గజరాజుల మనుగడకు ముప్పు

నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం

గత ఏడాది చైనాలోని యున్నన్‌ ప్రావిన్సుకు చెందిన ఒక అభయారణ్యాన్ని వదిలి దూరప్రాంతానికి ఓ ఏనుగుల గుంపు వలసవెళ్ళడం ప్రపంచం దృష్టిని  ఆకర్షించింది. 15 ఏనుగుల సమూహం కొన్ని నెలలపాటు సుమారు 500 కిలోమీటర్ల సుదీర్ఘప్రయాణం కొనసాగించింది. ఈ ప్రయాణంలో అవి పట్టణ ప్రాంతాలకూ చేరాయి. చైనా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలతో; డ్రోన్లు, రక్షణ దళాలతో వాటికి ఎలాంటి హానీ సంభవించకుండా తిరిగి అవి అడవుల్లోకి వెళ్ళేలా జాగ్రత్తపడటంతో కథ సుఖాంతమైంది. ఆ ఏనుగులు ఎందుకు హఠాత్తుగా అడవిని వదిలి వెళ్ళాయనేది అంతుచిక్కని అంశంగానే మిగిలిపోయింది. వాటి ఆవాస ప్రాంతాల్లో మితిమీరిన మానవ కార్యకలాపాలే అందుకు కారణం కావచ్చని పలు దేశాల పర్యావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏనుగుల మనుగడకు ముప్పు పొంచి ఉందనడానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం.

ఒకవైపు ఏనుగుల దంతాలకోసం వేటగాళ్లు వాటిని సంహరిస్తుంటే... మరోవైపు అభివృద్ధి పేరుతో కొనసాగుతున్న ఆధునిక, సాంకేతిక కార్యకలాపాలు వాటి స్వేచ్ఛా జీవనానికి విఘాతం కలిగిస్తున్నాయి. అడవుల విస్తరణలో ఏనుగుల పాత్ర ఎనలేనిది. పండ్లు తిని విత్తనాలను విసర్జించే ప్రక్రియలో మొక్కల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీ వృక్షాల సంతతి విస్తరణ 30-40శాతంమేర గజరాజులవల్లే సాధ్యమవుతోందని అంచనా. అడవుల్లో భూములు సారవంతమయ్యేందుకూ వాటి విసర్జితాలు ఎంతో ఉపయోగపడతాయి. ఏనుగుల సంచారంవల్ల పువ్వుల్లో పరపరాగ సంపర్కం జరుగుతుంది. వాటి పాదముద్రలు పడిన చోట్ల చిన్న కీటకాలు ఆవాసముంటాయి. ఇది జీవ వైవిధ్యప్రకియకు ఎంతో కీలకమైంది. అందుకే గజరాజులను అడవుల నిర్మాత(ఆర్కిటెక్ట్‌)లుగా వ్యవహరిస్తారు. ఏనుగులే లేకుంటే అడవుల విస్తరణ ఆగిపోతుందని పర్యావరణవేత్తలు అంటారు.

ఏనుగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందనేది చేదు వాస్తవం. శతాబ్దం క్రితం థాయ్‌లాండ్‌లో ఏనుగుల సంఖ్య లక్షకు పైమాటే. ఇప్పుడది నాలుగు వేలకు కుంచించుకుపోయింది. ప్రస్తుతం ఆసియా ఏనుగుల సంఖ్య 40 వేలు, ఆఫ్రికా ఏనుగుల సంఖ్య నాలుగు లక్షల వరకు ఉంటుందని అంచనా. వీటి సంఖ్య వేగంగా క్షీణిస్తూ ఉండటం ఆందోళనకరం. ఏనుగులకు వాటిల్లుతున్న హాని గురించి ప్రజలకు వివరించి వాటిని సంరక్షించేందుకు థాయ్‌లాండ్‌కు చెందిన ఏనుగుల పునఃపరిచయ (ఎలిఫెంట్‌ రీఇంట్రడక్షన్‌) ఫౌండేషన్‌ మరికొన్ని సంరక్షణ సంఘాలతో కలిసి 2012 ఆగస్టు 12న మొదటిసారిగా ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా అదేరోజున ఈ ఫౌండేషన్‌ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

భారతదేశ అడవుల్లోని రైల్వే లైన్లు ఏనుగుల పాలిట మృత్యుమార్గాలుగా మారుతున్నాయి. ఆహారాన్వేషణలో భాగంగా ఏనుగులు గుంపులుగా అడవుల్లో సంచరిస్తుంటాయి. అందులో భాగంగా రైల్వే పట్టాలమీద వేగంగా ప్రయాణించే రైళ్లు ఢీకొని అవి బలవుతున్నాయి. ఏనుగుల ఆవాస ప్రాంతాల్లోకి రైలు పట్టాలు చొచ్చుకుపోవడమే సమస్యకు మూల కారణం. 1987-2018 సంవత్సరాల మధ్య సుమారు 250 ఏనుగులు రైళ్లు ఢీకొని మృతి చెందాయి. 2019 నుంచి 2021 వరకు (మూడేళ్లలో) అడవుల్లో రైళ్లకు బలైన ఏనుగుల సంఖ్య 45 అని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. రైలు పట్టాలపై విగతజీవులవుతున్న ఇతర వన్యమృగాల సంఖ్య అదే సమయంలో 150కి పైగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. అడవుల్లో రైళ్ల వేగాన్ని గణనీయంగా నియంత్రించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘ప్రయాణికుల భద్రత’ దృష్ట్యా అటవీప్రాంతాల్లో రైళ్ల వేగాన్ని తగ్గించలేమంటూ రైల్వేశాఖ చెప్పడం గమనార్హం.

భారత్‌లో అస్సాం, పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశా, ఉత్తరాఖండ్‌, ఝార్ఖండ్‌, కేరళ, కర్ణాటక, తమిళనాడు అడవుల్లో ఏనుగులు ఎక్కువగా రైళ్లు ఢీకొని మరణిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏనుగులు సంచరించే క్షేత్రాలు (ఎలిఫెంట్‌ కారిడార్స్‌) 88. అందులో అత్యధికంగా ప్రమాదాలు సంభవించేవి సుమారు 40. ఆయా క్షేత్రాల్లో ఏనుగులు, ఇతర వన్యమృగాలను కాపాడేందుకు రైల్వే సిబ్బందిలో అవగాహన పెంచాలి. ప్రమాదాలకు బాధ్యులైన వారిని శిక్షించేవిధంగా నిబంధనలు రూపొందించాలి. కొన్ని నెలల క్రితం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో పర్యావరణ, రైల్వే మంత్రిత్వ శాఖల అధికారులు ఉంటారు. అడవుల్లో రైలు పట్టాలపై మూగజీవాల మారణహోమాన్ని ఆపడానికి అవసరమైన చర్యలను ఈ కమిటీ సూచిస్తుంది. ఇటీవల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఏనుగుల సంచార సమాచారాన్ని తెలుసుకొనే విధానాలను రూపొందించాలంటూ రైల్వే శాఖ తమిళనాడులోని ఐటీ కంపెనీలను సంప్రదిస్తోంది. రైళ్లకు బలి కాకుండా ఏనుగుల సంతతిని కాపాడేందుకు- సాంకేతికత ఆలంబనగా మార్గాలను అన్వేషించి, పకడ్బందీగా అమలు చేసినప్పుడే జీవవైవిధ్యం పరిఢవిల్లేది!

- వెన్నెల


మరిన్ని

ap-districts
ts-districts