ఓటుబ్యాంకులకు మాయవలలు

అవకాశవాదుల బుద్ధిహీన తాయిలాల ప్రకటనలతో దేశ ఆర్థిక వ్యవస్థ వినాశనం దిశగా సాగుతోందన్న సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తాజా వ్యాఖ్య- ఓటుబ్యాంకు రాజకీయాల విధ్వంసక విశ్వరూపాన్ని కళ్లకు కడుతోంది. సుస్థిరాభివృద్ధికి దోహదపడని ఉచితాల పంపిణీతో ప్రజలను బులిపిస్తున్న అవ్యవస్థ తక్షణం తొలగిపోవాల్సిన ఆవశ్యకతను అది స్పష్టీకరిస్తోంది. ఎన్నికల హామీల నియంత్రణపై దాఖలైన వ్యాజ్యాన్ని కేంద్రం సమర్థిస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానానికి మెహతా సమాచారమిచ్చారు. జాతీయ ఆర్థిక శ్రేయస్సు కోణంలో సమస్యను పరిశీలిస్తున్నామని ఉద్ఘాటించిన ‘సుప్రీం- జనాకర్షక పథకాలపై నిష్పాక్షిక అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు నిశ్చయించింది. రిజర్వ్‌ బ్యాంకు ఇటీవలి నివేదిక ప్రకారం- పంజాబ్‌, రాజస్థాన్‌, కేరళ, పశ్చిమ్‌ బెంగాల్‌, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఎంపీ, యూపీ, హరియాణాలపై అప్పుల భారం భారీగా ఉంది. ఏపీ, బిహార్‌, రాజస్థాన్‌, పంజాబ్‌లైతే 2020-21కి పదిహేనో ఆర్థిక సంఘం నిర్దేశించిన రుణ, ద్రవ్యలోటు పరిమితులను దాటేశాయి కూడా! అనుత్పాదిత తాయిలాలపై పెరుగుతున్న వ్యయాన్ని ప్రస్తావించిన ఆర్‌బీఐ- శ్రీలంక అనుభవాల దృష్ట్యా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని రాష్ట్రాలకు హితవు పలికింది. స్థానిక అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు అప్పులు ఆశిస్తుంటాయి. ప్రజలకు శాశ్వత లబ్ధి చేకూర్చే కార్యకలాపాలకు ఆ సొమ్మును వెచ్చిస్తూ, ఆస్తుల సృష్టికి బాటలు పరిస్తే ఆదాయం అధికమవుతుంది. సకాలంలో రుణాల తిరిగి చెల్లింపు సాధ్యపడుతుంది. ఆ కీలకాంశంపై దృష్టి సారించని పాలకులు- చెరువు తెంచి చేపలు పంచే పద్ధతిలో తక్షణ నగదు బదిలీలతో ఓటుబ్యాంకులను పెంచుకోవడంపైనే మక్కువ పడుతున్నారు. ఒకపక్క ఆదాయ వనరులు అడుగంటుతున్నా- అప్పులు తెచ్చి మరీ తాయిలాలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పేరిట అప్పులు తేవడం, భవిష్యత్తు ఆదాయాలను తాకట్టుపెట్టడం వంటి పెడపోకడలను ఇటీవల ప్రస్తావించిన ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు- ఎన్నికల లెక్కలతో తాత్కాలిక లాభాలకు వెంపర్లాడే ధోరణులపై ఆందోళన వ్యక్తంచేశారు. ఒక జేబులో రూపాయి పెట్టి... అధిక పన్నుల రూపంలో రెండో జేబులోంచి రెండు రూపాయలు గుంజుకునే దుర్రాజకీయాలు- జనజీవితాల్లో ఆరోగ్యకర మార్పునకు విఘాతకరమవుతున్నాయి. దీర్ఘకాలంలో అవే దేశం పుట్టిముంచుతాయి!

ప్రజల మధ్య అసమానతలను రూపుమాపడానికి రాజ్యం పాటుపడాలని 38(2)వ రాజ్యాంగ అధికరణ నిర్దేశిస్తోంది. విద్యావకాశాలను విస్తృతం చేస్తూ ఉద్యోగ, ఉపాధి మార్గాలను కల్పించే విధానాలకు ప్రభుత్వాలు పట్టంకడితేనే- సంవిధాన లక్ష్యం నెరవేరుతుంది. అణగారిన వర్గాల అభ్యున్నతికి సర్కారీ చేయూత అత్యంత కీలకమన్నది నిర్వివాదాంశం. అందుబాటులో వైద్యసేవలు, భవితకు భరోసా కల్పించే నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, జీవన ప్రమాణాల పెంపుదలకు ఊతమయ్యే మౌలిక సదుపాయాల కల్పన తదితరాలతోనే జనావళికి సామాజిక భద్రత ఒనగూడుతుంది. తద్భిన్నంగా పాలకులు ప్రసాదిస్తున్న పేరుగొప్ప ఉచిత పథకాలు- సామాన్యులను సదా సర్కారీ ఆశ్రితులుగానే మిగులుస్తున్నాయి. ఆకలి, అవిద్య, అకాల మరణాలు, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలెన్నో సంవత్సరాల తరబడి అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి. వాటి ఊసెత్తని నేతాగణాలు- ప్రజలకు ప్రజాధనాన్నే పంచిపెడుతూ, తమను తాము సంక్షేమ రాజ్యవిధాతలుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఎందుకు పుట్టావు వక్రమా అంటే సక్రమాన్ని వెక్కిరించడానికన్నట్లు... వాస్తవాభివృద్ధిని కోరుకునే వారిని ఎగతాళి చేస్తున్నాయి. ద్రవ్యలోటు భర్తీకి రాష్ట్రాలకు అందించే నిధులకు బడ్జెటేతర అప్పులు, తాత్కాలిక తాయిలాల నియంత్రణకు లంకెపెడితే పరిస్థితులు మెరుగుపడతాయని పదిహేనో ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎన్‌.కె.సింగ్‌ సూచిస్తున్నారు. పదవులను చేజిక్కించుకోవడమే అంతిమ లక్ష్యంగా నేతలు పారిస్తున్న అనుచిత వరదానాలకు పూర్తిగా అడ్డుకట్ట పడాలంటే- ప్రత్యేక శాసనం రూపుదిద్దుకోవాలి. ఉప్పునే ఊరగాయగా భ్రమింపజేయడంలో అన్ని పార్టీలదీ ఒకటే బాట అవుతున్నప్పుడు- దిద్దుబాటుకు ముందడుగు వేసేది ఎవరన్నదే ప్రధాన ప్రశ్న!


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని