వ్యాపారిపై కాల్పులు

మునుగోడు మండలంలో ఘటన

మునుగోడు, న్యూస్‌టుడే: ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ వ్యాపారిపై దుండగులు బైక్‌పై వెంబడించి మూడు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది.  ఎస్సై సతీష్‌రెడ్డి, స్థానికుల వివరాల ప్రకారం.. నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి (32) మునుగోడులోని ఓ దుకాణాన్ని కిరాయికి తీసుకోని కూల్‌డ్రింక్స్‌, నీళ్ల బాటిళ్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. దీంతో పాటు స్థిరాస్తి వ్యాపారం చేస్తూ బ్రాహ్మణవెల్లంలలో ఉంటున్నారు. రోజూలాగే గురువారం దుకాణం మూసేసి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి పిస్తోలుతో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. కాల్పుల శబ్దాన్ని సమీపంలో ఉన్న స్వామి అనే వ్యక్తి విని  పోలీసులకు సమాచారం అందించారు.అపస్మారక స్థితిలోకి వెళ్లిన లింగస్వామిని పోలీసులు నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్‌ పడి ఉంది.


మరిన్ని

ap-districts
ts-districts