Politics: రాజకీయ తత్వం

‘అన్నా, చమురు లేనిదే బండి నడుస్తుందా?’
‘దాని గురించి ఎందుకు అడుగుతావులే... ఆ మంటలు పైపైకి ఎగస్తుండటం వల్లే కదా సామాన్యుడి బతుకు బండి కుయ్యో మొర్రో అంటోంది!’
‘అసలు మేతే వేయకుండా గేదె పాలు పితకడం సాధ్యమేనా?’
‘లోటు బడ్జెట్‌లోనూ జనాలపై భారీ వరాలు కురిపించే రాజకీయ నాయకులకు మినహా నీలాంటి నాలాంటి వాళ్లకు ఆ చాకచక్యం ఎన్నటికీ ఒంటపట్టదు’
‘మరి, అధికారం లేకుండా ప్రజాసేవ చేయడం సాధ్యమేనా?’
‘అన్నన్నా... సిమెంటు లేకుండా గోడ కట్టడం ఎంత అసాధ్యమో... అధికారం అండ లేకుండా జన సంక్షేమాన్ని నెత్తికెత్తుకోవడమూ అంతే కుదరని వ్యవహారం. మజ్జిగ నుంచి వెన్న వచ్చినట్టు, అధికారం నుంచే ప్రజాసేవ పుట్టుకొస్తుంది. అసలు నేతల దృష్టిలో పవర్‌ అంటేనే సేవకు పర్యాయపదం. అందుకే కదా నిద్ర లేచింది మొదలు- వారికి కుర్చీ అప్పగించి పొరపాటు చేశారు... దాన్ని మాకు కట్టబెట్టండి... మీ తలరాతలు మారుస్తాం... మీ బతుకుల్లో గులాబీలు పూయిస్తాం అని ప్రజల చెవుల్లో ప్రతిపక్షాలు జోరీగల్లాగా హోరెత్తిస్తాయి!’
‘మరి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఏమిటి... అధికారమే పరమావధిగా రాజకీయాలు మారిపోయాయి, సంక్షేమం అడుగంటింది అని మొన్న తెగ బాధపడిపోయారు. వాటిని చూడలేక అసలు రాజకీయాలనే విడిచిపెట్టాలనిపిస్తోందనీ అన్నారు’
‘భలేవాడివే... ఇరుసున కందెన పెట్టక పరమేశ్వరుడి బండి అయినా ముందుకు కదలదని సుమతీ శతకకారుడు ఎప్పుడో చెప్పాడు కదా. రాజకీయాల్లో ఆ కందెన అధికారమే. నిధులు రావాలన్నా, మాట చెల్లుబాటు కావాలన్నా, స్వీయ అవినీతి ప్రవాహం సాగాలన్నా, ఎంత దోచుకున్నా సీబీఐ, ఈడీ తదితరాల కన్ను తనపై పడకుండా ఉండాలన్నా సొంత పార్టీ ప్రభుత్వం ఉండాలి. లేదా అధికార పక్షం అండదండలైనా కావాలి. లేకపోతే సేవాకార్యం, స్వాహాకార్యం రెండూ చెడిపోయి... చివరికి శ్రీకృష్ణ జన్మస్థానాన్ని సందర్శించక తప్పదు. అందుకే కదా, నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజల బాగు కోసం వేరే దారిలేక అధికార పార్టీలోకి గెంతక తప్పడంలేదని పక్క పక్షాల నాయకులు మొసలి కన్నీరు కారుస్తారు’
‘అవును నిజమే! అయినా, రాజకీయాలను వదిలిపెట్టాలని ఉందని గడ్కరీ లాంటి వ్యక్తి అనడం బాధగా అనిపించింది’
‘నూరు కాకుల్లో ఒక కోకిల ఎంత తీయగా గొంతు చించుకున్నా ఏమిటి ప్రయోజనం? అసలూ, మాపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలితే రాజకీయ సన్యాసం చేస్తామని ఎంత మంది నేతలు భీషణ ప్రతిజ్ఞలు చేయలేదూ? వాళ్లలో ప్రజాసేవకు సెలవు పలికిన వాళ్లను ఎంతమందిని చూశావు? అంతెందుకు... పశ్చిమ్‌ బెంగాల్‌ తాజా మంత్రి బాబుల్‌ సుప్రియోను గతేడాది కేంద్ర మంత్రిగా దిగిపొమ్మన్నాక మళ్ళీ రాజకీయాల ముఖం చూడనంటూ భీష్ముణ్ని ఆవాహన చేసుకోలేదా? ఏమయ్యిందీ... ఏడాది తిరిగేసరికల్లా మరో పార్టీ సర్కారులో మంత్రి! ప్రజాసేవకు మనసు ఎంతగా లాగకుంటే అలా ఒట్టు తీసి గట్టుమీద పెడతారు!’
‘అంతే కదా మరి!’
‘నువ్వు ఎన్నయినా చెప్పు, ఒక్కసారి ‘ప్రజాసేవ’లోకి దిగాక అధికారం లేకపోతే ప్రాణం ఊరుకోదు. బిర్యానీలు, ‘సుర’ ప్రవాహాలతో పెంచి పోషించే మద్దతుదారుల జయజయధ్వానాలు, సొంత ధనం వెచ్చించి చల్లించుకునే పూలజల్లుల ఆహ్వానాలు, పత్రికలు, ఛానెళ్లలో కవరేజీలు... మరీ ముఖ్యంగా తరాలకు సరిపడా దోచుకున్నది లెక్కపెట్టుకొని మురిసిపోవడంలో ఉండే మజా... కొండమీద కోతినైనా కొనిపారేయగలమనే ధీమా... వాటన్నింటికీ దూరం కావడమంటే మాటలా?’
‘అవును నిజమే... సామాన్యుల బతుకుల్లో జీఎస్‌టీ మోతలు, ద్రవ్యోల్బణం వాతలు, ఆనందం తీసివేతలు. మరి నేతలకేమో సంపదల కూడికలు, స్విస్‌ బ్యాంకు అకౌంట్లలో జమల హెచ్చవేతలే!’
‘భేషుగ్గా చెప్పావు! అసలూ, రాష్ట్రాల్లో పచ్చని ప్రభుత్వాలను నిలువునా కుప్పకూల్చేస్తున్నారు కదా... దాన్నిబట్టే అర్థం చేసుకో అధికారం లేకుండా కాలం వెళ్ళదీయడం ఎంత కష్టమో!’
‘అంటే... బీపీ, షుగర్‌ మాత్రలలాగా అలవాటైన వారికి అధికారం కూడా అత్యవసరమైన ఔషధం అంటావ్‌?’
‘ఔషధమన్నది చాలా చిన్నమాట! అసలు పవర్‌ అంటేనే ఒక మత్తు. మందు కొడితె మాకు మేమే మహారాజులం అని పాడుకునే మద్యం బాబులు దాని గురించి ఇంకా బాగా చెప్పగలరు. ఏది ఏమైనా సేవ మిథ్య... అంతా అధికారం యావ! అయినా, అది పులిమీద స్వారీ లాంటిదే. సాగినన్నాళ్లు అంతా సవ్యంగానే ఉంటుంది... ఒక్కసారి పట్టు తప్పిందో... ప్రజల ముందు రాజకీయ జోకర్లుగా మిగలక తప్పదంతే!’  

- వేణుబాబు మన్నం


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని