పుట్టినరోజుకో కేకు!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. పుట్టినరోజు ఎప్పుడెప్పుడొస్తుందా అని మనలాంటి పిల్లలంతా ఎదురు చూస్తుంటాం కదా. ఎంచక్కా స్నేహితులనూ, చుట్టుపక్కల వారినీ, బంధువులనూ పిలిచి కేక్‌ కటింగ్‌ చేస్తుంటాం. ఇంట్లో ఎంత గ్రాండ్‌గా అయినా, స్కూల్‌లో మిత్రులందరి మధ్య సెలబ్రేట్‌ చేసుకున్నంత సందడి ఉండదు. కానీ, ఓ మారుమూల గ్రామంలోని పిల్లలకు మాత్రం బడిలోనే కేక్‌ కోసే ఛాన్స్‌ దక్కింది. ఆ వివరాలేంటో చదివేయండి మరి.

రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపుర్‌కు దగ్గరలో కొన్ని గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఆ ఊళ్లలోని చాలామంది పిల్లలు బడికి కాకుండా తల్లిదండ్రులతో కలిసి పనికో, ఇంట్లోనే ఉండి చిన్నపిల్లలను చూసుకోవడమో చేసేవారు. అటువంటి ఓ గ్రామంలో పూర్తిగా మార్పు తీసుకొచ్చారు స్వాతి టీచర్‌. అంతేకాదు.. చుట్టుపక్కల ఊళ్లలో ‘కేక్‌-వాలీ-టీచర్‌’గానూ పేరు తెచ్చుకున్నారామె.

హాజరును బట్టి కేకు..
టీచర్‌గా కొత్తగా చేరిన స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు స్వాతి గుర్తించారు. కొందరు పిల్లలు పెద్దలతో కలిసి పనికి వెళ్తున్నట్లు, ఇంకొందరు ఇంటి దగ్గరే ఉంటున్నట్లు ఆమెకు తెలిసింది. పిల్లలను ఎలాగైనా బడికి రప్పించాలనుకొని, ఓ ఉపాయం ఆలోచించారు. బడిలో చదివే విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా కేకు తెప్పించి.. అందరితో కలిసి కోయించడం ప్రారంభించారు. అయితే, అది మారుమూల ప్రాంతం కావడంతో కేకులు దొరకడం కష్టంగా మారింది. దాంతో ఈ టీచరే.. సొంతంగా కేకులు తయారు చేయడం నేర్చుకున్నారు. ఆమె భర్త స్టేషనరీ దుకాణం నిర్వహిస్తుండటంతో, బడిలో పుట్టినరోజు నిర్వహణకు అవసరమైన సామగ్రిని అక్కడి నుంచే తీసుకొచ్చేవారామె. పాఠశాలలో హాజరు శాతం ఎంత ఎక్కువుంటే, అంత పెద్ద కేకు కోయిస్తానని టీచర్‌ ప్రకటించారు. దాంతో బడికి వచ్చేందుకు విద్యార్థులు పోటీలు పడసాగారు.

మరి సెలవు రోజొస్తే..
‘ఎవరిదైనా పుట్టినరోజు ఆదివారమో, సెలవు రోజో వస్తే ఎలా?’ అనే అనుమానం మీకు వచ్చే ఉంటుంది. అటువంటి సందర్భాల్లోనూ స్వాతి టీచర్‌.. స్వయంగా ఆ విద్యార్థి ఇంటికి వెళ్లి మరీ కేక్‌ కోయిస్తారట. ఈ ఆలోచన చిన్నారులతోపాటు తల్లిదండ్రులకూ నచ్చడంతో, బడికి వచ్చే విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది. కేక్‌ కటింగ్‌తోపాటు ఆ విద్యార్థికి అవసరమైన పెన్నులూ, పుస్తకాలూ, ఇతర సామగ్రినీ అందిస్తారట. స్నాక్స్‌ కూడా పంపిణీ చేస్తారట. బయట బేకరీల్లో దొరికే కేకుల కంటే టీచర్‌ సొంతంగా తయారు చేసినవే చాలా రుచిగా ఉంటున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. నిజంగా బర్త్‌డేను స్కూల్‌లో జరుపుకొంటే ఆ కిక్కే వేరు కదూ!


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని