తెలంగాణ పోలీసులపై బిహార్‌లో కాల్పులు!

నవాదా జిల్లాలో సైబర్‌ నేరస్థుల బరితెగింపు

నలుగురు నిందితుల అరెస్ట్‌

రూ1.23కోట్ల నగదు, ఖరీదైన కార్లు స్వాధీనం

ఈనాడు, హైదరాబాద్‌: తమను పట్టుకునేందుకు బిహార్‌కు వచ్చిన తెలంగాణ పోలీసులపై సైబర్‌ నేరస్థులు కాల్పులకు తెగబడ్డారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బిహార్‌ రాష్ట్రం నవాదా జిల్లాలోని పలు గ్రామాల్లో యువకులు సైబర్‌ మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ ధరకే ద్విచక్రవాహనాలు/కార్లు విక్రయిస్తామని, డీలర్‌షిప్‌ ఇప్పిస్తామని బురిడీ కొట్టిస్తూ ఏపీ, తెలంగాణాల్లో వందల మందిని మోసగించారు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ సైబర్‌క్రైమ్‌ పోలీసులు, నవాదా జిల్లా పోలీసులు సంయుక్తంగా సిద్ధమయ్యారు. వారిని అరెస్ట్‌ చేసేందుకు వాహనాల్లో శుక్రవారం అర్ధరాత్రి భవానీబిఘా గ్రామానికి చేరారు. శనివారం తెల్లవారుజామున నిందితులను గుర్తించి పట్టుకునేందుకు సిద్ధమయ్యారు. అది గమనించిన ప్రధాన నిందితుడు మిథిలేశ్‌ ప్రసాద్‌ పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకొని పారిపోయాడు. అనంతరం పోలీసులు భూతలిరామ్‌, మహేష్‌కుమార్‌, సురేంద్రమహతో, జితేంద్రకుమార్‌లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1.23కోట్ల నగదు, రెండు కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి తండ్రి సురేంద్రమహతో ఇంట్లో ఖరీదైన వాహనాలున్నట్టు గుర్తించారు. నిందితులు ఏపీ, తెలంగాణలతో పాటు పట్నా, కోల్‌కతా తదితర నగరాల్లోని పలువురిని వాహన డీలర్‌షిప్‌ పేరుతో మోసగించినట్టు నవాదా జిల్లా ఎస్పీ గౌరవ్‌మంగ్లా మీడియాకు తెలిపారు.

కియా డీలర్‌షిప్‌ పేరిట రూ.28.58లక్షల స్వాహా!
హైదరాబాద్‌ కూకట్‌పల్లి సమీప నిజాంపేట్‌కు చెందిన ఓ వ్యాపారి(40) కియా కార్ల డీలర్‌షిప్‌ కోసం అంతర్జాలంలో అన్వేషించాడు. ‘కియా ఇండియా డీలర్‌షిప్‌.ఇన్‌’ వెబ్‌సైట్‌లోని ఈ-మెయిల్‌కు మే నెలలో నిజామాబాద్‌ జిల్లా డీలర్‌షిప్‌ కావాలంటూ వివరాలు పంపాడు. మే 24న ఆ వ్యాపారికి రాధికా మిశ్ర అనే మహిళ ఫోన్‌ చేసింది. డీలర్‌షిప్‌ దరఖాస్తు పంపాల్సిన మెయిల్‌ ఐడీ వివరాలు చెప్పింది. జూన్‌ 2న ఆయన అలాగే చేశాడు. జూన్‌ 4న దరఖాస్తును ఆమోదిస్తున్నట్టు, నిజామాబాద్‌ జిల్లా డీలర్‌షిప్‌ కేటాయించినట్టు లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌(ఎల్‌ఓఐ) పంపారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.2.65 లక్షలు చెల్లించాలంటూ బ్యాంకు ఖాతా వివరాలు పంపగా.. జులై 7న బాధితుడు ఆ మొత్తం ఖాతాలో వేశాడు. దఫదఫాలుగా సైబర్‌ మాయగాళ్లు ఇలా రూ.28,58,500 కాజేశారు. ఇంకా డబ్బు పంపమంటూ డిమాండ్‌ చేయటంతో బాధితుడు అనుమానించాడు. ఓ బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించటంతో అవన్నీ నకిలీ ఖాతాలని తేలింది. కియా సంస్థ కస్టమర్‌కేర్‌కు ఫోన్‌చేసి తాను దరఖాస్తు చేసింది నకిలీ వెబ్‌సైట్‌గా నిర్ధారించుకున్నాడు. గతనెల 16న సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు నిందితులను పట్టుకునేందుకు నవాదా జిల్లాకు వెళ్లారు. ఆ క్రమంలో నేరస్థులు తుపాకీతో కాల్పులు జరిపారని, పోలీసులెవరూ గాయపడలేదని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సైబర్‌ మాయగాళ్లు  దేశవాళీ తుపాకులు, తపంచాలను వాడినట్టు పోలీసులు గుర్తించారు.

ఆ గ్రామంపై తరచూ దాడులు
భవానీబిఘా గ్రామం సైబర్‌ నేరగాళ్లకు పుట్టిల్లు. 2020లో ఓ కేసు వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి ఇద్దరు నిందితుల నుంచి రూ.30లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం మహారాష్ట్ర పోలీసులు ఓ సైబర్‌ నేరస్థుడిని అదుపులోకి తీసుకుని రూ.56లక్షల నగదు పట్టుకున్నారు.


మరిన్ని

ap-districts
ts-districts