నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన ఉపాధ్యాయిని

విజయవాడ, న్యూస్‌టుడే: నాలుగేళ్ల వయసున్న చిన్నారిని వాతలు తేలేలా చితకబాదిందో ఉపాధ్యాయిని. వీపుపై వాతలు తేలేలా కొట్టారేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తే పట్టించుకోలేదు. పాఠశాల యాజమాన్యం కూడా ఉపాధ్యాయినికే వత్తాసు పలకడంతో.. బాధిత తల్లిదండ్రులు నున్న పోలీసులను ఆశ్రయించారు. రాజీవ్‌నగర్‌ ఉడాకాలనీకి చెందిన అమిదేరపు శ్రీలక్ష్మి, శ్రీనివాసరావు దంపతుల కుమార్తె విదితా ఆరాధ్య (4) రాజీవ్‌నగర్‌లోని ఓ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతోంది. ఈ నెల 2న ఆరాధ్య బడిలో మంచినీళ్లడగటంతో ఉపాధ్యాయిని అనురాధ ఇష్టం వచ్చినట్లు కొట్టిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. చెక్కస్కేల్‌తో వీపుపై కొట్టడంతో వాతలు తేలాయని, ఘటనపై టీచర్‌ను, పాఠశాల యాజమాన్యాన్ని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ బాధితురాలి తల్లి శ్రీలక్ష్మి పోలీసులకు తెలిపారు. మీకు చేతనైంది చేసుకోండని, అసలు ఆ దెబ్బలు తమ పాఠశాలలో కొట్టలేదని యాజమాన్యం బుకాయిస్తోందని, దెబ్బల కారణంగా చిన్నారి జ్వరంతో బాధపడుతోందని ఫిర్యాదు చేశారు. దీంతో ఉపాధ్యాయురాలితోపాటు యాజమాన్యంపై 324, 506 సెక్షన్లతో పాటుగా జువెనైల్‌ జస్టిస్‌ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts