Sonia Gandhi: ఒక కుటుంబం... రెండు కుంభకోణాలు

సోనియా చుట్టూ అల్లుకున్న అక్రమాలు

ఒకదానికొకటి సంబంధం లేకపోయినా... రెండు కుంభకోణాలు గాంధీల కుటుంబంతో అల్లుకుపోయాయి. అందులో ఒకటి బోఫోర్స్‌ శతఘ్నుల కొనుగోలు వ్యవహారం. మరొకటి నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక ఆస్తుల అంశం. సోనియాకు ఈ రెండింటితో సంబంధం ఉండటం గమనార్హం. బోఫోర్స్‌ కుంభకోణంతో పోలిస్తే నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారంలో మనీ లాండరింగ్‌ ఆరోపణ స్వల్పవిషయం. ఇది సామాన్యులను పెద్దగా ఆకర్షించదు. సాధారణ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓడిపోవడానికి బోఫోర్స్‌ కుంభకోణం కారణమైంది. నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారం వల్ల ఏ పార్టీకీ ఎన్నికల్లో పెద్దగా లాభించే అవకాశం లేదు. ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు గాంధీలను బాధితులను చేస్తున్నారనే అభిప్రాయం ఏర్పడటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి వచ్చే నష్టం ఉండదు. బోఫోర్స్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడితో సోనియాకు సన్నిహిత సామాజిక, వ్యాపార సంబంధాలున్నప్పటికీ- కాంగ్రెసేతర ప్రభుత్వాలు కూడా ప్రశ్నించలేకపోవడం రాజకీయాల్లో ఆ కుటుంబ హవా ఏ స్థాయిలో కొనసాగుతోందో ఊహించవచ్చు.

చేతులు మారిన ముడుపులు
సోనియా గాంధీ మిత్రుడు, దిల్లీలోని ఇటలీ వ్యాపారవేత్త ఖత్రోచీ తుపాకుల కొనుగోలు వ్యవహారంలో ముడుపులు పొందినట్లు వెల్లడైనా ఎవరూ ఆమెను ప్రశ్నించలేదు. స్వీడిష్‌ తుపాకుల తయారీదారుల నుంచి ముడుపుల హామీని ఖత్రోచీ పొందిన తరవాతే సైన్యం కోసం శతఘ్నుల కొనుగోలు ఒప్పందానికి అప్పటి ప్రధాని రాజీవ్‌ అంగీకరించారు. రూ.1500 కోట్ల ఒప్పందంలో లంచాలు చెల్లించినట్లు స్వీడిష్‌ రేడియా వెల్లడించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని దాచిపెట్టడానికి అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసింది. దీనిపై దర్యాప్తు చేయకుండా స్వీడిష్‌ ప్రభుత్వంపైనా ఒత్తిడి తెచ్చింది. ఈ వ్యవహారంలో తమ కుటుంబ మిత్రుడైన ఖత్రోచీకి ప్రమేయముందని వెల్లడైనా... అతడు దేశం విడిచి వెళ్ళడానికి అనుమతించి కాంగ్రెస్‌ పార్టీ అపకీర్తి మూటగట్టుకుంది.

తాజాగా నేషనల్‌ హెరాల్డ్‌ విషయానికి వస్తే- ఆ పత్రికకు సంబంధించిన స్థిరాస్తుల యాజమాన్యాన్ని చట్టవిరుద్ధమైన పద్ధతిలో వ్యక్తిగత పేర్లపైకి గాంధీలు బదిలీ చేయించుకున్నారన్నది అభియోగం. 2008లో సంస్థను మూసివేసినపుడు పత్రికకు దీర్ఘకాలంగా రూ.90 కోట్ల అప్పు ఉంది. వడ్డీ లేని ఈ రుణం ఏఐసీసీకి  చెల్లించాల్సిఉంది. రెండేళ్ల తరవాత యంగ్‌ ఇండియా లిమిటెడ్‌ (వైఐఎల్‌) అనే కొత్త సంస్థను ప్రారంభించారు. ఇందులో 76శాతం వాటాలు రాహుల్‌, సోనియా గాంధీలకు... మిగిలినవి కొందరు కాంగ్రెస్‌ నాయకులకు ఉన్నాయి. నేషనల్‌ హెరాల్డ్‌ను నిర్వహించే పాత ‘అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్‌)’కు చెందిన రూ.1500 కోట్ల నుంచి రూ.1800 కోట్ల విలువైన ఆస్తులను వైఐఎల్‌కు రహస్యంగా బదిలీ చేయించారు. ఈ ఆస్తులు ప్రభుత్వాధీనంలోనివి కాకపోయినా- పత్రిక నిర్వహణకు అధిక రాయితీపై ఇచ్చినవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనీ లాండరింగ్‌ ద్వారా కోల్‌కతాకు చెందిన ఓ హవాలా సంస్థ నుంచి వైఐఎల్‌ రూ.కోటి పొంది... అందులో రూ.50 లక్షలను ఏఐసీసీకి చెల్లించింది. ఇందుకు ప్రతిగా నేషనల్‌ హెరాల్డ్‌ తనకు చెల్లించాల్సిన రూ.90 కోట్ల అప్పును ఏఐసీసీ విరమించుకుంది. ఈ మనీ లాండరింగ్‌ వ్యవహారంపైనే ప్రస్తుతం సోనియా, రాహుల్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రశ్నిస్తోంది. ఈ లావాదేవీలను పక్కన పెడితే- దిల్లీ, ముంబయి, భోపాల్‌, లఖ్‌నవూల్లో ఏజేఎల్‌కు ఉన్న విలువైన స్థలాలు, భవనాలను సొంతం చేసుకోవడమే కీలకాంశం.

ఒప్పందం మేరకే అడుగులు
కాలం మారింది. గాంధీలు ఇప్పటికీ తాము ప్రత్యేకమైనవారమని, సామాన్యులకు వర్తించే చట్టాలకు తాము అతీతులమనే భ్రమలో ఉంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల నిరసన ప్రదర్శనలకు ప్రజల నుంచి కనీస మద్దతు లభించకపోవడం గమనార్హం. గాంధీలు కూడా సాధారణ భారతీయుల మాదిరిగానే చట్టాలకు జవాబుదారీగా ఉండాలని ప్రజలు గ్రహించారు. పార్లమెంటులో మంత్రి స్మృతి ఇరానీతో పాటు అధికార పార్టీ సభ్యులు సోనియాగాంధీపై విరుచుకుపడటం కాంగ్రెస్‌ దుస్థితికి అద్దం పడుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్ణయాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఎన్డీయే తరఫున రంగంలోకి దిగిన జగదీప్‌ ధన్‌ఖడ్‌కు వ్యతిరేకంగా ఓటు వేయకుండా ఉండేందుకే- టీఎంసీ ఓటింగ్‌కు దూరంగా ఉంటూ అయోమయాన్ని సృష్టించింది. భాజపా, టీఎంసీల మధ్య ఈ మేరకు రహస్య ఒప్పందం కుదిరిందనే ఊహాగానాలు కోల్‌కతాలో వినిపించాయి. డార్జిలింగ్‌లో ఈశాన్య ప్రాంతానికి చెందిన భాజపా ముఖ్యమంత్రి, టీఎంసీ ప్రముఖుడితో కలిసి చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం- తృణమూల్‌ పెద్దలను ఈడీ చూసీచూడనట్లు ఉండాలి. అందుకు ప్రతిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఆ పార్టీ దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారు. మార్గరెట్‌ ఆళ్వా పేరును ప్రకటించినప్పుడు మమతా బెనర్జీని శరద్‌పవార్‌ సంప్రదించకపోవడమే ఇందుకు కారణమన్నది ఓ సాకు మాత్రమే. టీఎంసీ కీలక నేతకు ఈడీ సెగ తగలకుండా తప్పించడమే అసలు కారణమని తేలింది. రాజకీయ నేతలు అవసరమైతే ఏ స్థాయికి దిగజారుతారో ఈ ఉదంతమే తేటతెల్లం చేస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts