ధర్మసూక్ష్మాలు

హాభారతం ధర్మసూక్ష్మాలు వివరించే జ్ఞానసాగరం. అహాన్ని తగ్గిస్తుంది. ఆవేశాన్ని అదుపు చేస్తుంది. మనసు మాలిన్యాలను ప్రక్షాళనం చేస్తుంది. మంచి నడతను నేర్పి జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కల్పిస్తుంది.

కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అడుగడుగునా పాండవులకు అనేక ధర్మసూక్ష్మాలు బోధిస్తూ వారిని విజయపథం వైపు నడిపించాడు. ఒక సందర్భంలో అర్జునుడిని అన్నను చంపిన పాపానికి ఒడిగట్టకుండా కాపాడాడు. కర్ణుడు సేనాపతిగా కురుక్షేత్ర సంగ్రామం భీకరంగా సాగుతోంది. కర్ణుడు పదునైన బాణాలతో యుధిష్ఠిరుణ్ని గాయపరిచినప్పుడు ధర్మరాజు బాధతో యుద్ధరంగం నుంచి వైదొలిగాడు. విషయం తెలుసుకున్న కృష్ణార్జునులు ధర్మరాజుకు ధైర్యం చెప్పడానికి శిబిరానికి చేరుకున్నారు. ఆ సమయంలో అర్జునుడు కర్ణుడిని చంపి ఆ విజయవార్త చెప్పడానికి శిబిరానికి వచ్చాడని భావిస్తున్న ధర్మరాజును నిరాశపరుస్తూ అర్జునుడు తాను కర్ణుడి వెంట ఉన్న రథికులను హతమార్చానని, గాయపడిన అన్నగారిని చూడటానికి శీఘ్రంగా యుద్ధభూమి నుంచి వచ్చేశానని చెబుతాడు.

బాణం దెబ్బలకు బాధపడుతున్న ధర్మరాజు కర్ణుడు ఇంకా జీవించి ఉన్నాడన్న వార్త జీర్ణించుకోలేక ఆగ్రహోదగ్రుడవుతాడు. కోపంతో రగిలిపోతూ కర్ణుడిని చంపలేక పారిపోయి వచ్చిన పిరికివాడని అర్జునుడిని నిందిస్తాడు. భగవానుడు శ్రీకృష్ణుడి సారథ్యంలో కూడా కర్ణుడిని జయించలేకపోయిన అర్జునుడి అసమర్థతను ఎత్తిపొడుస్తాడు. అంతటితో ఆగకుండా కోపావేశంతో కర్ణుడిని ఎదిరించే శక్తి లేకపోతే గాండీవం ధరించడం వృథా అని పేర్కొంటూ ఆ ధనుస్సును అర్జునుడి కన్న అస్త్రవిద్యలో మేటియైన మరొకరికి ఎవరికైనా ఇచ్చివేయడం ఉత్తమమని సలహా ఇస్తాడు. అన్నగారి మాటలకు కుపితుడైన అర్జునుడు ధర్మరాజును వధించడానికి కత్తి తీస్తాడు. శ్రీకృష్ణుడు వారించగా అర్జునుడు తన గాండీవాన్ని తనకంటే వీరులకు ఇవ్వాలని ఎవరైనా అంటే అలా అన్నవారిని వధిస్తానని ప్రతిజ్ఞ చేశానని, అన్నగారిని వధించకుండానే ప్రతిజ్ఞ నెరవేరే మార్గం చెప్పమని కృష్ణుణ్ని కోరతాడు.

శ్రీకృష్ణుడు ధర్మసూత్రాలు వివరిస్తూ, ‘ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోవడం అంత సులభంకాదు. మంచిచెడుల విచక్షణ తెలుసుకోగలగాలి. ఆ జ్ఞానం శాస్త్రం వల్ల అబ్బుతుంది. మాననీయులైన పురుషుడిని ‘నీవు’ అనే సంబోధనతో అవమానించి నిందిస్తే అతణ్ని చంపకనే చంపినట్లవుతుంది. అందువల్ల ధర్మరాజును అవమానిస్తూ మాట్లాడు, ఆ తరవాత అన్నగారి కాళ్లు పట్టుకుని అనుచితమైన మాటలతో నొప్పించినందుకు క్షమించమను. ఈ రీతిగా చేస్తే సోదరవధ చేయకుండానే నీ ప్రతిజ్ఞ నెరవేరినట్లవుతుంది’ అంటూ అర్జునుడికి హితోపదేశం చేస్తాడు. అర్జునుడు ధర్మరాజును అవమానించి వెనువెంటనే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆత్మహత్య చేసుకోబోతాడు.

‘ఎవరైతే తమ నోటితో తమ సుగుణాలను పొగుడుకుంటారో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు భావించవచ్చు’నని శ్రీకృష్ణుడు మరో ధర్మసూక్ష్మం వివరించి- సంకట స్థితి నుంచి బయటపడమని ఉపదేశిస్తాడు. వెంటనే అర్జునుడు తన విలువిద్యా చాతుర్యాన్ని పొగుడుకుంటూ తానొక మహావీరుడనని ప్రకటించుకుంటాడు. ఆ తరవాత అర్జునుడు అన్నగారి దీవెనలు అందుకుని శ్రీకృష్ణుడి సారథ్యంలో యుద్ధరంగానికి వెళ్ళి కర్ణుడిని హతమారుస్తాడు.

ఆవేశం అనర్థాలకు దారితీస్తుందని, కోపంతో మాట తూలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ సంఘటన విశదపరుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ్యులైన గురువులను, పెద్దలను తూలనాడకూడదని, ఆత్మస్తుతి ఆత్మహత్యతో సమానమని జగద్గురువు సందేశం. ఇతరులను నిందిస్తూ తమను తాము పొగుడుకునేవారు జీవితంలో ఏమీ సాధించలేరని తెలుసుకోవాలి.

- ఇంద్రగంటి నరసింహమూర్తి


మరిన్ని

ap-districts
ts-districts