ప్రగతిభవన్‌ వద్ద ఉద్యమకారుడి ఆత్మహత్యాయత్నం

పంజాగుట్ట, న్యూస్‌టుడే: తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొని రెండు కాళ్లు, ఒక చేయి పోగొట్టుకున్నా.. ప్రభుత్వం సాయం అందించలేదనే మనస్తాపంతో ఓ ఉద్యమకారుడు హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సూర్యాపేట మండలం రాయినిగూడెం గ్రామానికి చెందిన పిడమర్తి నాగరాజు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రికి తన సమస్యను వివరించడానికి ప్రగతిభవన్‌కు వచ్చారు. లోపలికి వెళ్లేందుకు భద్రతా సిబ్బంది అనుమతించలేదు. దీంతో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. అంతకుముందు ప్రగతిభవన్‌ వద్ద నాగరాజు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2011లో మిర్యాలగూడలో జరిగిన రైల్‌రోకోలో పాల్గొన్న తాను తీవ్రంగా గాయపడటంతోపాటు రెండు కాళ్లు, ఒక చేయి కోల్పోయానని తెలిపారు. ఫలితంగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అయినా ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదని వాపోయారు.


మరిన్ని

ap-districts
ts-districts