన్ డాలర్లకు పెరిగింది. .
* ప్లాటినమ్ దిగుమతుల్ని కట్టడి చేసేందుకు దిగుమతి సుంకాన్ని 10.75% నుంచి 15.4 శాతానికి పెంచుతున్నట్లు ఆర్థిక శాఖ నోటిఫికేషన్ వెల్లడించింది.
* సీఎన్జీ, పీఎన్జీ రిటైల్ ధరలను సోమవారం అర్ధరాత్రి నుంచి పెంచుతున్నట్లు మహా నగర్ గ్యాస్ వెల్లడించింది. పెంపు తర్వాత సీఎన్జీ కిలో రూ.86, పీఎన్జీ ఎస్సీఎం రూ.52.50కు చేరతాయని తెలిపింది.
* ఫోన్‌పే తన ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి భారత్‌కు మార్చే ప్రక్రియను పూర్తి చేసింది.
* సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే 40% తక్కువ ధరకు పాస్ఫోరిక్ యాసిడ్(డీఏపీ తయారీలో కీలక ముడిపదార్థం)ను దిగుమతి చేసుకొనేందుకు భారతీయ ఫెర్టిలైజర్ సంస్థలు అంతర్జాతీయ సరఫరాదార్లతో చర్చిస్తున్నాయి. టన్నుకు 1,000-1,050 డాలర్లు చెల్లించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.
* ఓవరాక్టివ్ బ్లాడర్ చికిత్సలో వినియోగించే మిరాబెగ్రాన్ ఎక్స్టెండెడ్-రిలీజ్ జెనెరిక్ వెర్షన్ మాత్రల్ని 180 రోజుల పాటు ప్రత్యేకంగా విక్రయించేందుకు అమెరికా యూఎస్ఎఫ్డీఏ నుంచి జైడస్ లైఫ్సైన్సెస్కు అనుమతి లభించింది.
* ఎంయూఎఫ్‌జీ బ్యాంక్ ఇండియా నుంచి రూ.400 కోట్ల తొలి సస్టెయినబిలిటీ అనుసంధానిత రుణాన్ని పొందినట్లు జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ వెల్లడించింది.
* రహదారి ప్రాజెక్టుల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల ద్వారా రూ.1217 కోట్ల నిధులు సమీకరించినట్లు ఎన్హెచ్ఏఐ తెలిపింది.
* మారుతీ సుజుకీ వాహన ఉత్పత్తి సెప్టెంబరులో రెండింతలై 1,77,468కి చేరింది.
* గెయిల్ ఛైర్మన్‌గా సందీప్ కుమార్ గుప్తా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
* పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించడానికి డెల్టాటెక్ గేమింగ్, ప్రిస్టీన్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాకు సెబీ నుంచి అనుమతులు దక్కాయి.
* చైనా లేజర్ యంత్రాల దిగుమతిపై భారత్ యాంటీ-డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది.
మరిన్ని
Jio laptop: జియో ల్యాప్‌టాప్ వచ్చేసింది.. కేవలం వారికి మాత్రమే!
Jio 5g: రేపటి నుంచే ఆ నగరాల్లో 5జీ బీటా సేవలు.. రిలయన్స్ జియో ప్రకటన
Hero vida: మార్కెట్లోకి త్వరలో హీరో విడా ఎంట్రీ.. ఛార్జింగ్ కష్టాలకు చెక్..?
Stock Market: భారీగా పుంజుకున్న మార్కెట్లు.. 58,000 ఎగువకు సెన్సెక్స్!
Automobile retail sales: సెప్టెంబరు వాహన రిటైల్ విక్రయాల్లో 11% వృద్ధి


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Andhra News: శివప్రకాష్‌జీతో కన్నా అనూహ్య భేటీ.. సోము వీర్రాజుపై ఫిర్యాదు?
-
World News
Imran Khan: నన్ను చంపడానికి మళ్లీ కుట్ర: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్
-
India News
Supreme court: మీ కుటుంబ తగాదాలో న్యాయ వాదులను లాక్కండి: సుప్రీంకోర్టు మొట్టికాయలు
-
Crime News
Crime News: చెల్లిపై అక్క లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు
-
Ap-top-news News
Andhra News: నారాయణ.. వాలంటీర్ ఇవన్నీ విద్యార్హతలేనట!
-
Ap-top-news News
AP High Court: అభ్యంతరముంటే ‘బిగ్‌బాస్’ చూడొద్దు: హైకోర్టు