భారత్‌-రష్యాల వాణిజ్య వృద్ధి

ఆంక్షలతో అందివచ్చిన అవకాశం

రష్యాపై అమెరికా, జపాన్‌, ఐరోపా దేశాలు విధించిన ఆర్థిక ఆంక్షలు భారత్‌కు వరంగా పరిణమిస్తున్నాయి. పాశ్చాత్య దేశాలకు చెందిన మెక్‌డొనల్డ్స్‌, ఐబీఎం, అమెజాన్‌, ఆపిల్‌ వంటి వెయ్యి సంస్థలు రష్యా నుంచి నిష్క్రమించినందువల్ల వాటి స్థానాన్ని భర్తీ చేయాల్సిందిగా భారతీయ కంపెనీలను పుతిన్‌ సర్కారు ఆహ్వానించింది. జూన్‌లో జరిగిన బ్రిక్స్‌ సదస్సులో పుతిన్‌ భారతీయ సూపర్‌ మార్కెట్‌ గొలుసు సంస్థలను రష్యాలో దుకాణాలు తెరవాల్సిందిగా ఆహ్వానించారు. రష్యాలో పద్దెనిమిది వేల గొలుసుకట్టు విక్రయశాలలను నడిపే ఎక్స్‌5 గ్రూపు భారతీయ సరకులను దిగుమతి చేసుకోదలచింది. ఈ గ్రూపు ఏడాదికి రెండు లక్షల కిలోల కాఫీ, తేయాకు, ఎనిమిది వేల టన్నుల మత్స్య ఉత్పత్తులను సరఫరా చేయాల్సిందిగా భారతీయ కంపెనీలను కోరింది. రెండు వేల టన్నుల బియ్యం, లక్షన్నర వంట పరికరాలు, ఎనభై వేల యూనిట్ల దుస్తులు తదితరాలూ ఎక్స్‌5 జాబితాలో ఉన్నాయి.

ఇప్పటికే రష్యాలో 40 ఔషధాలను విక్రయిస్తూ, 800 మంది ఉద్యోగులను నియమించిన డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అక్కడ మరింతగా విస్తరించడానికి అవకాశం చిక్కింది. భారత్‌కు చెందిన కాంటినెంటల్‌ కాఫీ సంస్థ రష్యాలో ఇప్పటికే విక్రయాలు ఇతోధికం చేసుకుంది. ఆంక్షల వల్ల క్రెమ్లిన్‌కు ఎగుమతులు చేయలేకపోతున్న ఇతర దేశాల కంపెనీలు సైతం భారతీయ సంస్థల భాగస్వామ్యంతో తమ సరకులను పంపుతున్నాయి. 2020-2021 ఆర్థిక సంవత్సరం దాకా భారత్‌ ప్రధానంగా రష్యన్‌ ఆయుధాలను దిగుమతి చేసుకునేది. ఆ సంవత్సరం రష్యా నుంచి 550 కోట్ల డాలర్ల విలువైన సరకులు, సేవలను దిగుమతి చేసుకున్న భారత్‌- 260 కోట్ల డాలర్ల ఎగుమతులు మాత్రమే చేయగలిగింది. 2021-22లో రష్యన్‌ ఆయుధాలకు తోడు చమురునూ దిగుమతి చేసుకోవడంవల్ల భారత్‌కు మొత్తం క్రెమ్లిన్‌ దిగుమతుల విలువ 869 కోట్ల డాలర్లకు పెరిగింది. అదే కాలంలో రష్యాకు భారత్‌ ఎగుమతుల విలువ 318 కోట్ల డాలర్లకు ఎగబాకింది. భారత్‌, క్రెమ్లిన్‌ల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోందనడానికి ఇదే నిదర్శనం.

భారత్‌, రష్యా, ఇరాన్‌ల మధ్య 2002లో కుదిరిన అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్‌ (ఐఎన్‌ఎస్‌టీసీ) కార్యరూపం దాలుస్తోంది. 7,200 కిలోమీటర్ల మేర రోడ్డు, రైలు, నౌకా మార్గాల్లో సరకుల రవాణాకు తోడ్పడే బహుళ విధ రవాణా కారిడార్‌ ఇది. ఐఎన్‌ఎస్‌టీసీ కింద జూన్‌లో రష్యాలోని సెయింట్‌పీటర్స్‌బర్గ్‌ నుంచి రెండు భారీ కంటైనర్లలో సరకులు రోడ్డు మార్గం ద్వారా కాస్పియన్‌ సముద్ర తీరంలోని క్రెమ్లిన్‌ రేవు అస్త్రఖాన్‌కు చేరుకొన్నాయి. అక్కడి నుంచి నౌక ద్వారా ఇరాన్‌ రేవు బందరే అంజాలీకి, ఆపై భూమార్గంలో అదే దేశంలోని బందరే అబ్బాస్‌ రేవుకు, మళ్ళీ అక్కడి నుంచి నౌకా మార్గంలో భారత్‌లోని నవశేవ పోర్టుకు చేరుకుంటాయి. దీనివల్ల సరకుల రవాణా కాలం 40 రోజుల నుంచి 25 రోజులకు దిగివస్తుంది. రవాణా వ్యయమూ 30శాతం మేర తగ్గుతుంది. ఐఎన్‌ఎస్‌టీసీ పూర్తిగా కార్యరూపం దాలిస్తే భారతీయ సరకులు మధ్యాసియాకు చేరడానికి పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌ల మీద ఆధారపడనక్కర్లేదు. రష్యన్‌ చమురు రవాణాకు అరబ్‌, పాశ్చాత్య దేశాల అదుపులోని సూయెజ్‌ కాలువను వినియోగించుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఐఎన్‌ఎస్‌టీసీని, చాబహార్‌ రేవును అనుసంధానిస్తే పాక్‌తో నిమిత్తం లేకుండా అఫ్గానిస్థాన్‌, మధ్యాసియాలకూ సరకుల రవాణా నిర్వహించవచ్చు. జూలై 12న ఐఎన్‌ఎస్‌టీసీ తూర్పు విభాగంలో భాగంగా కొత్త రైలు రవాణా మార్గం ప్రారంభమైంది. దాని ద్వారా సరకులు భారత్‌కు చేరడానికి 35 నుంచి 37 రోజులు పడుతుంది.

వ్లాదివొస్తాక్‌లో సెప్టెంబరు అయిదు నుంచి ఎనిమిది వరకు జరగనున్న ఏడో తూర్పు ఆసియా ఆర్థిక వేదిక సమావేశాలకు భారత్‌ను ఆహ్వానించినట్లు రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. రష్యన్‌ ఆర్కిటిక్‌ ప్రాంతంలో 8.2 కోట్ల టన్నుల చమురు నిక్షేపాలను కనుగొన్నట్లు ఆ దేశానికి చెందిన ఆయిల్‌ కంపెనీ రాస్‌నెఫ్ట్‌ ఇటీవల ప్రకటించింది. సైబీరియాలోనూ అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో భారత్‌ ఇప్పటికే 1500 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలవల్ల భారత్‌, క్రెమ్లిన్‌లు మరింత దగ్గరవుతున్నాయి. వ్లాదివొస్తాక్‌ నుంచి చెన్నైకి నౌకా మార్గం ద్వారా చమురు, గ్యాస్‌ సరఫరా జరిగే రోజు ఎంతో దూరంలో లేదని చెప్పవచ్చు.

- ప్రసాద్


మరిన్ని

ap-districts
ts-districts