లక్ష కడితే 10 నెలల్లో రూ.3 లక్షలిస్తాం

బెజవాడలో ఘరానా గొలుసుకట్టు మోసం
సంకల్ప సిద్ధి మనీ స్కీమ్‌ల పేరిట రూ.కోట్లలో వసూళ్లు
ఏపీ, తెలంగాణల్లో 15 వేల మంది బాధితులు

న్యూస్‌టుడే, విజయవాడ నేరవార్తలు: ‘మార్కెటింగ్‌ చేయాల్సిన పని లేదు.. ఇంటింటికీ తిరిగి అమ్మాల్సిన అవసరం లేదు. పార్ట్‌టైమ్‌గా పనిచేసినా రూ.లక్షలు సంపాదించవచ్చు’ అంటూ తెగ ప్రచారం చేసింది సంకల్ప సిద్ధి ఈ-కార్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌. లక్ష కడితే 10 నెలల్లో రూ.3 లక్షలిస్తాం.. మీరు పెట్టిన డబ్బుకు మూడింతలు చేసిస్తామని ఆశలు కల్పించింది. ఇది నమ్మి డబ్బులు పెట్టినవారందరికీ నెత్తిన టోపీ పెట్టింది. విజయవాడ నగరంలో ‘సంకల్ప్‌ సిద్ధి మార్ట్‌’ పేరిట అనుమతులు లేకుండా పలు రకాల స్కీములు నిర్వహిస్తూ ప్రజలను మోసగిస్తున్నారన్న ఫిర్యాదుతో నగర పోలీసులు రంగంలోకి దిగి ఈ మోసాన్ని బయట పెట్టారు. స్కీములతో పాటు మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో దాదాపు 15 వేల మంది సభ్యులను చేర్చుకుని, రూ.కోట్లలో నగదు సేకరించి మోసం చేస్తున్నట్లు గుర్తించారు. ఒకరు మరొకరిని, వారు ఇంకొకర్ని ఇలా గొలుసుకట్టుగా చేర్పిస్తే కమీషన్లు ఇచ్చేవారు. సంస్థ యాప్‌ ద్వారానూ చాలా మందిని చేర్పించారు. కొందరికి కొంత మొత్తం చెల్లించాక ముఖం చాటేశారు. సంకల్ప్‌ సిద్ధి మార్ట్‌కు ఏపీ, తెలంగాణలోనూ శాఖలున్నాయి. బెంగళూరుకు చెందిన అన్నదమ్ములు వేణుగోపాల్‌, కిరణ్‌లు దీనికి ప్రధాన సూత్రధారులని పోలీసులు గుర్తించారు. సంకల్ప్‌ మార్ట్‌ నిర్వాహకుడు, గతంలో స్థిరాస్తి వ్యాపారి అయిన గుత్తా వేణుగోపాలకృష్ణతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సంస్థ రికార్డులు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని