బ్యాంకింగ్‌, వాహన షేర్లకు అమ్మకాలు

సమీక్ష

బ్యాంకింగ్‌, వాహన, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌, నిఫ్టీ 1 శాతానికి పైగా నష్టపోయాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూల ప్రభావం చూపాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు ఇందుకు తోడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 49 పైసలు కోల్పోయి 81.89 వద్ద ముగియడం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. బ్యారెల్‌ ముడిచమురు 3.90 శాతం పెరిగి 88.46 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లలో టోక్యో మినహా మిగతావి నష్టాల్లో ముగిశాయి. ఐరోపా సూచీలు నీరసంగానే ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 57,403.92 పాయింట్ల వద్ద స్తబ్దుగా ప్రారంభమైంది. వెంటనే నష్టాల్లోకి జారుకున్న సూచీ.. ఇంట్రాడేలో 56,683.40 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. చివరకు 638.11 పాయింట్ల నష్టంతో 56,788.81 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 207 పాయింట్లు కోల్పోయి 16,887.35 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,855.55- 17,114.65 పాయింట్ల మధ్య కదలాడింది.

* సెన్సెక్స్‌ 30 షేర్లలో 26 నష్టపోయాయి. మారుతీ 3.16%, హెచ్‌యూఎల్‌ 2.77%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.55%, ఐటీసీ 2.32%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.26%, ఎస్‌బీఐ 2.15%, కోటక్‌ బ్యాంక్‌ 2.03%, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ 1.94%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.71%, ఎల్‌ అండ్‌ టీ 1.59% చొప్పున డీలాపడ్డాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ 1.99%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.46%, ఎన్‌టీపీసీ 0.41% లాభపడ్డాయి. రంగాల వారీ సూచీల్లో విద్యుత్‌ 3.24%, యుటిలిటీస్‌ 3.14%, వాహన 2.11%, ఎఫ్‌ఎమ్‌సీజీ 2.05%, కమొడిటీస్‌ 2.01%, వినియోగ 1.26%, స్థిరాస్తి 1.24% పడ్డాయి. ఆరోగ్య సంరక్షణ, టెలికాం రాణించాయి. బీఎస్‌ఈలో 2194 షేర్లు నష్టాల్లో ముగియగా, 1356 స్క్రిప్‌లు లాభపడ్డాయి. 154 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.

* అక్టోబరు 11 నుంచి రూ.1200 కోట్ల రైట్స్‌ ఇష్యూ కొనసాగుతుందని సుజ్లాన్‌ ఎనర్జీ వెల్లడించింది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఎండీ తులసీ తంతి ఆకస్మిక మరణం నేపథ్యంలో రైట్స్‌ ఇష్యూపై అనుమానాలు నెలకొనడంతో కంపెనీ సోమవారం స్పష్టత ఇచ్చింది.


మరిన్ని