మొహిసిన్‌ ఉదంతంపై తెలంగాణ పోలీసుల ఆరా!

ఈనాడు, హైదరాబాద్‌: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ తరఫున దేశవ్యాప్తంగా నిధులు సేకరిస్తున్నాడన్న ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఎ) దిల్లీలో అరెస్టు చేసిన మొహిసిన్‌ అహ్మద్‌ వ్యవహారంపై తెలంగాణ నిఘా విభాగం దృష్టి సారించింది. బిహార్‌ రాజధాని పట్నాకు చెందిన మొహిసిన్‌ ప్రస్తుతం దిల్లీలోని బాట్లాహౌస్‌ వద్ద ఉంటున్నాడు. ఆదివారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్‌.ఐ.ఎ. అధికారులు అనంతరం అరెస్టు చేసి దిల్లీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దర్యాప్తులో భాగంగా మొహిసిన్‌ నుంచి కొన్ని నిజాలు రాబట్టాలని, అనేక రాష్ట్రాల్లో ఉన్న ఐసిస్‌ సానుభూతిపరుల నుంచి నిధులు సేకరించి సిరియాకు పంపుతున్నట్లు తమకు సమాచారం ఉందని, నిందితుడ్ని ఆయా రాష్ట్రాలకు తీసుకెళ్లి ఆధారాలు సేకరించాలని ఎన్‌.ఐ.ఎ అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. దాంతో తెలంగాణ నిఘా విభాగం అప్రమత్తమైంది. తెలంగాణలోనూ గతంలో అనేక మంది ఐసిస్‌ సానుభూతిపరులను ఎన్‌.ఐ.ఎ. అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని మాల్స్‌తోపాటు రద్దీ ప్రాంతాల్లో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించాలన్న కుట్రలను భగ్నం చేసింది. సిరియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న యువకులనూ అరెస్టు చేశారు. దాంతో మొహసిన్‌కు ఇక్కడ ఎవరితో అయినా సంబంధాలు ఉన్నాయేమోనని తెలుసుకునేందుకు తెలంగాణ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా దిల్లీ ఎన్‌.ఐ.ఎ అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని