కోడలి తల నరికిన చిన్నత్త

దాంతోనే నేరుగా పోలీసు స్టేషన్‌కు

రాయచోటి, న్యూస్‌టుడే: కోడలిపై అనుమానం పెంచుకున్న చిన్నత్త ఆమె తలను నరికి, దాన్ని తీసుకొని నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో గురువారం చోటు చేసుకొంది. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని మంగళపల్లెకు చెందిన వసుంధర(35)కు దేవపట్లకు చెందిన రాజాతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వీరు పదేళ్ల కిందట రాయచోటిలోని కె.రామాపురానికి వచ్చి స్థిరపడ్డారు. రాజా ఏడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అప్పటి నుంచి వసుంధర తనకు చిన్నత్త అయిన సుబ్బమ్మ(రాజా చిన్నమ్మ)ను చేరదీసి తనతోపాటే ఉంచుకుంది. వసుంధర ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని సుబ్బమ్మ అనుమానం పెంచుకుంది. పైగా సుబ్బమ్మ పేరుపై ఉన్న ఇంటిని రాసివ్వాలని వసుంధర పట్టుపడుతూ ఉండేది. ఈ క్రమంలో సుబ్బమ్మ తన అన్న కుమారుడు చంద్రబాబుతో కలిసి ఆమెను అంతమొందించేందుకు పథకం పన్నింది. గురువారం వసుంధరను భోజనానికి పిలిచి, రాగానే మరికొంత మందితో కలిసి దాడి చేసి ఆమె గొంతు కోశారు. ఆ తర్వాత తలతో పోలీస్‌స్టేషన్‌ వద్దకు వెళ్లి హల్‌చల్‌ చేసి, మళ్లీ వెనక్కి వచ్చి మృతదేహం వద్దే తలను పెట్టినట్లు సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. నిందితురాలిని, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని