అదిగో... నవ సాంకేతిక శకం!

సుదీర్ఘ ఎదురుచూపులు ఫలించాయి. దేశీయంగా అయిదోతరం (5జీ) వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సేవలు ప్రధాని మోదీ చేతుల మీదుగా మొన్న ఆరంభమయ్యాయి. మెరుపు వేగం, అధిక విశ్వసనీయత, గరిష్ఠ అనుసంధాన సాంద్రతల సమాహారమైన 5జీ సాంకేతికత- అంతర్జాల సమాచార బట్వాడాలోనే కాదు, వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులకూ ఆలంబన కానుంది. జీఎస్‌ఎంఏ ఇంటెలిజన్స్‌ నివేదిక ప్రకారం... 2023-2040 మధ్యకాలంలో భారత ఆర్థిక వ్యవస్థకు అది రూ.36.4 లక్షల కోట్ల మేరకు లబ్ధి చేకూర్చనుంది. వైద్యారోగ్యం, విద్య, వ్యవసాయం, చిల్లర వర్తకం, తయారీ, రవాణా, బ్యాంకింగ్‌ రంగాల్లో అభివృద్ధి, డిజిటలీకరణలను 5జీ జోరెత్తించగలదు. కొత్త ఉపాధి అవకాశాలెన్నింటికో అది ఆధారం కాగలదనే ఆశలూ మోసులెత్తుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 72 దేశాలకు చెందిన 1947కు పైగా నగరాలు ఇప్పటికే 5జీ ఫలాలను కొద్దోగొప్పో చవిచూస్తున్నాయి. చైనా, అమెరికా, దక్షిణ కొరియా, కెనడా, యూకేలతో పాటు ఫిలిప్పీన్స్‌, మలేసియా, అర్జెంటీనా, కెన్యా వంటివీ ఆ జాబితాలో కనిపిస్తాయి. కొవిడ్‌ సంక్షోభం, స్పెక్ట్రమ్‌ వేలంలో జాప్యం తదితరాల మూలంగా ఇండియాలోకి 5జీ రాక ఆలస్యమైంది. ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ప్రారంభమైన ఆ సాంకేతిక ప్రస్థానం- రెండు మూడేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 2023 చివరి నాటికే దేశంలోని ప్రతి పల్లెకూ ప్రపంచంలోనే అత్యుత్తమ 5జీ సేవలను అందుబాటు ధరలకే అందిస్తామని ప్రైవేటు సంస్థలు హామీ ఇస్తున్నాయి. ఆ మేరకు 5జీ స్వప్నాలు సంపూర్ణంగా ఈడేరేందుకు అత్యావశ్యకమైన మౌలిక వసతులు క్షేత్రస్థాయిలో ఎంతవరకు కొలువుతీరాయన్నదే ప్రధాన ప్రశ్న!

అయిదో తరం సాంకేతిక సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలంటే- టెలికాం టవర్లను ఆప్టికల్‌ ఫైబర్‌ తీగలతో అనుసంధానించడం అతికీలకం. అమెరికా, జపాన్‌, చైనాలు నిరుటికి తమ తమ దేశాల్లోని 80-90శాతం టవర్లను అలా కలిపాయి. దక్షిణ కొరియాలోనూ డెబ్భై శాతం వరకు ఆ పని పూర్తయ్యింది. ఇండియాలో మాత్రం 33శాతం టవర్లే ఫైబరైజ్‌ అయినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అటువంటి వాటి సంఖ్య కనీసం 70శాతానికి చేరితే తప్ప 5జీ ప్రయోజనాలు ప్రజలకు పరిపూర్ణంగా అందిరావు. ఆ కనీస లక్ష్యాన్ని చేరుకోవాలంటే- రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రవహించి తీరాలన్న కథనాలు వెలువడుతున్నాయి. రాబోయే వెయ్యి రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలనూ ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానిస్తామని 2020 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ప్రకటించారు. అది సాకారం కావాలంటే- ప్రస్తుతం జరుగుతున్న పనికి మూడున్నర రెట్ల స్థాయిలో రోజుకు 1,251 కిలోమీటర్ల వడితో కేబుళ్లు వేయాలన్నది అంచనా. పలు రాష్ట్రాలూ పురపాలక సంఘాల్లో భిన్న నిబంధనలు, సర్కారీ శాఖల నడుమ సమన్వయ రాహిత్యం వంటివి ఈ క్రమంలో పురోగతికి అవాంతరాలవుతున్నాయి. తాము చెల్లిస్తున్న సొమ్ముకు తగినట్లుగా నాణ్యతతో కూడిన సేవలు అందడం లేదని స్థానికంగా బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల నుంచి అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  మొబైల్‌ అంతర్జాలం, బ్రాడ్‌బ్యాండ్‌ డౌన్‌లోడ్‌ వేగాల్లో అనేక దేశాలతో పోలిస్తే ఇండియా వెనకబడి ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు చాటుతున్నాయి. సిగ్నళ్ల  లేమితో ఈమధ్య కాలంలో ఫోన్లు తరచూ మొరాయిస్తున్నాయి. దేశీయంగా ప్రాథమిక సదుపాయాల వృద్ధితోనే ఆయా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ‘డిజిటల్‌ ఇండియా’ ఘన ఆశయాలూ అప్పుడే నెరవేరతాయి!


మరిన్ని

ap-districts
ts-districts