తహసీల్దార్‌ సజీవ దహన ఘటనలో గాయపడ్డ రైతు మృతి

ఇప్పటికీ నారాయణగౌడ్‌కు దక్కని పాసుపుస్తకం

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: గతంలో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనం ఘటనలో గాయపడిన రైతు బొడిగె నారాయణగౌడ్‌(73).. పాసుపుస్తకాలు అందుకోకుండానే అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. 2019 నవంబరు 4న విధుల్లో ఉన్న అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిపై మండలంలోని గౌరెల్లి గ్రామానికి చెందిన సురేష్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించగా..ఆ ఘటనలో మంటలంటుకొని సురేష్‌, విజయారెడ్డిని కాపాడే క్రమంలో డ్రైవర్‌ గురునాథం, అటెండర్‌ చంద్రయ్య, పాసుపుస్తకాల కోసం వెళ్లిన రైతు నారాయణగౌడ్‌లు గాయపడ్డారు. విజయారెడ్డి ఘటనా సలంలోనే సజీవ దహనమైన విషయం తెలిసిందే. గాయపడిన నిందితుడు సురేష్‌, అటెండర్‌ చంద్రయ్య, డ్రైవర్‌ గురునాథంలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. రైతు నారాయణగౌడ్‌ మాత్రం కోలుకున్నారు.అయితే తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవ దహనమై ఏడాది గడిచినా తన సమస్య పరిష్కారం కాలేదని.. కాలిన గాయాలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా.. పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని 2020 నవంబరు 3న నారాయణగౌడ్‌.. తహసీల్దార్‌ కార్యాలయం ముందు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు చేశారు. దాంతో అప్పట్లో ప్రభుత్వం స్పందించి విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. నారాయణగౌడ్‌.. మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. పట్టాదారు పాసుపుస్తకాలకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకొని అనారోగ్యం బారిన పడినా.. ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆయన కుటుంబ సభ్యులు వాపోయారు.


మరిన్ని

ap-districts
ts-districts