Birmingham: క్రీడల్లో మరింత ఎదగలేమా?

ర్మింగ్‌హామ్‌(ఇంగ్లాండ్‌) వేదికగా నిన్నటితో ఘనంగా ముగిసిన కామన్వెల్త్‌ క్రీడోత్సవంలో- జాతికిచ్చిన మాటను భారత బృందం నిలబెట్టుకుంది. తొలి అయిదు స్థానాల్లో తళుకులీనడమే లక్ష్యమంటూ కామన్వెల్త్‌ క్రీడల బాట పట్టిన మన అథ్లెట్లకు మొత్తం 61 పతకాలు దఖలుపడ్డాయి. పతకాల పట్టికలో ఇండియా నాలుగో స్థానాన నిలిచింది! భిన్న క్రీడాంశాల్లో పతకాలను ఒడిసిపట్టడంలో ఈసారీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, కెనడాల ఆధిపత్య ప్రదర్శన కొనసాగింది. భారత బృందానికి జమపడిన మొత్తం పతకాల కన్నా ఎక్కువ సంఖ్యలో స్వర్ణాల్ని ఆస్ట్రేలియా ఎగరేసుకుపోయింది. ఇంగ్లాండ్‌ సాధించిన కాంచనాలూ యాభైకి పైబడ్డాయి. నాలుగేళ్ల క్రితం గోల్డ్‌కోస్ట్‌ (ఆస్ట్రేలియా)లో 26 పసిడి పతకాలు కొల్లగొట్టిన ఇండియా పద్దులో ఇప్పుడు కొంత తరుగుపడింది. అయినా- బాక్సింగ్‌, రెజ్లింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌లలో భారత్‌ పసిడి ప్రదర్శన చిరస్మరణీయం. తెలుగు తేజాలు నిఖత్‌ జరీన్‌, పీవీ సింధులతో పాటు నీతు గంగాస్‌, అమిత్‌ ఫంగాల్‌ ప్రభృతుల క్రీడాపాటవం అశేషాభిమానుల్ని సంబరాల్లో ముంచెత్తింది. కామన్వెల్త్‌ క్రీడల ట్రిపుల్‌ జంప్‌లో బంగారు పతకాన్ని ఒడిసిపట్టిన తొలి భారతీయ అథ్లెట్‌గా ఎల్దోస్‌ పాల్‌ చరిత్ర సృష్టించాడు. సైక్లింగ్‌, ఈత, జిమ్నాస్టిక్స్‌ అంశాల్లో మనవాళ్లు ఖాతా తెరవలేకపోయారు. షూటింగ్‌ అంశం కొనసాగి, జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా పాల్గొని ఉంటే మరింత మెరుగైన స్థానంలో నిలిచేవారమన్న విశ్లేషణలు- కోల్పోయిన అవకాశాల్ని కళ్లకు కడుతున్నాయి. క్రీడా సమాఖ్యలు, అధికార యంత్రాంగం నిశితంగా ఆత్మపరిశీలన చేసుకుంటే- ఆస్ట్రేలియా (మొత్తం 178 పతకాలు), ఇంగ్లాండ్‌ (176)ల స్థాయిలో రాణించడం కోసం వ్యవస్థాగతంగా ఎంతో చేయాల్సి ఉందన్న యథార్థం బోధపడుతుంది!

‘ఇండియాలో మొదట మెడల్స్‌ సాధించాక సాయపడేందుకు మేమంటే మేమని ముందుకొస్తారు... పతకాలు నెగ్గడానికి ఎవరూ సహకరించరు’ అని జాతి గర్వించదగ్గ పరుగుల రాణి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష ఏనాడో సూటిగా ఆక్షేపించారు. బరువులెత్తడంలో మేటిగా తమ్ముడు అలోక్‌ ఎదిగేందుకు క్రీడాకారుడిగా స్వీయ భవిష్యత్తును త్యాగం చేసిన సోదరుడి ఉదంతం, కుమార్తె బాక్సింగ్‌ శిక్షణ కోసం మూడేళ్లపాటు ఉద్యోగం మానుకున్న నీతూ గంగాస్‌ తండ్రి ఒంటరి పోరాటం... చాటుతున్నదేమిటి? ఇప్పటికీ- కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, వదాన్యుల తోడ్పాటు లభించిన ఏ కొద్దిమందో సొంతంగా నెగ్గుకొస్తున్నారు. అధునాతన శాస్త్రీయ శిక్షణ, కొన్ని వేల గంటల పాటు కఠోర సాధన- ప్రపంచ స్థాయి క్రీడాకారుల్ని రూపొందించడంలో అత్యంత కీలకమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1948 నాటి తారాచంద్‌ కమిటీ మొదలు కుంజ్రు, సీడీ దేశ్‌ముఖ్‌ సంఘాల వరకు అన్నీ- భావితరాల్ని వ్యాయామ విద్యతో పరిపుష్టీకరించాలనే ఉద్బోధించాయి. క్రీడా మైదానాల్లో యువత స్వేదం చిందించాలన్న ఉద్ఘాటనలు ఒక వంక మోతెక్కుతుండగా- మరోపక్క, సదాశయ స్ఫూర్తి నిలువునా నీరోడుతోంది. ప్రతి పాఠశాలలో ఆటస్థలం, క్రీడాసామగ్రి విధిగా ఉండాలన్న విద్యాహక్కు చట్టానికి కార్యాచరణలో తూట్లు పడుతున్నాయి. క్రీడా సమాఖ్యలు సంకుచిత రాజకీయాల్లో మునిగి తేలుతున్నాయి. ఇంత ప్రతికూల వాతావరణంలోనూ కఠోర శ్రమ, అకుంఠిత దీక్షలతో రాణిస్తున్న పతక వీరులకు- సక్రమంగా వ్యవస్థాగత సహకారం, ప్రోత్సాహం లభిస్తే మెడల్స్‌ సంఖ్య దండిగా పెరుగుతుంది. మొగ్గ దశలోనే ఔత్సాహికుల్ని గుర్తించి అండదండలు అందిస్తున్న చైనా, క్రమానుగతంగా వ్యాయామ తరగతులూ శిక్షణలతో ఆటగాళ్లను రాటుతేలుస్తున్న దేశాలెన్నో అంతర్జాతీయ వేదికలపై సమధికంగా పతకాలు కొల్లగొడుతున్నాయి. ప్రాథమిక విద్యలోనే వ్యాయామ విద్య, ఆటలు మిళితమైతే- పిల్లల శారీరక, మానసిక వికాసం అత్యుత్తమంగా ఉంటుంది. క్రీడల్లో అద్భుత ఫలితాల సాధన సుసాధ్యమవుతుంది. ఆ కల సాకారమైననాడు- సుమారు 140 కోట్ల భారతావని తరఫున ఏ కొంతమంది వ్యక్తులో కాకుండా వ్యవస్థ బలిమి చాటే పరిస్థితి నెలకొంటుంది!


మరిన్ని

ap-districts
ts-districts