తీరని కలగా సక్రమ ఎన్నికలు

ప్రత్యక్ష ఎన్నికలను సామాజిక విప్లవ సాధనాలుగా భారత రాజ్యాంగ నిర్మాతలు భావించారు. సార్వత్రిక వయోజన ఓటుహక్కులోంచి పురుడు పోసుకునే ప్రజాస్వామిక ప్రభుత్వాలు జనజీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని వారు  విశ్వసించారు. గడచిన ఏడున్నర దశాబ్దాలుగా జరుగుతున్నదేమిటి? డబ్బు మూటలూ ఓటి వాగ్దానాల ప్రలోభాలు, నేరచరిత నేతల దౌర్జన్యాలు, కులమతాలపై పార్టీల విద్వేష ప్రచారాలతో ఎన్నికల ప్రక్రియ దేశీయంగా ప్రతిసారీ పరువుమాస్తోంది. సిగ్గుమాలిన ఆ అవ్యవస్థకు ప్రతిఫలంగా భారత ప్రజాస్వామ్యం కరి మింగిన వెలగపండును తలపిస్తోంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సిన నిర్వాచన్‌ సదన్‌ ఏమో- కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్లుగా రెచ్చిపోయే నేతాగణాల నిర్వాకాలను చేష్టలు దక్కి చూస్తోంది. దాని ప్రతిష్ఠ తిరిగి నిలబడాలంటే- సుప్రీంకోర్టు తాజాగా స్పష్టీకరించినట్లు, న్యాయబద్ధమైన పారదర్శక పద్ధతిలోనే ఎన్నికల కమిషనర్లు నియుక్తులు కావాలి. రాజకీయ రాగద్వేషాలకు లోబడకుండా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగే వ్యక్తిత్వ సంపన్నులే ఆ కీలక పదవుల్లోకి రావాలి. ఎన్నికల యంత్రాంగం కచ్చితంగా కార్యనిర్వాహక ప్రభుత్వ నియంత్రణకు వెలుపలే ఉండాలని రాజ్యాంగ సభ చర్చల్లో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ ఉద్ఘాటించారు. ఎన్నికల కమిషనర్ల నియామక విధానంలోని లొసుగుల కారణంగా ఈసీ స్వతంత్రతకు పెనుముప్పు వాటిల్లుతుందని ఆనాడే హెచ్చరించిన సభ సభ్యులు ఆచార్య ఎస్‌.ఎల్‌.సక్సేనా- మూడింట రెండొంతుల మెజారిటీతో పార్లమెంటు ఆమోదించిన వ్యక్తులనే కమిషనర్లుగా కొలువుతీర్చాలని సూచించారు. ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులైన సంఘం ద్వారా కమిషనర్లను ఎంపిక చేయాలని ఏడేళ్ల క్రితం లా కమిషన్‌ సిఫార్సు చేసింది. అటువంటి మేలిమి సూచనలకు చెదలు పడుతున్న దుస్థితిలో- రాజ్యాంగబద్ధమైన నిష్పాక్షిక వ్యవస్థగా ఈసీపై ప్రజావిశ్వాసం పోనుపోను అడుగంటిపోతోంది!

పండిత నెహ్రూ అభివర్ణించినట్లు- భారతదేశానికి సేవ చేయడమంటే కోట్లాది బాధితులకు సేవ చేయడం. దాని అర్థం దారిద్య్రం, అజ్ఞానం, అనారోగ్యం, అవకాశాలలో అసమానతలను నిర్మూలించడం. అది... నాయకులందరి విధివిహిత కర్తవ్యం. ఆ మేరకు జనం బాగుకోసం తాము వహించే సంకల్ప దీక్షా వివరాలను ఎన్నికల ప్రచారంలో నేతాగణాలు స్పష్టంచేయాలి. గెలిచి అధికారంలోకి వస్తే- వ్యవసాయం, పారిశ్రామికం తదితర రంగాల అభ్యున్నతికి తామేమి చేస్తామో కూలంకషంగా విశదీకరించాలి. జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్య వ్యవస్థల స్వతంత్రత, సామాజిక దుర్విచక్షణల నిర్మూలన, ఉపాధి కల్పన వంటివాటికి ప్రోదిచేసే ప్రణాళికలను ప్రజలకు నివేదించి... వారి తీర్పు కోరాలి. కానీ, వెర్రితలలు వేస్తున్న ప్రస్తుత నాయకస్వామ్యం ఏం చేస్తోంది? వర్గాల వారీగా ఓటుబ్యాంకులకు మాయవలలు విసురుతూ- అంగ, అర్థబలాలతో ఎన్నికల్లో నెగ్గుకొస్తోంది. ‘రాజకీయ నాయకులు చేసే ప్రజాస్వామ్య దోపిడిని నేను అనుమతించాలంటారా’ అని నిగ్గదీస్తూ నిర్వాచన్‌ సదన్‌ శక్తి ఎంతటిదో సీఈసీగా శేషన్‌ చాటిచెప్పారు. ఈసీ అనేది కేంద్ర ప్రభుత్వ ఉపాంగం కానేకాదని జనానికి తొలిసారి తెలిసి వచ్చేలా- ఎన్నికల ప్రక్రియను పరిహసిస్తున్న అనేక అవకతవకలను తన జమానాలో ఆయన అరికట్టారు. రాజకీయ పార్టీలతో అంటకాగిన కళంకిత చరిత్ర కలిగిన నవీన్‌ చావ్లా వంటివారు ఆ తరవాత ఆ పదవిలోకి చొరబడ్డారు. రాజకీయ పక్షాలన్నింటికీ ఎన్నికల కమిషనర్లు సమదూరంలో ఉండాలన్న రాజ్యాంగ  ధర్మానికి వాళ్లు నీళ్లొదిలేశారు. దానికితోడు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి చెల్లుకొట్టడం నుంచి ప్రజాస్వామ్య ప్రమాణాలను పెళ్లగించడం వరకు సర్వవిధ దుర్విధానాల్లో అన్ని పార్టీలూ ఒకే తల్లిబిడ్డలుగా వ్యవహరిస్తున్నాయి. అధికార దుర్వినియోగంతో పదవీపీఠాలను పదిలపరచుకొంటున్న వాటి విధ్వంస పోకడలకు అడ్డుకట్ట పడాలంటే- ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్రధారిగా ఈసీని పరిపుష్టం చేయాలి. చట్టం, ప్రజానీకాలకు మాత్రమే జవాబుదారీ అయ్యేలా దాన్ని తీర్చిదిద్దాలి. సాటిలేని ప్రజాసేవకగణాలుగా తమనుతాము అభివర్ణించుకునే పాలకపక్షాల చిత్తశుద్ధికి అదే గీటురాయి!


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని