మొసలికి గుణపాఠం

అదో పెద్ద అడవి. అక్కడ జంతువులన్నీ ఐకమత్యంతో జీవిస్తాయి. ఏ చిన్న సమస్య వచ్చినా మృగరాజు సింహం చిటికెలో పరిష్కారం చూపిస్తుంది. ఆ అడవిలోని జీవులన్నీ దాహం తీర్చుకోవడానికి ఓ పెద్ద చెరువు ఉంది. అది అన్ని కాలాల్లోనూ దాహం తీరుస్తుంది. కాస్త సమయం దొరికితే, జంతువులన్నీ ఆ చెరువులో సరదాగా జలకాలాడతాయి. ఏనుగులు, ఖడ్గమృగాలు నీళ్లలోంచి త్వరగా బయటకు రావటానికి ఇష్టపడవు. జింకలు, జిరాఫీలు, దున్నలు, ఎలుగుబంట్లు, కుందేళ్లు.. చెరువు ఒడ్డున చల్లటి గాలి కోసం ఆరాటపడుతుంటాయి. చెరువును ఆనుకొనే ఉన్న చెట్ల మీద పక్షులకు కొదవలేదు. వాటి కిలకిలరావాలతో పరిసరాలు ఆహ్లాదంగా ఉంటాయి. చెరువు చుట్టూరా బోలెడు చెట్లు ఉండేవి. చెట్లు చెరువు వైపు వాలి ఉండటం జంతువులకు బాగా కలిసొచ్చింది. మధ్యమధ్యలో కొమ్మల మీద నుంచి చెరువులోకి దూకటం వాటికి సరదా. పిల్ల జంతువులైతే పండ్లు కోసుకొని.. చెరువు నీటిలో ఆడిపాడుతూ హాయిగా ఆరగించేవి. ఇక కోతుల చేష్టలు చెప్పనక్కర్లేదు. అవి పండ్లు తింటూ.. మిగతా జంతువులకూ అందజేసేవి.

అలా ప్రశాంతంగా సాగిపోతున్న ఆ అడవిలోకి ఎక్కడ నుంచో ఒక మొసలి వచ్చింది. దానికి చెరువు తెగ నచ్చేసింది. విశాలంగా, లోతుగా ఉన్న నీటిలోకి మెల్లగా ప్రవేశించింది. ఒకవైపు చెట్ల నీడ, మరోవైపు ఆహారానికి కొదవ లేకపోవడంతో శాశ్వత స్థావరంగా మార్చుకుంది. చెరువు వద్దకు వచ్చే జంతువులతో మాటామాటా కలిపింది. వాటితో స్నేహం పెంచుకుంది. కొద్దిరోజుల్లోనే అవి కూడా మొసలితో కలిసిపోయాయి. పిల్ల జంతువులను మొసలి తన వీపు మీద కూర్చోబెట్టుకొని చెరువు మొత్తం తిప్పేది. వాటికి కూడా అలా తిరగటం సరదాగా ఉండేది. చీకటి పడగానే జంతువులన్నీ వాటి స్థావరాలకు వెళ్లిపోయేవి. ఇలా జంతువుల కబుర్లన్నీ చెరువు వద్దనే సాగిపోయేవి.

ఒకరోజు మృగరాజు గుహ బయట సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశానికి జంతువులు, పక్షులు హాజరయ్యాయి. సింహానికి ఏదో అనుమానం వచ్చింది. హాజరైన జంతువులను లెక్కించమని ఎలుగుబంటిని ఆదేశించింది. అది లెక్కించి చెప్పగా.. అడవిలోని జీవుల సంఖ్య తగ్గినట్లు గుర్తించింది సింహం. సమావేశంలో ప్రస్తావించాల్సిన విషయాలను పక్కనబెట్టి.. అడవిలో తగ్గుతున్న జంతువుల సంఖ్యపై ప్రశ్నించింది. జీవులన్నీ భయంతో ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. సింహం చెప్పినట్లు తమ మధ్య నిత్యం తిరిగే.. కొన్ని జంతువులు కనబడక పోవటంతో ఆందోళన చెందాయి. సింహం జంతువులను ఉద్దేశించి.. ‘అడవిలోకి వేటగాళ్లు రావటం లేదు. పక్క అడవి నుంచి కూడా జంతువుల దాడులు లేవు. అయినా సంఖ్య ఎందుకు తగ్గుతుంది?’ అని ప్రశ్నించింది. ఆ మాటతో జీవులన్నీ బిత్తరపోయాయి. వాటి ముఖాల్లో భయం ప్రత్యక్షమైంది. ఒకదానికొకటి దగ్గరగా జరిగాయి. మృగరాజు ఇంకా ఏం మాట్లాడుతుందోనని ఆందోళనతో వినసాగాయి.

ఇంతలో అక్కడికి ఒక తాబేలు వచ్చింది. వస్తూనే.. ‘మృగరాజా.. ఈ మధ్య పరిశుభ్రంగా ఉండే చెరువులో ఎముకలు, మాంసం ముద్దలు కనబడుతున్నాయి. నాకు ఎందుకో మొసలి మీద అనుమానంగా ఉంది’ అని చెప్పింది. సింహానికి అప్పుడు అర్థమైంది.. జంతువుల సంఖ్య తగ్గటానికి మొసలే కారణమని! అప్పటి నుంచి చెరువు దగ్గరకు ఎవరూ వెళ్లవద్దని జంతువులను ఆదేశించింది. అయినా మొసలిని ఒక కంట కనిపెట్టమని పక్షులను ఆజ్ఞాపించింది. రెండ్రోజుల తరవాత పక్షులు సింహం దగ్గరకు వెళ్లి.. ‘మీరు చెప్పింది నిజమే మృగరాజా.. రాత్రి చెరువు గట్టున నిద్రపోతున్న ఓ కోతి పిల్లను, మొసలి చంపి తినటం మా కళ్లారా చూశాం’ అన్నాయి. సింహం జంతువులతో మళ్లీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. చెరువులోకి ఎవరూ వెళ్లకూడదని ఆదేశించింది. ‘మరి దాహం ఎలా తీర్చుకోవాలి?’ అని జంతువులు ప్రశ్నించాయి.

సింహం తన ఆలోచనను జంతువుల ముందుంచింది. మొసలి చెరువులో నుంచి బయటకు రాకుండా.. జంతువులు వాటి పని  మొదలుపెట్టాయి. ముందుగా ఏనుగులు తొండాలతో పెద్ద పెద్ద చెట్లను పెకిలించి తీసుకొచ్చాయి. వాటిని ఎలుగుబంట్లు చెరువు చుట్టూరా భూమిలో పాతాయి. దాంతో మొసలికి చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ తర్వాత జంతువులన్నీ చెరువుకు సమీపంలో భారీ గుంత తవ్వకం మొదలుపెట్టాయి. పనులు పూర్తయ్యాక చెరువు నీరు ఆ గుంతలోకి మళ్లించటానికి కాలువ తవ్వాయి. ఇంకేముంది.. చెరువు నీరు గలగలా, ఆ గుంతలోకి రావటం ప్రారంభించింది. చెరువులో నీరు తగ్గిపోవటంతో మొసలికి అసలు విషయం అర్థమైంది. జంతువులను చంపి తినటం వల్లే తనకీ దుస్థితి ఏర్పడిందని తెలుసుకుంది. తన తప్పును జంతువుల ముందు ఒప్పుకొంది. మృగరాజు క్షమాభిక్ష పెట్టడంతో బతుకుజీవుడా అనుకుంటూ అడవి నుంచి బయటపడింది.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


మరిన్ని

ap-districts
ts-districts