Casino: నేతలతో చీకోటి చాటింగ్స్‌

ముగ్గురు ఎమ్మెల్యేలతో వాట్సప్‌ సంభాషణలపై ఈడీ దర్యాప్తు

కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతోనూ..

మనీలాండరింగ్‌ సంబంధాల అనుమానంతో ఆరా

ఈనాడు, హైదరాబాద్‌: విదేశీ క్యాసినోల వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి రాజకీయ కోణం సంతరించుకుంటోంది. నేపాల్‌, శ్రీలంక, థాయ్‌లాండ్‌, మలేసియా తదితర దేశాల్లో క్యాసినోల నిర్వహణలో ఆరితేరిన చీకోటి ప్రవీణ్‌తో.. పలువురు ఎమ్మెల్యేల వాట్సప్‌ సంభాషణలను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) గుర్తించినట్టు సమాచారం. విదేశీ క్యాసినోలలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో మనీలాండరింగ్‌ జరిగిందనే కోణంలో కొద్దిరోజులుగా ఈడీ ఆరా తీస్తున్న సంగతి తెలిసిందే. గత నెలాఖరున ప్రవీణ్‌తోపాటు మరో ఏజెంట్‌ దాసరి మాధవరెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ బృందాలు పలు సాంకేతిక ఆధారాల్ని స్వాధీనం చేసుకున్నాయి. సెల్‌ఫోన్లతోపాటు ల్యాప్‌టాప్‌లు జప్తుచేసి వాటిని విశ్లేషించడంలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రవీణ్‌తో తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సాగించిన వాట్సప్‌ సంభాషణల్ని ఈడీ గుర్తించింది. వీటి సారాంశాన్ని లోతుగా విశ్లేషిస్తోంది. వీరేమైనా ప్రవీణ్‌తో ఆర్థిక లావాదేవీలు నిర్వహించారా? వాటి ద్వారా మనీలాండరింగ్‌ జరిగిందా? అని తేల్చే పనిలో నిమగ్నమైంది.

తొలగించిన సమాచారం రాబట్టే యత్నం
వాస్తవానికి ప్రవీణ్‌ గతంలో నిర్వహించిన వేడుకలకు పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. క్యాసినో వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ఆరంభమైన తర్వాత ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో తాజాగా వాట్సప్‌ చాటింగ్‌ల అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రవీణ్‌, మాధవరెడ్డి సెల్‌ఫోన్లను ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో శాస్త్రీయంగా విశ్లేషించడం ద్వారా తొలగించిన సంభాషణలేమైనా ఉంటే రాబట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోంది. ఆ ప్రయత్నం కొలిక్కి వస్తే కీలక సమాచారం బహిర్గతమయ్యే అవకాశముందని, అప్పుడే మనీలాండరింగ్‌ అంశంపై స్పష్టత వస్తుందని ఈడీ వర్గాల సమాచారం.

క్యాసినో నా వ్యాపారం: చీకోటి ప్రవీణ్‌
ఈడీ కార్యాలయంలో శుక్రవారం విచారణ ముగిసిన అనంతరం చీకోటి ప్రవీణ్‌ మీడియాతో మాట్లాడాడు. ‘క్యాసినో నిర్వహణ నా వ్యాపారం. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. సహజంగానే సినీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాలున్నాయి. అందులో తప్పేముంది. అంతమాత్రాన వారితో లావాదేవీలు అంటగట్టడం సరికాదు’ అని తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున దాని గురించి ఏమీ మాట్లాడనన్నారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ వేసినట్టు చెప్పారు. తనపై దుష్ప్రచారం చేసేవారిని వదలనన్నారు.

ఎమ్మెల్యేలకు నోటీసులంటూ ప్రచారం
క్యాసినో వ్యవహారంలో ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు జారీ చేసిందంటూ శుక్రవారం మీడియాలో ప్రచారం జరిగింది. దీనికితోడు క్యాసినోల్లో ఓ మంత్రి కుటుంబ సభ్యులతోపాటు సినీతారలు జూదం ఆడారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయమై ఈడీ ఉన్నతాధికారులను ‘ఈనాడు’ సంప్రదించగా, తామెవరికీ నోటీసులు ఇవ్వలేదని స్పష్టంచేశారు.


మరిన్ని

ap-districts
ts-districts