Antaryami: జీవితం తెరిచిన పుస్తకం

‘నా జీవితం తెరిచిన పుస్తకం. రహస్యాలు, దాపరికాలు ఉండవు’ అన్న మాట మనకు అక్కడక్కడ వినిపిస్తుంది. కనిపించే మనిషి లోపల అగుపించని మనసు ఉన్నంత కాలం... అంతా- దాపరికం, దాగుడుమూతలు, మాయ. మన మాయదారి మనసు పరిపరి విధాల పోతూనే ఉంటుంది. సర్వత్రా వ్యాపించే గాలి కూడా దానిముందు ఎందుకూ పనికిరాదు. సృష్టిలో జన్మించాక అవసరాలు తీరడం కోసం మనిషి ఒక్కోచోట ఒక్కో తీరుగా వ్యవహరించాలి. తప్పదు. దాన్ని లోకజ్ఞానం అంటారు పెద్దలు. బతకడం చేతకాని మనిషిని సమాజం చిన్నచూపు చూస్తుంది. అందుచేత ఉదర పోషణార్థం బహురూప ధారణ, భావ ప్రదర్శన తప్పనిసరి. బతకనేర్చినతనానికి అది సూచిక. మనిషన్నాక గోప్యత ఉండి తీరుతుంది.

అడవి- క్రూరజంతువులకే కాదు, సాధు జంతువులకూ ఆవాసం. అది క్రిమికీటకాదుల నుంచి ఏనుగు దాకా అనేక జీవులకు నెలవు. వాటి మానసిక స్థితులు కూడా భిన్నంగా ఉంటాయి. జన్మతో లభించిన బుద్ధితో వాటిదైన జీవితం గడుపుతాయి. సంఘం అంటే రకరకాల మనసుల సమీకరణాలు, భేదాలు. ఏ ఇద్దరు ఒక్కలా ఉన్నా, మనసులు ఏకరీతిగా ప్రవర్తించినా సృష్టి అర్థం కోల్పోతుంది. శరీర మనో వైవిధ్యాలే లోకం మనుగడకు కారకాలు. ఇక్కడ శరీరానికి ప్రాధాన్యం ఇచ్చేవారుంటారు. మనసుకు పట్టం కట్టేవారూ ఉంటారు. లోకం భిన్న రుచులతో కొనసాగుతుంది. ఇతర జీవరాశికి, మనిషికి ఆలోచనల విషయంలో భేదం ఉంది. మనిషి పరిస్థితులకు, నిత్య నూతనంగా ఎదురయ్యే సమస్యలకు తగ్గట్టుగా తన బుద్ధితో, తెలివితో సమాధానాలు వెతుక్కుంటాడు. జంతువులకు ఆ సామర్థ్యం ఉండదు. అవి ఎప్పటికీ ఒక్కలానే పుట్టి, జీవించి, మరణిస్తాయి.

మనసా వాచా కర్మణా అన్నది చెప్పినంత సులభం కాదు ఆచరించడం. ఆ మూడింటి కలయిక దాదాపు అసాధ్యం. ఉన్నతమైన సాధనతో కొంతవరకు పట్టు చిక్కించుకోవచ్చు. ఆ మూడు ఏకమయ్యేలోపు దేనికదిగా విడిపోనూవచ్చు.
పాండవులు తమ ప్రవర్తనతో ధర్మపరాయణులని పేరు తెచ్చుకుని శ్రీకృష్ణుడి మనసుకు దగ్గరయ్యారు. అయినా- కురుక్షేత్ర ధర్మ పోరాటంలో సారథిగా నిలిచి దుర్మార్గులైన కౌరవులను మట్టి కరిపించిన శ్రీకృష్ణ పరమాత్మకు సైతం పాండవ పక్షపాతి అన్న పేరు వచ్చింది. తమ్ముడైన సుగ్రీవుడి భార్యను దుర్మదాంధుడు వాలి చెరబట్టాడు. చెట్టు చాటు నుంచి శ్రీరాముడు వాలిని బాణంతో నేల కూల్చాడు. అంతటి ధర్మపరాయణుడు, సకల గుణాభిరాముడు కుట్రతో వాలిని నేలకూల్చాడన్న మాట పడ్డాడు. అందరి మనసులూ స్వచ్ఛమైన మల్లెలు కావు. అందరూ శాంత స్వభావులుగా ఉండరు. పువ్వును, ముళ్లను ఒక్కలా చూడలేం. సమాజానికి మంచి చెయ్యాలన్నా మనసులో ఒక రహస్య ఆలోచన, ప్రణాళిక ఉండాలి. అప్పుడే అది సఫలమవుతుంది. మనుషుల్లోని మనసులు స్పష్టంగా కనిపించడం మొదలైతే సమాజం క్షణం మనజాలదు. భగవంతుడు మనుసును శరీరంలో దాచి మనిషిని సృష్టించింది అందుకేనేమో? అప్రమత్తతతో మెలగుతూ, ఎవరి జాగ్రత్తలో వారుంటే జీవితం నందనోద్యానవనం అవుతుంది. స్వామివారి దివ్యమంగళ విగ్రహం నిలిచే వేదికవుతుంది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని