
సంక్షిప్త వార్తలు
న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు ఎయిరిండియా విమానాలు
2023 ఫిబ్రవరి నుంచి
ముంబయి: టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి న్యూయార్క్, ప్యారిస్, ఫ్రాంక్‌ఫర్ట్‌కు ముంబయి నుంచి కొత్త విమాన సర్వీసులు నడపనుంది. దిల్లీ నుంచి కొపెన్హాగెన్, మిలన్, వియన్నాలకు నాన్-స్టాప్ సర్వీసులను పునః ప్రారంభించనున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ముంబయి - న్యూయార్క్ (జేకేఎఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్) రోజువారీ సర్వీసులు ఫిబ్రవరి 14న మొదలవుతాయని తెలిపింది. కొత్తగా లీజుకు తీసుకున్న విమానాలతో పాటు, ప్రస్తుత విమానాలు తిరిగి సేవల్లోకి రావడంతో ఎయిరిండియా తన సర్వీసుల సంఖ్యను పెంచుతూ వెళుతోంది.
పోర్చుగల్, స్విట్జర్లాండ్‌కు ఇండిగో కనెక్టింగ్ విమానాలు
పోర్చుగల్, స్విట్జర్లాండ్‌కు ఇస్తాంబుల్ మీదుగా విమాన సేవలను ఇండిగో ప్రారంభించింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో కోడ్‌షేర్ భాగస్వామ్యం ద్వారా ఈ కొత్త మార్గంలో నవంబరు 23 నుంచి సేవలను మొదలుపెట్టింది. ‘భారత్ నుంచి టర్కీ, స్విట్జర్లాండ్, పోర్చుగల్‌కు వెళ్లేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతున్నారు. ఇస్తాంబుల్ మీదుగా జెనీవా, లిస్బన్, పోర్టో, బాసెల్లకు 19 కనెక్టింగ్ విమానాలను నిర్వహిస్తామ’ని ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా పేర్కొన్నారు. తన తొలి అంతర్జాతీయ రవాణా విమానాన్ని కోల్‌కతా నుంచి యాంగాన్‌కు మంగళవారం(22న) కంపెనీ ప్రారంభించింది.
ఎఫ్డీ వడ్డీ రేట్లు పెంచిన ఉజ్జీవన్
ఈనాడు, హైదరాబాద్: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 20-80 బేసిస్ పాయింట్ల మేర పెంచినట్లు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వెల్లడించింది. 560 రోజుల డిపాజిట్‌పై ప్రస్తుత రేటు 7.20% కాగా, 8 శాతానికి పెంచినట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్లకు ఇది 8.75 శాతం అని తెలిపింది. 990 రోజుల వ్యవధికి 7.75 శాతం, ఏడాది నుంచి 559 రోజులకు 7.50 శాతం, 561-989 రోజులకు 7.50 శాతం, 991 రోజులు-60 నెలల వ్యవధికి 7.20 శాతం, 5-10 ఏళ్ల వ్యవధికి 6.50శాతం వడ్డీ ఇస్తున్నట్లు పేర్కొంది.
2023లో భారత్ వృద్ధి 5.9 శాతమే
అంచనాలు తగ్గించిన గోల్డ్‌మ్యాన్ శాక్స్
ముంబయి: 2023లో భారత వృద్ధి రేటు 5.9 శాతానికి పరిమితం కావొచ్చని వాల్ స్ట్రీట్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. ఈ ఏడాది (2022) వృద్ధి అంచనా 6.9 శాతం కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. గత రెండేళ్లుగా ఈక్విటీ మార్కెట్లలో కనిపిస్తున్న ర్యాలీ మాత్రం వచ్చే ఏడాదీ కొనసాగొచ్చని పేర్కొంది. 2023 డిసెంబరు నాటికి నిఫ్టీ 20,500 పాయింట్లకు చేరే అవకాశం ఉందని తెలిపింది. అంటే ప్రస్తుత స్థాయి నుంచి 12 శాతం పెరుగుతుందని అంచనా. ద్రవ్యోల్బణం 2023లో 6.1 శాతానికి దిగొస్తుందని పేర్కొంది. 2022లో ఇది 6.8 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. డిసెంబరు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 50 బేసిస్ పాయింట్ల మేర కీలక రేటును పెంచొచ్చని తెలిపింది. 2023 ఫిబ్రవరిలో మరో 35 బేసిస్ పాయింట్ల మేర పెంచే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి రెపో రేటు 6.75 శాతానికి చేరుతుందని గోల్డ్‌మ్యాన్ శాక్స్ అభిప్రాయపడింది.
శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లోకి శ్రీరామ్ కేపిటల్, సిటీ యూనియన్ ఫైనాన్స్
దిల్లీ: శ్రీరామ్ కేపిటల్, శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్‌లు త్వరలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్‌లో విలీనం అవుతాయని శ్రీరామ్ ఫైనాన్షియల్ వెంచర్స్ (ఎస్ఎఫ్వీపీఎల్) వెల్లడించింది. శ్రీరామ్ కేపిటల్‌కు హోల్డింగ్ కంపెనీగా ఉన్న ఎస్ఎఫ్వీపీఎల్.. ఇకపై గ్రూపు ఆర్థిక సేవలు, బీమా కార్యకలాపాలకు ప్రమోటరుగాను, హోల్డింగ్ కంపెనీగా వ్యవహరించనుంది. ఎస్ఎఫ్వీపీఎల్.. శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, దక్షిణాఫ్రికాకు చెందిన సన్లామ్ గ్రూపునకు సంయుక్త సంస్థ. శ్రీరామ్ గ్రూపునకు చెందిన ఇన్వెస్టీ కంపెనీల వృద్ధికి సహకారం అందిస్తామని, ఆర్థిక సేవల విభాగంలో కొత్త వ్యాపారావకాశాల పైనా దృష్టి పెడతామని ఎస్ఎఫ్వీపీఎల్ వివరించింది. ఈ విలీనం అనంతరం.. వాణిజ్య వాహన, ద్విచక్ర వాహన రుణాలు, పసిడి రుణాలు, వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలు, చిన్న వ్యాపార సంస్థల రుణాల విభాగాలన్నీ ఒకే గొడుకు కిందకు వస్తాయి.
2023-24 చివరికల్లా మూడో ప్లాంటు: ఏథర్
బెంగళూరు: విద్యుత్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023- 24) చివరికల్లా మూడో ప్లాంటును అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంలో ఉంది. ఈ ప్లాంటు ఎక్కడ నెలకొల్పాలనే విషయాన్ని త్వరలోనే ఖరారు చేయనున్నట్లు సంస్థ సహ- వ్యవస్థాపకుడు స్వప్నిల్ జైన్ తెలిపారు. ప్రస్తుతం రెండు ద్విచక్ర వాహన మోడళ్లు 405ఎక్స్, 450 ప్లస్‌ను ఏథర్ ఎనర్జీ విక్రయిస్తోంది. తమిళనాడులోని హోసూర్ ప్లాంటు ప్రస్తుత వార్షిక తయారీ సామర్థ్యం 4.2 లక్షల వాహనాలు. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా ఈ ప్లాంటు పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేస్తుందని కంపెనీ భావిస్తోంది. హోసూర్‌లోనే రెండో ప్లాంటును బుధవారం అధికారికంగా ప్రారంభించినప్పటికీ.. కార్యకలాపాలు అక్టోబరులోనే మొదలయ్యాయి.
మాన్స్టర్.కామ్ ఇక ఫౌండిట్.ఇన్
బెంగళూరు: ఉద్యోగ అన్వేషణ (జాబ్ సెర్చ్) పోర్టల్ మాన్స్టర్.కామ్ ఇకపై పూర్తి స్థాయి ప్రతిభా నిర్వహణ (టాలెంట్ మేనేజ్మెంట్) ప్లాట్‌ఫామ్‌గా మారబోతోందని, దీనికి ఫౌండిట్.ఇన్ పేరును ఎంపిక చేసుకున్నామని సంస్థ ప్రకటించింది. ఆసియా పసిఫిక్, మధ్య ప్రాచ్యంలో బుధవారం నుంచి కొత్త లోగో, విజన్‌తో పని చేస్తామని వెల్లడించింది. 18 దేశాల్లోని 10,000 మంది ఖాతాదార్లకు, 7 కోట్ల మందికి పైగా ఉద్యోగార్థుల (జాబ్ సీకర్స్)కు తాము సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ ఇప్పుడు పూర్తిస్థాయి టాలెంట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్‌గా రూపాంతరం చెందుతున్నందున.. రిక్రూటర్లకు సమగ్ర పరిష్కారాలను, ఆసియా పసిఫిక్, మధ్య ప్రాచ్యం అంతటా ఉద్యోగ అన్వేషకులకు వ్యక్తిగత , సందర్భోచిత సేవలను అందిస్తామని కొత్త బ్రాండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఫౌండిట్.ఇన్ సీఈఓ శేఖర్ గరిస వెల్లడించారు.
14 శాతం తగ్గిన ఎఫ్‌డీఐ పెట్టుబడులు
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- సెప్టెంబరు మధ్య భారత్‌లోకి వచ్చిన ఈక్విటీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 26.9 బిలియన్ డాలర్ల (దాదాపు 2.2 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో వచ్చిన పెట్టుబడులు 31.15 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇవి 14 శాతం తక్కువ అని డీపీఐఐటీ గణాంకాలు వెల్లడించాయి. మొత్తం ఎఫ్‌డీఐ పెట్టుబడులు 42.86 బిలియన్ డాలర్ల నుంచి 39 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
అగ్రగామి దేశాలు: మన దేశంలోకి వచ్చిన ఎఫ్డీఐలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. మారిషస్ (3.32 బి.డాలర్లు), యూఏఈ (2.95 బి.డాలర్లు), అమెరికా (2.6 బి.డాలర్లు), నెదర్లాండ్స్ 1.76 బి.డాలర్లు), జపాన్ (1.18 బి.డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
* కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాలు అత్యధిక పెట్టుబడులను (6.3 బి.డాలర్లు) ఆకర్షించగా.. సేవల రంగం (4.16 బి.డాలర్లు), ట్రేడింగ్ (3.28 బి.డాలర్లు), రసాయనాలు (1.3 బి.డాలర్లు), వాహన పరిశ్రమ (932 మి.డాలర్లు), నిర్మాణ కార్యకలాపాలు (990 మి.డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
మరిన్ని
Stellantis: ‘పాశ్చాత్య దేశాలతో చైనా కయ్యం.. భారత్‌కు ఓ గొప్ప అవకాశం’
Electric motorcycle: 307km రేంజ్‌తో ఎలక్ట్రిక్ బైక్.. ధర కొంచెం ఎక్కువే!
Amazon: భారత్‌లో అమెజాన్ కీలక నిర్ణయం.. ఆ ప్లాట్‌ఫాంను మూసివేస్తున్నట్లు ప్రకటన
Twitter: ఐఫోన్ తొలి హ్యాకర్‌కు ట్విటర్లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్!


తాజా వార్తలు (Latest News)
-
World News
Easter Attacks: ‘నన్ను క్షమించండి..’ శ్రీలంక మాజీ అధ్యక్షుడు సిరిసేన
-
India News
Khushbu Sundar: వీల్‌ఛైర్ కోసం 30 నిమిషాలా?.. ఎయిరిండియాపై ఖుష్బూ అసహనం
-
Sports News
PCB: మికీ ఆర్థర్ పాక్ ‘ఆన్లైన్ కోచ్’.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువ
-
Technology News
WhatsApp: వాట్సాప్ వీడియో.. ఈ మార్పు గమనించారా..?
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Politics News
AAP: కర్ణాటకపై ఆప్ గురి: అజెండాపై కసరత్తు.. పార్టీల హామీలపై కౌంటర్!