రక్షాబంధనం

ఆత్మీయ సౌరభాలు, అనురాగ మధురిమలు, ఆప్యాయతానుబంధాల సమ్మిళితంగా ప్రకటితమయ్యే రసార్ణవ వేడుక- రాఖీ పౌర్ణమి.

‘రాకా చంద్రుడు’ అంటే పున్నమి చంద్రుడు. వెండి వెన్నెలలు నిండుగా, మెండుగా జాలువారే ఈ పౌర్ణమినాడు ధరించే రక్షను రాఖీ అంటారు. రాఖీ అసలు పేరు- రక్షిక. ‘సోదరా! నీ చేతికి నేను ధరింపజేసే ఈ రక్ష నీకు అన్ని వేళలా శ్రేయస్సును చేకూరుస్తుంది. రక్షణ కల్పిస్తుంది. నాకు నువ్వు, నీకు నేను అనే ఆలంబనకు ఈ రక్షాబంధనం ప్రతీకగా నిలుస్తుంది. మన ప్రేమాస్పద పయనాన్ని నిరంతరం కొనసాగిద్దాం’ అనే హృద్యమైన భావ పరంపరతో సోదరుడి చేతికి మంగళదాయకమైన రక్షను ధరింపజేయాలని ‘వ్రతోత్సవ చంద్రిక’ నిర్దేశించింది. ఆ సోదరుడికి విజయ తిలకం దిద్ది, రక్ష కట్టి, మంగళ హారతినిచ్చి, మధుర పదార్థాన్ని సోదరి తినిపిస్తుంది. సోదరుడు తన సోదరికి కానుకలిచ్చి ఆమెను సంబరపరుస్తాడు. అలా ఇంటింటా దరహాస చంద్రికలు వర్ధిల్లాలని ‘వ్రత చూడామణి’ ఆకాంక్షించింది.

సోదరీమణుల ప్రేమాభిమానాల బాంధవ్యంతో ముడివడిన రాఖీని ధరించినవారికి నరక భయం ఉండదని, తన సోదరి యమునతో యముడు పేర్కొన్నట్లుగా భవిష్యోత్తర పురాణం వెల్లడించింది. పాండవులకు కురుక్షేత్రంలో విజయం లభించడానికి రుక్మిణితో, శ్రీకృష్ణుడు వారికి రక్షను ధరింపజేశాడని ఈ వేడుకను ‘విజయపథం’గా అభివర్ణిం చాడని మహాభారతం వివరించింది. రక్షాబంధనమనేది శక్తికి, రక్షణకు తోడ్పడే ఉపకరణంగా భావించే సంప్రదాయం అనాదిగా ఉంది. దేవదానవుల సంగ్రామంలో ఇంద్రుడు విజయుడై తిరిగిరావాలని దేవగురువు బృహస్పతి, శచీదేవితో రక్షను ఇంద్రుడికి అలంకరింప జేశాడంటారు. దానశీలుడు, మహా బలశాలి, రాక్షస రాజైన బలిచక్రవర్తిని దేవతల అభీష్టం మేరకు విష్ణువు తన శక్తితో బంధించాడు. తన సంపూర్ణ శక్తిని శ్రీహరి ఓ దివ్య కంకణంలోకి ఆపాదించి, ‘శ్రావణ పూర్ణిమనాడు నిన్ను బంధించిన ఈ రక్షా బంధనం నీకు సర్వదా క్షేమాన్ని చేకూరుస్తుంది. అలాగే ఈ పౌర్ణమినాడు ఎవరైతే ‘సురక్ష’ను ధరిస్తారో వారికి సమస్త శుభాలూ లభిస్తాయి’ అని విష్ణువు బలికి వరమిచ్చాడని విష్ణుపురాణం విశదీకరించింది. తుల్జా భవానీ సమక్షంలో ఛత్రపతి శివాజీ రక్షాబంధన ఉత్సవాన్ని ప్రతి శ్రావణ పౌర్ణమినాడు నిర్వహించి, ధర్మరక్షణకు తాను పునరంకితమవుతున్నానని ప్రతిన బూనేవాడంటారు. అందుకే ధర్మ దివస్‌గా ఇప్పటికీ మరాఠా సీమలో ఈ వేడుకను వ్యవహరిస్తారు.

బ్రహ్మ నుంచి వేదాల్ని అపహరించిన సోమకాసురుడిని సంహరించేందుకు విష్ణువు, హయగ్రీవుడిగా అవతరించింది ఈ శ్రావణ పూర్ణిమనాడే! ఈశ్వరుడు తన ఐశ్వర్యకారక శక్తిని, మహాలక్ష్మికి అనుగ్రహించింది ఈ శుభదినానేనని శివ మహాపురాణం పేర్కొంది. జంధ్యాల పూర్ణిమగానూ ఈ వేడుకను జరుపుకొంటారు. యజ్ఞోపవీతానికి ఉండే మూడు పోగులూ దేవ, పితృ, రుషి రుణాలకు సంకేతాలు. రక్షాబంధనానికి సోదరి వేసే మూడు ముడులూ ఆరోగ్యం, సంపద, ఆయువులకు సూచికలు. త్రికరణశుద్ధిగా, త్రికాలాల్లో అందరికీ మేలు చేకూరాలి. అందరూ సుభిక్షంగా ఉండాలి. అంతటా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలనే విశాలమైన భావన ఈ పర్వం నేపథ్యంగా అభివ్యక్తమవుతుంది.

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని