Bank Account: పిల్లల పేరుతో బ్యాంకు ఖాతా తెరుస్తున్నారు? ఇవి తెలుసుకోండి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లలకు బ్యాంకు వ్యవస్థను చిన్నతనం నుంచే పరిచయం చేయవచ్చు. బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రాథమిక విషయాలను పిల్లలకు నేర్పించడం వల్ల.. పొదుపు అలావాటు చేయడంతో పాటు బ్యాంకు డిపాజిట్‌, విత్‌డ్రా, డెబిట్‌ కార్డు వినియోగం వంటి పలు విషయాల గురించి పిల్లలు చిన్నతనంలోనే నేర్చుకోగలుగుతారు. అలాగే, ఖర్చులు అదుపులో ఉంచుకుని పొదుపును ఏవిధంగా పెంచుకోవాలో తెలుసుకుంటారు. ఒకవేళ మీరు పిల్లలకు బ్యాంకు ఖాతా తెరిచి ఇచ్చేందుకు బ్యాంకును సంప్రదిస్తుంటే.. ముందుగా ఈ విషయాలను తెలుసుకోండి. 

ఏ వయసు పిల్లలు ఖాతా తెరవచ్చు?

18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న వారిని బ్యాంకులు మైన‌ర్లుగా ప‌రిగ‌ణిస్తాయి. అటువంటి వారి పేరుపై తెరిచే ఖాతాలను మైనర్‌ ఖాతాలుగా చూస్తాయి. 10 ఏళ్లపైన, 18 సంవత్సరాల్లోపు పిల్లల పేరుపై తెరిచే బ్యాంకు ఖాతాను పిల్లలే స్వయంగా నిర్వహించుకోవచ్చు. 10 ఏళ్లలోపు పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేదా సంరక్షకుడితో కలిసి ఖాతాను నిర్వహించే వీలుంది. 18 ఏళ్లు దాటిన తర్వాత మైనర్‌ ఖాతాను సాధారణ పొదుపు ఖాతాగా మారుస్తారు.

ఎలాంటి సేవలు పొందొచ్చు?

డెబిట్‌ లేదా ఏటీఎం కార్డు, చెక్‌బుక్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ వంటి పలు సదుపాయాలు బ్యాంకులు మైనర్‌ ఖాతాలకు అందిస్తున్నాయి. అయితే, ఈ సేవలపై నిర్దిష్ట పరిమితులు ఉంటాయి. ఖాతా తెరిచే ముందు బ్యాంకును సంప్రదించి ఏ సేవలపై ఎంత వరకు పరిమితులు వర్తిస్తాయో తెలుసుకోవాలి. 

బ్యాంకు లావాదేవీలు ఎలా నేర్పించాలి?

నగదు డిపాజిట్, విత్‌డ్రా: బ్యాంకులో లావాదేవీలు ప్రాథమికంగా నగదు డిపాజిట్, విత్‌డ్రాలతో మొదలవుతాయి. పిల్లల పేరుపై ఖాతా తెరిచినప్పుడు.. వారి చేతే ఖాతాలో నగదు జమ చేయించడం, విత్‌డ్రా చేయించడం..వాటికి సంబంధించిన ఫారంలను దగ్గరే ఉండి పరిచయం చేయాలి. ఆ తర్వాత అవి పాస్‌ పుస్తకంలో ఏవిధంగా, ఎక్కడ ప్రతిబింబిస్తాయో తెలియజేయాలి.

చెక్‌బుక్‌:చె క్‌బుక్‌ చూపిస్తూ దాని ఫీచర్లను పిల్లలకు వివరించాలి. మీరు ఒక చెక్‌ ఇచ్చి దాన్ని బ్యాంకులో ఎలా డిపాజిట్‌ చేయాలో జారీ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేర్పించాలి.

ఏటీఎం కార్డు, నెట్‌బ్యాంకింగ్‌: కొన్ని బ్యాంకులు ఫోటో ఏటీఎం కార్డులను జారీ చేస్తుంటాయి. వాటిపై తల్లిదండ్రుల పేరును కూడా ముద్రిస్తాయి. ఇవి పిల్లల్ని ఆకర్షిస్తాయి. కార్డు గురించి తెలుసుకుని లావాదేవీలు చేసేలా చేస్తాయి. మీ పిల్లలకు ఏటీఎం కార్డు ఇచ్చేటప్పుడు.. కార్డును సురక్షితంగా ఎలా ఉపయోగించాలో చెప్పండి. కనీసం మూడు నుంచి నాలుగు సార్లైనా మీ సమక్షంలో లావాదేవీలు చేసేలా చూడండి. నెట్‌ బ్యాంకింగ్‌ విషయంలోనూ భద్రతా నియమాలు పాటించేలా చూడండి. 

పాకెట్‌ మనీ బ్యాంకు ఖాతాలో: తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే పాకెట్‌ మనీని వారి పేరుపై తెరిచిన బ్యాంకు ఖాతాలో వేయవచ్చు. ఇలా చేయడం వల్ల పిల్లలు తమ ఖర్చుల కోసం ఎప్పుడు ఎంత మొత్తం కావాలో అంతే తీసుకుంటారు. అనవసరమైన ఖర్చుల జోలికి పోకుండా ఉంటారు. ఇందుకోసం ప్రతినెలా నిర్దిష్ట మొత్తం పిల్లల ఖాతాకు జమ చేయమని బ్యాంకుకు సూచనలు ఇవ్వచ్చు. అలాగే, నెఫ్ట్‌ ద్వారా కూడా ట్రాన్స్‌ఫర్‌ చేసే వీలుంది. కాబట్టి వీటి గురించి కూడా పిల్లలకు బోధించవచ్చు.

భద్రత..

పిల్లల ఖాతాలో డబ్బు ఉంచినా, ఏటీఎం, నెట్‌ బ్యాంకింగ్‌ వంటి ఆప్షన్లను పిల్లలకు ఇచ్చినా డబ్బు దుర్వినియోగం అవుతుందని, పిల్లలు తప్పుదోవ పట్టే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పిల్లలకు బ్యాంకు ఖాతా ఇచ్చేందుకు తల్లిదండ్రులు భయపడతారు. కానీ, ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడొచ్చు. పిల్లల రోజువారీ, నెలవారీ, వార్షిక వినియోగంపై పరిమితులు విధించవచ్చు. అలాగే పిల్లలు ఎప్పుడు, ఎక్కడ ఎంత ఖర్చు చేస్తున్నారో ట్రాక్‌ చేయవచ్చు. ఖర్చుల గురించి ప్రతీ సమాచారం తల్లిదండ్రలకు చేరేలా ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌ను సెట్ చేసుకోవచ్చు.

నెలవారీ కనీస నగదు నిల్వ..

పిల్లలకు బ్యాంకు ఖాతా ఇచ్చినప్పుడు తల్లిదండ్రులు గమనించాల్సిన ముఖ్యమైన అంశం కనీస సగటు బ్యాలెన్స్‌ (MAB). ఇది అన్ని బ్యాంకు ఖాతాలకు ఒకేవిధంగా ఉండదు. బ్యాంకును బట్టి మారుతుంటుంది. ఒకవేళ మీ పిల్లల బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్సు లేకపోతే ఛార్జీలు వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీటిని నివారించేందుకు తల్లిదండ్రులు తగినంత బ్యాలెన్సు నిర్వహించాలి. 

చివరిగా..

పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పించాలనుకునే తల్లిదండ్రులకు బ్యాంకు ఖాతా చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడు ఖాతా అందించే సేవలు, పిల్లల సెక్యూరిటీ విషయంలో బ్యాంకు అందించే ఫీచర్లను తెలుసుకున్న తర్వాత మాత్రమే ఖాతాను తీసుకోవడం మంచిది.


మరిన్ని