Antaryami: తాతయ్య పోలికలు

ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) ముఖ వర్చస్సు ప్రకాశించే సూర్యుడిలా ఉండేది. అంతటి సుందర వదనాన్ని మరెక్కడా చూడలేదని అబూ హురైరా(ర.) పలికారు. ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.)కు సంబంధించిన ఎలాంటి చిత్రపటమూ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆయన సాధించిన మహోన్నత విజయాల అద్దంలో మాత్రమే ఆయన సుందరవిగ్రహం చూడగలం!

ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) కుమార్తెలలో చిన్నకుమార్తె హజ్రత్‌ ఫాతిమా (రజి.) వివాహం హజ్రత్‌ అలీ (రజి.)తో జరిగింది. ఆ దంపతులకు అల్లాహ్‌ ఆశీర్వాదంతో ఇద్దరు మగబిడ్డలు జన్మించారు. దైవాజ్ఞతో ప్రవక్త(స.అ.వ.) వారికి హజ్రత్‌ ఇమాం హసన్‌(ర) హజ్రత్‌ ఇమాం హుసేన్‌(ర) అని నామకరణం చేశారు. తాతగారే ఇరువురికీ పుట్టువెంట్రుకలు తీయించి హఖీఖా చేశారు. అమిత తేజస్సు కలిగిన వారిని చూసి అబుబకర్‌ సిద్దిఖీ ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) పోలికలు వచ్చాయని స్పష్టంగా ప్రకటించారు. సత్యసంధత సదాచరణ కలిగిన మొహమ్మద్‌ (స.అ.వ.) పోలికలున్న వారి మనవళ్లను చూసి అందరూ అమితానందభరితులయ్యారు. ముఖ్యంగా చిన్న మనవడు హజ్రత్‌ హుస్సేన్‌ (ర.)కు తాతగారి శరీరాకృతి వచ్చిందని చెప్పుకొనేవారు.
ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) మనవళ్లతో ఆటలు ఆడేవారు. ఎంతగానో ముద్దులాడేవారు. ‘ఓ అల్లాహ్‌ నేను వీరిద్దరినీ ప్రేమిస్తున్నాను. నీవు కూడా నీ కరుణాకటాక్షాలను కురిపించి ప్రేమించు’ అని ప్రవక్త(స.అ.వ.) ప్రార్థించేవారు. ఇద్దరూ నా ప్రాపంచిక ముద్దుల పుష్పాలు అని ఆయన ప్రకటించారు.

మనవళ్ల భవిష్యవాణిని ప్రవక్త మొహమ్మద్‌ (స.అ.వ.) అల్లాహ్‌ ఆజ్ఞతో వినిపించారు. మసీదులో ఖుత్బా బోధిస్తూ హజ్రత్‌ హసన్‌ పెద్ద మనువడిని ఎత్తుకొని ‘ఈ బిడ్డ సర్దార్‌ అవుతాడు. అల్లాహ్‌ ఈ బిడ్డ ద్వారా రెండు ముస్లిం సమూహాల మధ్య ఒప్పందం కుదర్చగలడు’ అని పలికారు. చిన్న మనవడు హజ్రత్‌ హుస్సేన్‌(ర.) వీర మరణం పొందుతాడని దైవదూత జిబ్రయిల్‌(అ.స.) ద్వారా తెలుసుకుని విచారించారు.

ప్రవక్త మొహమ్మద్‌(స.అ.వ.) మరణానంతరం, నలుగురు ఖలీఫాల మరణానంతరం అరబ్‌దేశంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ముస్లిములు రెండు సమూహాలుగా విడిపోయి యుద్ధం ప్రకటించారు. లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోతారని ఊహించి ఒక సమూహ నాయకుడైన హజ్రత్‌ హసన్‌(6) రెండో సమూహ నాయకుడి వద్దకు వెళ్ళి యుద్ధం ఆపాలని చర్చించి శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. చరిత్రలో శాంతిదూతగా నిలిచారు. కాని, శత్రువులు కుటిలనీతితో విషాహారం అందించి ఆయన మరణానికి కారకులయ్యారు. ప్రవక్త చెప్పినట్లు హజ్రత్‌హసన్‌ ఒక సర్దార్‌గా పేరుపొందారు. ఇరాక్‌ ప్రాంతంలో కుఫా పట్టణానికి దగ్గరి బంధువులతో కలిసి ప్రయాణిస్తున్న హజ్రత్‌ హుస్సేన్‌(ర.)ను అప్పటి రాజు యజీద్‌ అడ్డుకున్నాడు. వారికి తాగునీరు అందివ్వరాదని హుకుం జారీ చేశాడు. వారి మధ్య యుద్ధం కొనసాగింది. శత్రుబాణాలతో రక్తమోడుతున్న హజ్రత్‌ హుస్సేన్‌(ర.) నమాజుకై నిలబడి నియమాలకు విరుద్ధంగా శత్రువు కరవాలానికి గురై కర్బలా మైదానంలో ఒరిగిపోయాడు. మొహర్రం మాసం పదోరోజున షహీద్‌ అయిన హజ్రత్‌ హుస్సేన్‌(ర.) వీరుడిగా చిరస్మరణీయుడు.

- షేక్‌ బషీరున్నీసా బేగం


మరిన్ని

ap-districts
ts-districts