ప్రియుడి కోసమా..? ‘ఉగ్రదాడి’ కోణమా?

సరిహద్దుల్లో చిక్కిన పాకిస్థాన్‌ యువతి కేసులో దర్యాప్తు

ఆరా కోసం హైదరాబాద్‌కు బృందాలు!

ఈనాడు, హైదరాబాద్‌: నేపాల్‌-బిహార్‌ సరిహద్దుల గుండా అక్రమంగా చొరబడుతూ పట్టుబడిన పాకిస్థాన్‌ యువతి ఖదీజా నూర్‌ ఉదంతంలో దర్యాప్తు బృందాలు హైదరాబాద్‌కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌కు చెందిన ఆమె నేపాల్‌కు చెందిన యువకుడితోపాటు హైదరాబాద్‌కు చెందిన మరో వ్యక్తితో కలిసి వస్తూ సోమవారం శసస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) బలగాలకు చిక్కారు. యువతి వద్ద లభించిన నకిలీ ఆధార్‌ కార్డులో ఆమె పేరు అఫ్రోజ్‌ అని, టీకా సర్టిఫికెట్‌లో ఖదీజా నూర్‌ అని ఉంది. పోలీసులు ఈ కార్డులతోపాటు పాకిస్థాన్‌ పాస్‌పోర్టును కూడా ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీరు పాకిస్థాన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా నేపాల్‌ చేరుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆన్‌లైన్‌లో పరిచయమైన హైదరాబాదీని ప్రేమించిన ఆమె.. తన ప్రియుడి కోసమే హైదరాబాద్‌కు వచ్చే ప్రయత్నంలో ఎస్‌ఎస్‌బీ బలగాలకు చిక్కినట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి దుబాయ్‌లో ఉండటం, ఆమె సెప్టెంబరు 4న పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లేలా వీసాలో పేర్కొనడంతో దర్యాప్తు బృందాలు అప్రమత్తమయ్యాయి. మరోవైపు.. భారత్‌లో ఆజాదీ కా అమృత మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆమె చొరబాటుకు ప్రయత్నించడం వెనక ఉగ్రవాద దాడి కోణం ఏమైనా ఉందా..? అని దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. ఈక్రమంలోనే బృందాలు హైదరాబాద్‌కు వచ్చి విచారించే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని హైదరాబాద్‌ పోలీసులు ధ్రువీకరించలేదు.


మరిన్ని

ap-districts
ts-districts