Tribals: కష్టాల కారడవిలో గిరిజనం

నేడు ప్రపంచ ఆదివాసుల దినోత్సవం

క వైపు ప్రపంచం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు దూసుకుపోతోంది. మరోవైపు అనేక దేశాల్లో ఆదివాసీ సమూహాలు పెను సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అడవులు, ఖనిజాలు వంటి సహజ వనరులు ఎక్కువగా ఆదివాసులు నివసించే ప్రాంతాల్లోనే ఉన్నాయి. వాటిని చేజిక్కించుకొనే ఎత్తుగడలు గిరిజనుల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. భారత్‌లో ఏడు వందలకు పైగా ఆదివాసీ తెగల్లో 10.45 కోట్ల జనాభా ఉంది. వారిలో 90శాతం అటవీ ప్రాంతాల్లో వ్యవసాయం, వేట, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాల పరిపాలన, సంక్షేమంపై రాజ్యాంగంలో అయిదు, ఆరో షెడ్యూళ్లను తీర్చిదిద్దారు. అయిదో షెడ్యూలును అనుసరించి గిరిజనుల భూములు, వనరుల దోపిడి నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తెచ్చారు. ఆనాటి పరిమిత వ్యవస్థలతో 1950లో అయిదో షెడ్యూల్‌ ప్రాంతాలను గుర్తించి రాష్ట్రపతి నోటిఫై చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గిరిజన కుటుంబాలు ఉండి, అయిదో షెడ్యూల్‌ కిందకు రాని వేల గ్రామాలు నేడు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

కాగితాలకే పరిమితం

ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే అయిదో షెడ్యూల్‌ హోదా పొందని గిరిజన గ్రామాలు 800 దాకా ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రాజెక్టులు, పరిపాలనకు సంబంధించి గిరిజన సలహా మండళ్ల పాత్ర కీలకం. రాష్ట్రాల్లో అవి తరచూ సమావేశం కావడమే అరుదైపోయింది. ఆదివాసీ ప్రాంతాల సంక్షేమం కోసం సలహా మండళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్న తీర్మానాలకు సరైన మన్నన దక్కడంలేదు. గిరిజనుల సాగులో ఉన్న అటవీ భూములకు హక్కుల విషయంలో చారిత్రక తప్పిదాలను సరిదిద్దే పేరుతో అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006 రూపుదిద్దుకొంది. ఆదివాసీ గ్రామసభలకు స్వీయ పరిపాలన హక్కులు కల్పించే పంచాయతీరాజ్‌ షెడ్యూల్‌ ప్రాంతాల విస్తరణ చట్టం (పెసా) 1996లో అమలులోకి వచ్చింది. వాటి పటిష్ఠ అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ చూపడంలేదు. పెసా చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో గ్రామసభలను నోటిఫై చేస్తూ ప్రకటన వెలువడింది. 2014లో గ్రామసభలు ఏర్పాటైనా అవి ఇప్పటికీ కార్యాచరణకు నోచుకోలేదు. అటవీ హక్కుల గుర్తింపు కోసం వివిధ రాష్ట్రాల్లో గ్రామసభలు, పంచాయతీ స్థాయిలో 2008లో హక్కుల గుర్తింపు కమిటీలను వేశారు. గడచిన 12 ఏళ్ల కాలంలో వాటిని క్షేత్ర స్థాయిలో పునరుద్ధరించలేదు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ, గిరిజనుల మధ్య అనేక రాష్ట్రాల్లో తరచూ ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. గిరిజన ప్రాంతాల్లో భూ బదలాయింపును నిషేధిస్తూ చేసిన ఒన్‌ ఆఫ్‌ సెవెంటీ వంటి చట్టాలూ కాగితాలకే పరిమితమయ్యాయి. అత్యంత వెనకబాటుకు గురవుతున్న ఆదివాసీ తెగల (పీవీటీజీ) సామాజిక, ఆర్థిక వికాసంతోనే గిరిజనుల సమగ్ర ప్రగతి సాధ్యమవుతుంది. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 75 ఆదివాసీ తెగలను పీవీటీజీలుగా గిరిజన సంక్షేమ శాఖ గుర్తించింది. దాదాపు 30 లక్షల పీవీటీజీల జనాభా ఉంది. 19 తెగల్లో జనాభా వెయ్యిలోపే ఉన్నారు. పర్వత, అటవీ ప్రాంతాల్లో నివసించే పీవీటీజీలు రహదారులు, సురక్షిత తాగునీరు, ఆరోగ్య సేవలు, విద్యావసతులు వంటి సౌకర్యాలకు దూరమై దుర్భర జీవనం సాగిస్తున్నారు. ఈ తెగల సంరక్షణ, అభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులు అసలు లక్ష్యాలకు వినియోగం కావడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

చిత్తశుద్ధి అవసరం

కేంద్ర గణాంకాల ప్రకారం భారత్‌లో 1.17 లక్షల గిరిజన గ్రామాలున్నాయి. వాటిలో 22 వేల ప్రాంతాలకు ఎలాంటి రహదారులూ లేవు. 36 వేల గ్రామాలకు రవాణా వ్యవస్థ కొరవడింది. 13 వేలకు పైగా ప్రాంతాల్లో పాఠశాలలు లేవు. 88 వేల గిరిజన గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనిపించవు. ఇలాంటి వాటన్నింటిలో మౌలిక వసతులు కల్పించాలి. గిరిజనులు అధికంగా ఉన్న తూర్పు, పశ్చిమ కనుమలు, మధ్య భారత్‌, ఈశాన్య ప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో పాలకులు దుందుడుకు ధోరణిని విడనాడాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా గిరిజనులు సేకరించే ఔషధ మూలికలు, అటవీ ఫలసాయాల మార్కెట్‌ విలువ సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. వాటి ద్వారా ఆదివాసులు పొందే ఆదాయం స్వల్పం. గిరిజన సహకార మార్కెటింగ్‌ వ్యవస్థలను బలోపేతం చేసి, విలువ ఆధారిత పరిశ్రమలను అధిక సంఖ్యలో నెలకొల్పాలి. తద్వారా ఆదివాసులకు ఉపాధి కల్పన, వారికి ఆర్థిక సాధికారత సాధ్యమవుతాయి. అటవీ హక్కుల గుర్తింపు, పెసా వంటి చట్టాలనూ సమర్థంగా అమలు చేయాలి. భారత రాష్ట్రపతిగా ఆదివాసీ తెగకు చెందిన ద్రౌపదీ ముర్ము ఇటీవల బాధ్యతలు స్వీకరించడం యావత్‌ గిరిజన సమాజానికి ఆనందదాయకం. ఈ తరుణంలో గిరిజనుల స్వయంపాలన, విద్యా, ఆర్థిక సాధికారత సాధనకు పాలకులు మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలి.


మరిన్ని

ap-districts
ts-districts