పదండి వెనక్కు పదండి తోసుకు...

‘తుప్పల్లో, చెట్ల తొర్రల్లో తీక్షణంగా వెతుకుతున్నావేమిటి? పాములూ తేళ్లూ ఉంటాయి’
‘ఏమి చెప్పమంటావు నా బాధ... నలుపు, ఎరుపు రంగులు కలగలిసిన చీమలు ఇంట్లో ఉంటే కట్టలకొద్దీ డబ్బొచ్చిపడుతుందని మా ఆవిడ అదేదో యూట్యూబ్‌ ఛానెల్లో చూసిందట. ఆ పిపీలికాల కోసం నడుములు పడిపోయేలా ఇంట్లో నలుమూలగా వెతికించింది. పుట్టి బుద్ధెరిగాక అలాంటి వాటిని నేను చూడలేదని అంటే వింటే కదా... ఆ చీమలు ఇంట్లో ఉండాల్సిందే... వెతికి పట్టుకురండి అని ఇలా పంపించింది. అది సరే, నువ్వేమిటి ఇలా...?’
‘నాదీ నీ కథలే! తెల్లమచ్చల నల్లబల్లి తోకను జిల్లేడు చెట్టుకు కడితే అర నిమిషంలో అప్పుల బాధలన్నీ పటాపంచలవుతాయని నా భార్యామణి యూట్యూబులో విన్నదట. బల్లి తోక, జిల్లేడు చెట్టు తేవాలని హుకుం జారీ చేసింది! నాకసలు ఏ రుణాలూ లేవు. ఆ మాట చెబితే వినదే! భవిష్యత్తులో అప్పులవుతాయేమో... ముందు జాగ్రత్త అంటోంది’
‘సరిపోయింది పో... దేశం ఆధునిక సాంకేతికతలో దూసుకుపోతోందని మన నేతలు జబ్బలు చరుచుకుంటుంటారు కదా... యూట్యూబుల్లో తలతిక్క వీడియోలతో ప్రజలను రాతి యుగంలోకి ఈడ్చుకెళ్తున్న మారాజులను వాళ్లకోసారి చూపించాలి’
‘సరేలే... ఆ నాయకులతో తీసుకున్న ఫొటోలు, వాళ్లతో చేయించిన పూజల వీడియోలు చూపించే కదా ఆ దుష్టగ్రహ రాయుళ్లు పబ్బం గడుపుకొంటున్నారు. అవునూ, కాలికి ఆ కట్టు ఏమిటి?’
‘పక్కింటికి ఎవరో సిద్ధాంతి వచ్చాడని వాళ్లు పదే పదే పిలిస్తే వెళ్ళాను. అయిదు వేలు గూగుల్‌ పే చేయించుకొని అదేదో మెరిసే రాయి చేతిలో పెట్టాడు. క్రూరజంతువులు, అపమృత్యు భయాలు ఉండవన్నాడు. ఆ సాయంత్రమే గ్రామ సింహం నా పిక్క ఊడబెరికింది. దాని గురించి అడిగితే, కుక్క క్రూరజంతువా... పైగా నువ్వు బతికే ఉన్నావుగా... అని ఫోనులో గయ్యిమన్నాడు ఆ మహానుభావుడు!’
‘హహ్హహ్హ... ఇలాంటిదే మా పక్కింటి వాళ్లకీ జరిగింది. ఎవరో స్వామీజీ ఇంటికొచ్చి సకల దోషాల నివారణ కోసమని తాయెత్తులు, ప్రసాదాలు ఇచ్చివెళ్ళాడు. ఆ ప్రసాదంలో ఏ మత్తు మందు కలిపారో ఏమో... ఆ రాత్రే వాళ్లింట్లో దొంగలు పడ్డారు!’
‘పెద్దలు, పాతకాలం వాళ్ల సంగతి అటుంచు... పిల్లలూ ఈ మూఢనమ్మకాల్లో కొట్టుకుపోతుండటమే బాధ కలిగిస్తోంది. నా నేస్తం ఒకాయన శుక్రవారం గడ్డం చేసుకుంటుంటే ఆయన ఇంటర్‌ చదివే పుత్రుడు ఊరుకోవడంలేదట! అలా చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని అంటున్నాడట’
‘ప్రజల్లో వైజ్ఞానిక దృక్పథం పెంచాలని మన రాజ్యాంగం చెప్పింది కదా... దాన్ని పాలకులు పెడచెవిన పెట్టిన పాపమే ఇదంతా?’
‘కచ్చితంగా అంతే! అన్నం తినేటప్పుడు మెతుకులు వేళ్లను దాటి అరచేతికి అంటితే పేదరికం తప్పదని మా నాయనమ్మ యూట్యూబులో చూసిందట. అప్పటి నుంచి సంతృప్తిగా అన్నం కలుపుకొని తినే భాగ్యమే కరవైపోయింది నాకు!’
‘ఆ సంగతి అటుంచు... భోజనం చేస్తూ టీవీలో వార్తలు చూడటం నాకు అలవాటు. దానివల్ల ఉత్తరం వైపు ముఖం పెడుతున్నానట. అది మహా పాపమట. ఇంట్లో ఒకటే గోల! చేసేది లేక టీవీకి వీపు చూపించి వార్తలు వింటూ తింటున్నా’
‘బల్లి శకునాలది ఇంకా పెద్ద కథ. నా బంధువు ఒకాయన ఆఫీసుకు బయలుదేరే ముందు తలమీద బల్లి పడింది. దానివల్ల లేనిపోని గొడవలు తప్పవని యూట్యూబులో ఎవరో సెలవిచ్చారట. నువ్వు బయట కాలు పెట్టడానికి వీల్లేదు అని అర్ధాంగి ఒకటే ఏడుపు. అప్పటికప్పుడు సెలవు కోసం తన తాతను రెండోసారి చంపేసినందుకు ఇప్పటికీ బాధపడిపోతున్నాడు’
‘మాట్లాడితే రాహు, కేతువులు, ప్రాణ గండాలు అంటుంటారు కదా... లంచాల మేతకు, ప్రజల సొమ్ము దోచుకొనేటప్పుడు మన నేతలకు, అధికారులకు అవన్నీ అడ్డు రావా?’
‘సరేలేవయ్యా... మన ప్రజాస్వామ్యాన్ని స్వాహా చేస్తున్న పెద్ద రాహు, కేతువులు వాళ్లే కదా?’
‘సరిగ్గా చెప్పావు. ఇంట్లో మూడు మంచాలుంటే దారిద్య్రం, మూడు పొయ్యిలుంటే గొడవలు, ఫలానా తేదీల్లో పుడితేనే గొప్ప, కలలో పాము దర్శనమిస్తే పాపం, మంచం కింద చెప్పులు పెట్టుకుంటే చెడ్డ కలలు రావు, గురువారం రోజు గుమ్మానికి గంధం పూస్తే ఉద్యోగం ఖాయం, ఫలానా గదిలోనే జడ వేసుకుంటే అదృష్టం... చెప్పుకొంటూ వెళ్తే ఇలాంటివి కొల్లలు’
‘ఏమిచేస్తాం... తలరాతలు మారుస్తారని నేతలకు ఓట్లేసి గెలిపించుకొంటున్నాం. ఆపైన నిత్య ఖజానా నింపులాటలో మునిగే నాయకులకు సంక్షేమానికి, సామాన్యుల మొర ఆలకించడానికి సమయం ఎక్కడుంటాయి. అందుకే దిక్కుతోచని స్థితిలో ప్రజలు సొంత క్షేమం కోసం వారి పాట్లు వారు పడుతున్నారు. ఎటునుంచి ఏ ఆపద ముంచుకొస్తుందో అన్న అభద్రతలో తాయత్తులు, రక్ష రేఖలు, అద్భుతాలపై ఆశలు పెట్టుకుంటున్నారు. అసలూ, ప్రభుత్వం అంటూ ఒకటుందీ, మాకు ఏ కష్టం వచ్చినా ఆదుకొంటుంది అన్న నమ్మకం జనాల్లో ఉంటే ఇలాంటివన్నీ ఎందుకుంటాయి?’    

- వేణుబాబు మన్నం


మరిన్ని

ap-districts
ts-districts