బొడ్డు కోయబోయి.. బిడ్డ వేలు కోశారు!

మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో దారుణం

మాచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: బొడ్డు కోయబోయి బిడ్డ వేలు కోసేసిన ఘటన పల్నాడు జిల్లా మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ఆలస్యంగా వెలుగు చూసింది. స్వరూప అనే మహిళ గత నెల 30న ఈ ఆసుపత్రిలో తొలి కాన్పు కోసం చేరి బాబుకు జన్మనిచ్చింది. ఆమె స్పృహలోకి రాక ముందే బొడ్డు తాడు కోసే క్రమంలో సిబ్బంది పసికందు కుడి చేతి చిటికెన వేలు కోసేశారు. వెంటనే గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన అనంతరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాబు వేలు చివర్లోతెగిందని, శస్త్రచికిత్స చేసి అతికిస్తామని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ విషయం బయటకురాకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారు. దీనిపై వైద్య విధాన పరిషత్‌ పల్నాడు జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బీవీ రంగారావును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా విషయం తమ దృష్టికి వచ్చిందని.. ఈ ఘటనకు కారకురాలైన పారిశుద్ధ్య కార్మికురాలిని విధుల నుంచి తొలగించామని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరుపుతామని చెప్పారు. అయితే వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సిన కాన్పులో పారిశుద్ధ్య కార్మికురాలు బొడ్డుతాడు కోయడమేంటనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. విచారణ తర్వాత నిజానిజాలు తేలే అవకాశం ఉంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని