Twitter: ఐఫోన్‌ తొలి హ్యాకర్‌కు ట్విటర్‌లో కీలక బాధ్యతలు.. 12 వారాల్లో పని పూర్తిచేయాలన్న మస్క్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌లో నాలుగువేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత ఎలాన్‌ మస్క్‌కు కొత్త చిక్కులు మొదలయ్యాయి. వీటిని పరిష్కరించేందుకు ఆయన కొత్త వారిని నియమించుకుంటున్నారు. తాజాగా ట్విటర్‌ సెర్చ్‌లో తలెత్తిన సమస్యను సరిచేసేందుకు జార్జ్‌ హోట్జ్‌ అనే వ్యక్తిని నియమించినట్లు సమాచారం. 2007లో ఐఫోన్‌ హ్యాక్‌ చేసిన తొలి వ్యక్తిగా జార్జ్‌ హోట్జ్ పాపులర్‌ అయ్యాడు. తర్వాత ఆయన మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థలో పనిచేశారు. తాజాగా జార్జ్‌కు ట్విటర్‌ సెర్చ్‌ సమస్యను సరిచేసే బాధ్యతలను మస్క్‌ అప్పగించారట. ఆసక్తికర విషయం ఏంటంటే.. గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఇంజనీర్లు పరిష్కరించలేని  ఈ సమస్యను 12 వారాల్లో సరిచేయమని జార్జ్‌కు మస్క్‌ సూచించాడట. 

అంతకుముందు ట్విటర్‌లో 12 వారాల ఇంటర్న్‌షిప్‌కు సిద్ధంగా ఉన్నట్లు జార్జ్‌ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు ఉద్యోగం గురించి చర్చిద్దామని మస్క్‌ బదులిచ్చాడు. అందుకు జార్జ్‌.. ఉద్యోగం అవసరంలేదని, కేవలం 12 వారాల ఇంటర్న్‌షిప్‌లో రివర్స్‌ ఇంజనీరింగ్ సాయంతో వెయ్యి మైక్రోసర్వీసెస్‌ను సరిచేస్తానని ట్వీట్ చేశాడు. దీనివల్ల ట్విటర్‌ సెర్చ్ సమస్య పరిష్కారమవుతుందని జార్జ్‌ తెలిపాడు. ఇందులో భాగంగా ట్విటర్‌ సెర్చ్‌ ఎలా ఉందో చెప్పాలని జార్జ్ యూజర్లను కోరాడు. ట్విటర్‌ సెర్చ్‌లో తమకు కావాల్సిన సమాచారం దొరకడం లేదని పలువురు నెటిజన్లు జార్జ్‌కు బదులిచ్చారు. 

ట్విటర్‌లో ఇప్పటివరకు సుమారు నాలుగు వేలమందిని మస్క్‌ తొలగించారు. అంతేకాకుండా కంపెనీ కష్టాల్లో ఉందని, ప్రస్తుతం సంస్థలో ఉన్నవారు 12 గంటలు కష్టపడి పనిచేస్తామని హామీ ఇవ్వాలని మస్క్‌ కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. మస్క్‌ తీరుతో విసుగెత్తి మరికొంతమంది ఉద్యోగులు కంపెనీని వీడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్విటర్‌కు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ కొరత ఏర్పడింది. దీంతో పలువురు యూజర్లు ట్విటర్‌ ఇక పనిచేయదని ట్వీట్లు చేశారు. మరోవైపు, మస్క్‌ ట్విటర్‌లో సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతిక, సేల్స్‌ విభాగాల్లో కొత్త నియామకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. 


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని