కారుతో బ్యారికేడ్‌ను ఢీకొట్టి..

అనంతరం కాల్చుకుని మరణించిన వ్యక్తి

అమెరికా క్యాపిటల్‌ హిల్‌ వద్ద ఘటన

వాషింగ్టన్‌: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌  వద్ద ఆదివారం వేకువ జామున నాలుగు గంటల సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. కారులో వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి అక్కడి బ్యారికేడ్‌ను ఢీకొట్టాడు. అనంతరం గాల్లోకి కాల్పులు జరుపుతూ.. చివరకు తనను తాను కాల్చుకుని మరణించాడు. మాజీ అధ్యక్షుడు ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడా ఎస్టేట్‌ మార్‌ ఎ లాగోలో ఎఫ్‌బీఐ తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వాధికారులకు బెదిరింపులు వస్తున్నాయి. ప్రభుత్వ భవనాలపై దాడులు జరిగే అవకాశముందని ఫెడరల్‌ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకుంది. క్యాపిటల్‌ వద్ద బ్యారికేడ్‌ను ఢీకొట్టిన అనంతరం వాహనంలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత బయటకు వచ్చిన వ్యక్తి గాల్లోకి కాల్పులు జరపడం ప్రారంభించాడని అధికారులు తెలిపారు. పోలీసులు తనకు దగ్గరగా రావడాన్ని గమనించి తనను కాల్చుకుని మరణించాడని వివరించారు. అతని వ్యక్తిగత వివరాలను మాత్రం వెల్లడించలేదు. ‘‘మరణించిన వ్యక్తి కాంగ్రెస్‌ సభ్యులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించడం లేదు. అతని వెనకున్నది ఎవరు? లక్ష్యం ఏమిటి? తదితర వివరాలను కనిపెట్టేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు’’ అని పోలీసులు తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts