మదుపుదార్లను మోసగించిన కేసులో... ఆర్థిక సలహాదారు అరెస్టు

ఈనాడు,హైదరాబాద్‌: గ్లోబల్‌ డిపాజిటరీ రిసీట్‌ (జీడీఆర్‌) ద్వారా వాటాదారులను మోసం చేసిన కేసులో సంజయ్‌ రఘునాథ్‌ అగర్వాల్‌ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఈమేరకు ఈడీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆయన ఈ జీడీఆర్‌లను తనఖాపెట్టి యూరప్‌ బ్యాంకు నుంచి రుణం తీసుకోవడమే కాకుండా దేశంలోని మదుపుదారులకు అమ్మి వారిని కూడా మోసం చేసినట్లు ఈడీ వెల్లడించింది. విదేశీ మదుపుదారుల కోసం ఏదైనా సంస్థ జీడీఆర్‌లను జారీ చేయవచ్చు. ఇలానే ఫార్‌మాక్స్‌ ఇండియా లిమిటెడ్‌ అనే సంస్థ కూడా 2010లో జీడీఆర్‌లు జారీ చేసింది. దీనికి లా రిచ్‌నెస్‌ ఎడ్వయిజర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన సంజయ్‌ రఘునాథ్‌ అగర్వాల్‌ ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు. ఈ మొత్తం జీడీఆర్‌లను అరుణ్‌ పంచరియాకు చెందిన వింటే ఎఫ్‌జడ్‌ఈ అనే సంస్థ కొనుగోలు చేసింది. అనంతరం వీటిని ఐరోపాకు చెందిన యూరమ్‌ బ్యాంకులో తనఖా పెట్టి రూ.318 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత మోసపూరిత పద్ధతుల్లో ఇవే జీడీఆర్‌లను భారతదేశంలోని మదుపుదారులకు అమ్మి రూ.54 కోట్లు సేకరించారు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో యూరమ్‌ బ్యాంకు తనకు తనఖాపెట్టిన జీడీఆర్‌లను వేలం వేసుకుంది. లేని జీడీఆర్‌లను భారతీయ మదుపుదారులకు అమ్మి మోసానికి పాల్పడ్డ నేరంపై ఫార్‌మాక్స్‌కు సలహాదారుగా వ్యవహరించిన సంజయ్‌ అగర్వాల్‌ను హైదరాబాద్‌ ఈడీ అధికారులు అరెస్టు చేసి సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండు విధించింది.


మరిన్ని

ap-districts
ts-districts