Stock Market: జీవితకాల గరిష్ఠానికి సెన్సెక్స్‌.. 18,500 చేరువకు నిఫ్టీ

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం భారీగా లాభపడ్డాయి. ఉదయం ఉత్సాహంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ముఖ్యంగా ఆఖరి అరగంటలో కొనుగోళ్ల మోత మోగింది. దీంతో వరుసగా సూచీలు మూడోరోజూ లాభాల్ని నమోదు చేశాయి. సెన్సెక్స్‌ జీవనకాల గరిష్ఠానికి చేరగా.. నిఫ్టీ 52వారాల గరిష్ఠాన్ని తాకింది.

బుధవారం వెలువడ్డ అమెరికా ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ వివరాలు అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం నింపాయి. వడ్డీరేట్ల పెంపు విషయంలో మెతకవైఖరి అవలంబించాలని మెజారిటీ ఫెడ్‌ సభ్యులు అభిప్రాయపడడంతో మార్కెట్లలో జోష్‌ కనిపించింది.

ఎఫ్‌ఓఎంసీ వార్తలతో గురువారం అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగియగా.. నేడు భారత్‌ సహా ఆసియా-పసిఫిక్‌ సూచీలన్నీ అదే బాటలో పయనించాయి.

బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర 85 డాలర్ల దిగువకు చేరడం కూడా సూచీల్లో ఉత్సాహం నింపింది.

ఈ పరిణామాల నేపథ్యంలో చివరకు సెన్సెక్స్‌ 762 పాయింట్ల లాభంతో రికార్డు ముగింపైన 62,272.68 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 216.85 పాయింట్లు లాభపడి 18,484.10 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 62,412.33 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. సెన్సెక్స్‌ 30 సూచీలో 26 షేర్లు లాభపడ్డాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌గ్రిడ్‌, విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం షేర్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు మాత్రమే నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.60 వద్ద నిలిచింది.

మార్కెట్‌లోని మరిన్ని విశేషాలు..

కీస్టోన్‌ రియల్టర్స్‌ షేరు ఇష్యూ ధర రూ.541తో పోలిస్తే మూడు శాతం లాభంతో రూ.555 వద్ద లిస్టయ్యింది. చివరకు 2.93 శాతం ఎగబాకి రూ.556.85 వద్ద స్థిరపడింది.

ఫినో పేమేంట్స్‌ బ్యాంక్‌ షేర్లు గత రెండు రోజుల్లో 36 శాతానికి పైగా లాభపడ్డాయి. క్యాప్రి గ్లోబల్‌ హోల్డింగ్స్‌ ఈ సంస్థలో అదనంగా మరో 1.58 శాతం వాటాలను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా కొనుగోలు చేసింది.

భారీ గిరాకీ నేపథ్యంలో బికజీ ఫుడ్స్‌ ఇంటర్నేషనల్‌ షేర్లు ఇంట్రాడేలో 10 శాతం లాభపడి రూ.379.20 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు