ఆడుకుంటూ.. మృత్యు కాసారంలోకి!

కుంటలో మునిగి నలుగురు పిల్లల దుర్మరణం

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు

రంగారెడ్డి జిల్లా గొల్లగూడలో ఘటన..

ఇబ్రహీంపట్నం, యాచారం, న్యూస్‌టుడే: అప్పటివరకు తల్లిదండ్రుల ముందు ఆడుతూపాడుతూ గడిపిన ఆ చిన్నారులు అకస్మాత్తుగా విగత జీవులయ్యారు. ఈత కొట్టాలన్న సరదా నలుగురు పిల్లల ప్రాణాలను బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గొల్లగూడ గ్రామంలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కుటుంబ సభ్యులు, యాచారం ఇన్‌స్పెక్టర్‌ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం..
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి పంచాయతీ గొల్లగూడకు చెందిన మహ్మద్‌ ఖాసీం, సయ్యద్‌ రజాక్‌ అన్నాదమ్ములు. ఫర్జానా వారి చెల్లెలు. వీరంతా స్థానికంగా కూలి పనులు, డ్రైవింగ్‌ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఆదివారం కావడంతో వీరంతా కుటుంబ సమేతంగా సమీపంలోని దర్గాకు వెళ్లారు. అక్కడ రెండు గంటలకుపైగా గడిపిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కాలినడకన ఇంటికి పయనమయ్యారు. వారి పిల్లలు ఎండీ సమ్రీన్‌(14), ఎండీ ఖలీద్‌(12), ఎండీ రేహాన్‌(10), షేక్‌ ఇమ్రాన్‌(9) పరుగెత్తుతూ తల్లిదండ్రుల కంటే ముందు వెళ్లారు. దారి పక్కన ఎర్రకుంట కనిపించడంతో అందులో దిగారు. వారు దిగిన దగ్గర లోతు తక్కువగా ఉండడంతో అక్కడ కొంతసేపు ఆడుకున్నారు. సారవంతమైన మట్టి కోసం ఇటీవల కొందరు జేసీబీలతో కుంటలో లోతుగా తవ్వారు. ఇది తెలియని చిన్నారులు ముందుకెళ్లి ఒక్కసారిగా మునిగిపోయారు. తొలుత సమీపంలోని పశువుల కాపరులు గమనించినా.. ఈత వచ్చేమోనని పట్టించుకోలేదు. కానీ వీరెవరికీ ఈత రాదు. లోపలికి వెళ్లిన పిల్లలు ఎంతసేపయినా బయటికి రాకపోవడంతో అక్కడే ఉన్న రైతు అనమోని కృష్ణయ్య, ఇతర పశువుల కాపరులు దర్గానుంచి వస్తున్న తల్లిదండ్రులకు చెప్పారు. కుంటలోకి దిగి చూడగా.. అప్పటికే నలుగురు చిన్నారులు మృతి చెందారు. అంతా కలిసి మృతదేహాలను బయటకు తీశారు. తమ పిల్లలందరూ ఒకేసారి మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల్లో సమ్రీన్‌ కుర్మిద్దలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, ఖలీద్‌ యాచారంలోని పుడమి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. రేహాన్‌ ఇబ్రహీంపట్నంలోని పాఠశాలలో ఐదో తరగతి, ఇమ్రాన్‌ తాటిపర్తిలో నాలుగో తరగతి చదువుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని